ఆ కొత్త నేత ఎవరో?: కుప్పంపై మంత్రి పెద్దిరెడ్డి టార్గెట్‌!

  • Published By: sreehari ,Published On : January 2, 2020 / 01:14 PM IST
ఆ కొత్త నేత ఎవరో?: కుప్పంపై మంత్రి పెద్దిరెడ్డి టార్గెట్‌!

చిత్తూరు జిల్లా కుప్పం… టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కంచుకోట. ఏడుసార్లు కుప్పం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1989లో తొలిసారి చంద్రబాబు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. మూడు దశాబ్దాలుగా కుప్పం వాసులు చంద్రబాబుకు పట్టం కడుతున్నారు. 1989 ఎన్నికల్లో చంద్రబాబు నాటి కాంగ్రెస్ అభ్యర్థి వెంకటస్వామి నాయుడును ఎదుర్కొని కుప్పంలో తొలి విజయం అందుకున్నారు. అప్పటి నుంచి వరుసగా విజయాలను అందుకుంటూ వస్తున్నారాయన. ఇక 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన చంద్రమౌళితో పోటీ పడి గెలిచారు చంద్రబాబు. ఇప్పుడు చంద్రమౌళి అనారోగ్యం పాలయ్యారు. ఆయన స్థానంలో వైసీపీ కొత్త నేతను వెతికే పనిలో ఉందంటున్నారు.

చంద్రమౌళి గ్రూప్-1 అధికారి. ఐఏఎస్ హోదాలో రిటైర్ అయ్యి వైసీపీలో చేరారు. గడచిన రెండు ఎన్నికల్లో చంద్రబాబుపై పోటీ చేసి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే గడిచిన ఏడాది కాలంగా చంద్రమౌళి అనారోగ్యంతో బాధపడుతున్నారు. మొన్నటి ఎన్నికలకు ముందు ఆయన కనీసం కుప్పంకు రాలేకపోయారు.

ఎన్నికల సమయంలో ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ అయి చికిత్స పొందారు. ఫలితాలు వెలువడిన తర్వాత ఈ ఆరు నెలల కాలంలో ఆయన రెండుమార్లు కుప్పం వచ్చారు. ఎక్కువ సమయం హైదరాబాద్‌లోని ఇంటికే పరిమితం అవుతున్నారు. చంద్రమౌళి కుమారుడు భరత్ కుప్పంలో కాస్త చురుగ్గా తిరుగుతున్నారు.

ఆయనకు నామినేటెడ్ పదవి? :
చంద్రమౌళి అనారోగ్యం నేపథ్యంలో కుప్పం వైసీపీ ఇన్‌చార్జి బాధ్యతల నుంచి తప్పిస్తారని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆయనకు రాష్ట్ర స్థాయిలో ఓ నామినేటెడ్ పదవి అప్పగిస్తారని అంటున్నారు. కుప్పం వైసీపీ ఇన్‌చార్జి బాధ్యతలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం నుంచి ఓ యువ నేతకు కట్టబెడతారని ఆ నోటా ఈ నోటా వినిపిస్తోంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడైన భాస్కర్ రెడ్డి కుమారుడు సుధీర్‌రెడ్డికి ఈ బాధ్యతలు అప్పగిస్తారనే టాక్‌ జిల్లాలో నడుస్తోంది. పెద్దిరెడ్డి భాస్కర్ రెడ్డి కొన్నేళ్ల క్రితం హత్యకు గురయ్యారు. అప్పటి నుంచి కుమారుడు సుధీర్‌రెడ్డి ఆలనాపాలనా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చూస్తున్నారు.

సుధీర్‌రెడ్డికి రాజకీయాల పట్ల ఉన్న ఆసక్తిని పెద్దిరెడ్డి గమనించారట. ఈ నేపథ్యంలో తన నియోజకవర్గమైన పుంగనూరులో కీలకమైన సోమల మండల వ్యవహారాలను సుధీర్ రెడ్డికి అప్పగించారు పెద్దిరెడ్డి. యువకుడైన సుధీర్ రెడ్డి సైతం గత కొంతకాలంగా చురుగ్గా రాజకీయాల్లో పాల్గొంటున్నారు. తన పెదనాన్న అడుగుజాడల్లోనే వెళుతున్నారు. రాజకీయాల్లో మరింత చురుకైన పాత్ర పోషించడానికి సుధీర్‌రెడ్డి సిద్ధంగా ఉన్నారంటున్నారు. ఆయనకు కుప్పం బాధ్యతలు అప్పగిస్తారని ఇప్పుడు ప్రచారం జరుగుతోంది.

కుప్పం బరిలోకి సుధీర్ రెడ్డి? :
మంత్రి పెద్దిరెడ్డికి జిల్లా పార్టీపై గట్టిపట్టు ఉన్న సంగతి తెలిసిందే. ఆయన పుంగనూరు నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తుండగా, చిన్న సోదరుడు ద్వారకనాథరెడ్డి మొన్నటి ఎన్నికల్లో తంబలపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కుమారుడు మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీగా కొనసాగుతున్నారు. పెద్దిరెడ్డి కుటుంబం నుంచి ఇప్పటికే ముగ్గురు కీలక పదవుల్లో ఉండగా, తాజాగా పెద్దిరెడ్డి మరో సోదరుడి కుమారుడు సుధీర్ రెడ్డిని నేరుగా కుప్పం నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దించుతారని అంటున్నారు. కుప్పంలో చంద్రబాబు ఆధిపత్యం క్రమంగా తగ్గుతోందని భావిస్తున్నారు.

2004 ఎన్నికల్లో చంద్రబాబుకు 60 వేల ఓట్ల మెజార్టీ రాగా, మొన్నటి ఎన్నికల్లో కేవలం 30 వేల ఓట్ల మెజార్టీ వచ్చింది. ఈ లెక్కలు బేరీజు వేసుకుని గట్టి ప్రత్యర్థిని కుప్పం బరిలో దింపాలన్నది పెద్దిరెడ్డి ఆలోచనగా చెబుతున్నారు. సొంత సోదరుడి కుమారుడినే కుప్పం బరిలో దింపి చంద్రబాబుకు చెమటలు పట్టించాలన్నది పెద్దిరెడ్డి వ్యూహమని అంతా అనుకుంటున్నారు. కాకపోతే ఇందుకోసం చాలా కష్టపడాల్సి ఉంటుందని అంటున్నారు. ఎందుకంటే ఎప్పటి నుంచో పాతుకుపోయిన చంద్రబాబును ఢీకొనడం అంత సులువు కాదన్నది తెలిసిందే. మరి భవిష్యత్తు రాజకీయాలు ఎలా మారతాయో చూడాల్సిందే.