రాజధానిలో సుజనా భూములు ఇవే : బయటపెట్టిన మంత్రి బొత్స

  • Published By: chvmurthy ,Published On : August 27, 2019 / 12:45 PM IST
రాజధానిలో సుజనా భూములు ఇవే : బయటపెట్టిన మంత్రి బొత్స

అమరావతి : ఏపీ రాజదాని అమరావతి ప్రాంతంలో తనకు కానీ, తన కుటుంబ సభ్యులకు కానీ భూములు లేవని అన్న కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ సుజనా చౌదరికి ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. సుజనా చౌదరి కుటుంబ సభ్యులకు రాజధాని ప్రాంతంలో ఉన్న ఆస్తుల వివరాలను ఆయన మంగళవారం(ఆగస్టు 27,2019) అమరావతిలో వివరాలతో సహా బయటపెట్టారు.

సుజనా చౌదరికి 120 కంపెనీలు ఉన్నాయని అందులో సుజనా చౌదరి కజిన్ జితిన్ కుమార్ కు కళింగ గ్రీన్ టెక్ పేరుతో చందర్లపాడు మండలం గుడిమెట్లలో 110 ఎకరాలు ఉన్నాయని బొత్స ఆధారాలతో సహా బయట పెట్టారు. సుజనా చౌదరి సోదరుడి కుమార్తె యలమంచిలి రుషికన్యకు వీరులపాడు మండలం గోకరాజు పాలెంలో 14 ఎకరాలు భూమి ఉందని బొత్స తెలిపారు. ఈ భూములను క్యాపిటల్ రీజియన్ లోకి తీసుకొచ్చారని..దీన్ని ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటారా….క్విడ్ ప్రో కో అంటారో …. సుజనానే చెప్పాలన్నారు. క్యాపిటర్ రీజియన్ పేరుతో టీడీపీ నేతలు దోచుకుతిన్నారని బొత్స ఆరోపించారు. 

నాకు కానీ, నా కుటుంబ సభ్యులకు కానీ రాజధాని ఏరియాలో సెంటు భూమి కూడా లేదని చెబుతున్న సుజనా చౌదరి.. దీనికి ఏం సమాధానం చెబుతారని బొత్స ప్రశ్నించారు. ఇప్పుడు జాతీయ పార్టీలో ఉన్నారు కనుక జాగ్రత్తగా మాట్లాడాలని సుజనాకు హితవు పలికారు బొత్స. చొక్కాలు మార్చినట్లు రాజధానిని మార్చడం సరికాదని సుజనా అంటున్నారని…ఆయన పార్టీలు మార్చినట్లు మాట మార్చటం సరికాదని బొత్స వ్యాఖ్యానించారు. రాజధాని అంటే ఒక సామాజిక వర్గానిది కాదని 13 జిల్లాల్లోని అందరిదీ అని బొత్స తెలిపారు.