ఏపీ ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ. 10 వేలు : సెప్టెంబర్ 10నుంచి దరఖాస్తులు

  • Published By: madhu ,Published On : September 4, 2019 / 10:40 AM IST
ఏపీ ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ. 10 వేలు : సెప్టెంబర్ 10నుంచి దరఖాస్తులు

సొంతంగా ఆటో, ట్యాక్సీ ఉన్న వారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఏడాదికి రూ. 10 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే..సొంతంగా వాహనాలు (ఆటో, ట్యాక్సీ) ఉంటూ..జీవనం గడుపుతూ కష్టాలు పడుతున్న వారిని ఆదుకుంటామని..ఎన్నికల సందర్భంగా జగన్ హామీనిచ్చిన సంగతి తెలిసిందే. ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను అమలు చేస్తున్నారు సీఎం జగన్. నవరత్నాల పేరిట ప్రజాకర్షక పథకాలు ప్రకటిస్తున్నారు. తాజాగా ఏపీ కేబినెట్ ఈ విషయంపై చర్చించింది. రూ. 10 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. కేబినెట్‌కు సంబంధించిన వివరాలను మంత్రి పేర్ని నాని మీడియాకు తెలిపారు. 

ప్యాసింజర్, ఆటోలు ఏడాదికి రూ. 10 వేలు ఇవ్వాలని (భార్య – భర్త ఒక యూనిట్‌గా లెక్కింపు). మేజర్ అయిన కూతురు లేదా కొడుకు సొంత ఆటో లేదా ట్యాక్సీ ఉంటే వారికి కూడా ఏటా రూ. 10 వేలు అందించేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. సుమారు రూ. 400 కోట్ల భారం ప్రభుత్వంపై పడుతుందని…4 లక్షల మందికి లబ్ది చేకూరబోతోందన్నారు. సెప్టెంబర్ 10వ తేదీ నుంచి ఆన్ లైన్‌లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయన్నారు. సెప్టెంబర్ నాలుగో వారంలో దరఖాస్తులన్నింటినీ స్క్రూటీని చేసి..పథకానికి మంజూరు చేస్తామని, లబ్దిదారులకు నేరుగా బ్యాంకులో నగదు జమ చేస్తామన్నారు. 

ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఫిట్ నెస్ సర్టిఫికేట్ కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సర్టిఫికేట్ పొందాలంటే..ఇన్సూరెన్స్, రోడ్ ట్యాక్స్ కట్టడం తప్పనిసరి. ఏడాదికి వీటికయ్యే ఖర్చు రూ. 10 వేలు ఉంటుందని అంచనా. పూటగడవని వారికి పెనుభారంగా మారింది. ఈ భారం వారిపై పడకూడదనే ఉద్దేశ్యంతో వైసీపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 
Read More : రాష్ట్రాలకు ఇసుక సరఫరాపై నిషేధం..ఏపీ కేబినెట్ నిర్ణయం