మమతకు హైకోర్టు షాక్…ఆ ప్రకటనలు నిలిపివేయండి

మమతకు హైకోర్టు షాక్…ఆ ప్రకటనలు నిలిపివేయండి

వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోల్ కతా హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. పౌరసత్వ సవరణ చట్టం(CAA),జాతీయ పౌరసత్వ నమోదు(NRC)కి వ్యతిరేకంగా తృణముల్ కాంగ్రెస్ ప్రభుత్వం టీవీల్లో ఇస్తున్న ప్రకటనలను హైకోర్టు తప్పుబట్టింది. బెంగాల్ ప్రభుత్వం  ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా ప్రకటనలు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు.

దీనిపై సోమవారం(డిసెంబర్-23,2019)విచారణ జరిపిన వెస్ట్ బెంగాల్ హైకోర్టు…పౌరసత్వ సవరణ చట్టం(CAA), జాతీయ పౌరసత్వ నమోదు(NRC)లకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బ్యానర్లు, పోస్టర్లు తొలగించాలంటూ ఆదేశించింది. సీఏఏ, ఎన్సార్సీలను పశ్చిమ బెంగాల్లో అమలు చేయబోమంటూ ఇస్తున్న అన్ని ప్రకటనలను వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇవాళ కోల్ కతాలో సీఏఏకు మద్దతుగా బీజేపీ మెగా ర్యాలీ నిర్వహించిన సమయంలో కోర్టు తీర్పు వచ్చింది. కాగా సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా ప్రస్తుతం ప్రకటనలు నిలిపేశామని ప్రభుత్వం తరపు న్యాయవాది జనరల్ కిషోర్ దుత్తా చెబుతున్నప్పటికీ… పశ్చిమ బెంగాల్ పోలీస్ వెబ్‌సైట్‌లో ఇప్పటికీ ప్రకటనలు కనిపిస్తున్నాయని పిటిషనర్లు తెలిపారు. దీనిపై తదుపరి విచారణను జనవరి-9,2020కి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది.

సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం సీఏఏ, ఎన్నార్సీలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు పశ్చిమ బెంగాల్లో సీఏఏ, ఎన్సార్సీలను అమలు చేయబోమని ఇప్పటికే టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. దమ్ము ఉంటే తన ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసుకోవచ్చని కేంద్రానికి ఆమె సవాల్ విసిరారు. అయితే ఏది ఏమైనా పౌరసత్వ సవరణ చట్టాన్ని అమయలు చేసి తీరుతామని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. బెంగాల్ లో మమత ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుందని,సీఏఏపై అసత్య ప్రచారాలు చేస్తుందని మోడీ ఆదివారం ఢిల్లీ ఎన్నికల ర్యాలీలో విమర్శించిన విషయం తెలిసిందే.