New Parliament : కొత్త పార్లమెంట్ భవనం ప్రత్యేకతలు .. ఈఅద్భుత భవనం డిజైనర్ ఎవరో తెలుసా?

కొత్త పార్లమెంట్ భవనం 150 సంవత్సరాలకు పైగా నిర్మాణం మన్నేలా నిర్మాణం. జోన్-5 భూకంపాలను సైతం ఈ భవనం తట్టుకోగల సత్తా.

New Parliament :  కొత్త పార్లమెంట్ భవనం ప్రత్యేకతలు .. ఈఅద్భుత భవనం డిజైనర్ ఎవరో తెలుసా?

New Parliament Specialties

New Parliament Building : అద్భుతమైన కళాకృతులు, నిర్మాణ కౌశలంతో కొత్త పార్లమెంట్ భవనం రూపుదిద్దుకుంది. టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ దీనిని నిర్మించింది. 150 సంవత్సరాలకు పైగా నిర్మాణం మన్నేలా భవనాన్ని కట్టారు. జోన్-5 భూకంపాలను సైతం ఈ భవనం తట్టుకోగలదు. 60వేలమంది కార్మికులు 20లక్షల 90వేలకు పైగా గంటలు పనిచేసి కొత్త నిర్మాణాన్ని కొలువుదీర్చారు. మొత్తంగా నిర్మాణానికి రెండేళ్ల 5 నెలల 18 రోజుల సమయం పట్టింది. నిర్మాణానికి తొలుత అంచనా వ్యయం 862 కోట్లుగా భావించగా..పూర్తయ్యేసరికి 12వందల కోట్లకు చేరింది. అహ్మదాబాద్‌కు చెందిన HCP డిజైనర్ బిమల్ పటేల్…డిజైన్ రూపొందించారు.

నియోజకవర్గాలు పునర్‌విభజించే అవకాశం..ఆధునిక వసతులతో కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం
ప్రస్తుతం అందుబాటులో ఉన్న పార్లమెంట్ భవనం దేశ అవసరాలకు సరిపోవడం లేదు. నియోజకవర్గాలు పునర్‌విభజించే అవకాశం ఉండడంతో పాటు అధునాతన సౌకర్యాలు కల్పించేందుకు వీలుకాపోవడం..కొత్త నిర్మాణానికి దారితీశాయి. వందేళ్ల చరిత్ర ఉన్న భవనంలో ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చేయాల్సి రావడం….కష్టతరంగా మారుతోంది. పార్లమెంట్ సమావేశాల సమయంలో సంయుక్త సమావేశాలు నిర్వహించేందుకు సెంట్రల్‌ హాల్‌లో స్థలం సరిపోవడం లేదు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కొత్త నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆజాదీకీ అమృత మహోత్సవాల వేళ ప్రజాస్వామ్య భారతానికి…సమున్నత చిహ్నంగా సగర్వంగా కొత్త పార్లమెంట్ భవనం అందుబాటులోకి వస్తోంది.

ఆరు ఎకరాల్లో పాత పార్లమెంట్ 16 ఎకరాల్లో కొత్త పార్లమెంట్ భవనం..
పాత పార్లమెంట్ భవనం నిర్మాణానికి ఆరేళ్ల సమయం పట్టింది. బ్రిటిష్ కాలంలో 1921లో నిర్మాణం ప్రారంభం కాగా, 1927లో పూర్తయింది. ఆరు ఎకరాల్లో పాత పార్లమెంట్ భవనం ఉండగా….కొత్త భవనం 16 ఎకరాల్లో నిర్మితమైంది. కొత్త భవనంలో సెంట్రల్ హాల్ లేదు. ఉభయసభల సంయుక్త సమావేశాలకు లోక్‌సభనే వాడుకుంటారు. పాత భవనంలో లోక్‌సభ సభ్యుల కోసం 552 సీట్లు ఉంటే..కొత్త భవనంలో 888 సీట్లు కేటాయించారు. మొత్తంగా 1272 మంది కూర్చునే అవకాశం ఉంది. ప్రతి సభ్యుడి సీటు దగ్గర మల్టీమీడియా డిస్‌ప్లే సదుపాయం ఉంది. సాధారణ ప్రజలు గ్యాలరీల్లో ఎక్కడ కూర్చునయినా స్పష్టంగా సమావేశాలు చూడగలరు. మీడియా కోసం ప్రత్యేకంగా 530 సీట్లు కేటాయించారు.

ఎవరీ బిమల్ పటేల్..
కొత్త పార్లమెంట్‌ భవనాన్ని అహ్మదాబాద్‌ కు చెందిన హెచ్‌సీపీ డిజైనర్‌ బిమల్ హస్ముఖ్ పటేల్ డిజైన్‌ చేశారు. మోదీ కలల ప్రాజెక్టులు దాదాపు బిమల్ పటేల్ డిజైన్ చేసి నిర్మించారు. అహ్మదాబాద్ కు చెందిన పటేల్ సెయింట్ జేవియర్స్ స్కూల్లో చదువుకున్నారు. ఆర్కిటెక్చర్ విద్య కోసం CEPT యూనివర్శిటీ ఎంట్రన్స్ పరీక్షలో టాపర్ గా నిలిచారు. అక్కడే ఆక్కిటెక్చర్ లో డిప్లొమా చేశారు. ఆ తరువాత పటేల్ ఆర్కిటెక్చర్,సిటీ ప్లానింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. అలాగే బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో సిటీ, రీజినల్ ప్లానింగ్‌లో PhDని చేశారు.

పటేల్ తండ్రి హస్ముఖ్ పటేల్ కూడా ఆర్కిటెక్చరే. 1990లో తన తండ్రి ఆర్కిటెక్చరల్ ప్రాక్టీస్‌లో చేరారు. 1997లో నగర ప్రణాళికపై స్థానిక ప్రభుత్వాలతో కలిసి పనిచేయడానికి లాభాపేక్ష లేని సంస్థ ఎన్విరాన్‌మెంటల్ ప్లానింగ్ కోలాబరేటివ్ (EPC)ని స్థాపించారు. CEPT విశ్వవిద్యాలయానికి అధ్యక్షుడిగా ఉన్నారు. HCP డిజైన్, ప్లానింగ్ అండ్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ప్రిన్సిపల్ ఆర్కిటెక్ట్‌గా, డాక్టర్ పటేల్ తన తండ్రి డిజైన్ మరియు ప్రాక్టీస్‌కు సంబంధించిన విధానాన్ని నిర్మించారు. 1960లో హస్ముఖ్ పటేల్ నాయకత్వంలో నిరాడంబరంగా ప్రారంభమైన ఈ సంస్థ నేడు నిర్మాణ రూపకల్పన, పట్టణ రూపకల్పన, పట్టణ ప్రణాళిక, మాస్టర్ ప్లానింగ్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ రంగాలలో వృత్తిపరమైన సేవల్ని అందిస్తోంది.