Congress : అక్కడి నుంచి బరిలోకి రాహుల్ గాంధీ, ప్రియాంక..? ఒకప్పటి కంచుకోటలపై కాంగ్రెస్ ఫోకస్

మళ్లీ రాహుల్ గాంధీ విజయం సాధిస్తారని కాంగ్రెస్ పార్టీ చెబుతున్నా.. ఒకవేళ జరగరానిది జరిగితే పరిస్థితి ఏంటన్నదానిపై ఆందోళనలో ఉన్నారు కాంగ్రెస్ నేతలు.

Congress : అక్కడి నుంచి బరిలోకి రాహుల్ గాంధీ, ప్రియాంక..? ఒకప్పటి కంచుకోటలపై కాంగ్రెస్ ఫోకస్

Congress Special Focus On Amethi, Raebareli

Congress Special Focus : కంచుకోటలపైన జెండా ఎగురవేయాలనే పట్టుదలతో ఉంది కాంగ్రెస్. ఒకప్పుడు తమకు తిరుగులేని నియోజకవర్గాలుగా ఉన్న అమేథీ, రాయబరేలీపై ఫోకస్ పెట్టింది హస్తం పార్టీ. ఆ రెండు స్థానాల్లో రాహుల్, ప్రియాంకలను బరిలోకి దించాలని ఆలోచిస్తోంది. త్వరలోనే ఖర్గే వీరిద్దరినీ అభ్యర్థులుగా ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే వయనాడ్ నుంచి పోటీ చేసిన రాహుల్.. అమేథీ నుంచి టీలో ఉంటారని తెలుస్తోంది.

ఆ 2స్థానాలను తమ ఖాతాలో వేసుకోవాలనే కసి..
ఒకప్పటి రాజకీయ కంచుకోటలు. ఇప్పడు వాటిలో పట్టుకోల్పోకముందే గెలిచి నిలవాలని ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. దేశవ్యాప్తంగా అన్ని లోక్‌సభ సీట్లు ఒకెత్తు అయితే.. ఆ రెండు స్థానాలపై ఆచితూచి వ్యవహరిస్తోంది. యూపీలోని అమేథీ, రాయబరేలీ సీట్లను ఈసారి ఎలాగైనా తమ ఖాతాలో వేసుకోవాలని కసిగా ఉంది కాంగ్రెస్. గత ఎన్నికల్లో తృటిలో అమేథీ సీటును కోల్పోయింది. రాయబరేలీ కాంగ్రెస్ సిట్టింగ్ సీటు. సోనియా గాంధీ ఈ సీటులో ఎంపీగా కొనసాగారు. ఈ మధ్యే ఆమె రాజ్యసభకు ఎలక్ట్‌ అయి ప్రత్యక్ష ఎన్నికలకు గుడ్‌ బై చెప్పారు.

కంచుకోటల్ని కాపాడుకోవాలంటే.. ఇందిరాగాంధీ వారసులను రంగంలోకి దించాల్సిందే..
పట్టుకోల్పోయిన అమేథీలో తిరిగి పట్టు సాధించేందుకు.. రాయబరేలీని తిరిగి నిలబెట్టుకునేందుకు పకడ్బందీ వ్యూహాలు అమలు చేస్తోంది హస్తం పార్టీ. కంచుకోటల్ని కాపాడుకోవాలంటే.. ఇందిరాగాంధీ వారసులను రంగంలోకి దించాల్సిందేనని యూపీ కాంగ్రెస్ నేతలు పట్టుపడుతున్నారు. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ సెంట్రల్ కోర్ కమిటీ సమావేశంలో అమేథీ, రాయబరేలీ రాజకీయ సమీకరణాలపై చర్చించారు. అమేథీ నుంచి రాహుల్, రాయబరేలీ నుంచి ప్రియాంకను బరిలోకి దించాలని ఓ నిర్ణయానికి వచ్చారు. కాని తుది నిర్ణయం ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లిఖార్జున ఖర్గేకు వదిలేశారు.

ఒకవేళ వయనాడ్ లో ఓడిపోతే..
రాహల్ గాంధీ ఇప్పటికే కేరళలో వయనాడ్‌ నుంచి పోటీ చేస్తున్నారు. అక్కడ పోలింగ్ కూడా అయిపోయింది. పోలింగ్ సరళిని పరిశీలిస్తే.. మళ్లీ రాహుల్ గాంధీ విజయం సాధిస్తారని కాంగ్రెస్ పార్టీ చెబుతున్నా.. ఒకవేళ జరగరానిది జరిగితే పరిస్థితి ఏంటన్నదానిపై ఆందోళనలో ఉన్నారు కాంగ్రెస్ నేతలు. ఒకవేళ రాహల్ వయనాడ్‌లో ఓడితే.. ప్రాతినిథ్యం లేని నాయకుడిగా ఉండాల్సి వస్తుందని.. టెన్షన్ పడుతున్నారు. అందుకే అమేథీ నుంచి రాహుల్ గాంధీని బరిలోకి దించాలని యూపీ పీసీపీ నేతలు ఒత్తిడి తెస్తున్నారు. 2014లోనూ రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్, యూపీలోని అమేథీ రెండు సీట్లలో పోటీచేసి.. వయనాడ్‌లో మాత్రమే గెలిచారు. అమేథీలో స్మృతీ ఇరానీ చేతిలో ఓడిపోయారు.

ప్రియాంక గెలుపు కోసం సోనియా వ్యూహం..!
రాహుల్ గాంధీ పరిస్థితి ఎలా ఉన్నా.. రాయబరేలీ నుంచి ప్రియాంకగాంధీ పోటీ చేయడం ఖాయమని తెలుస్తోంది. ప్రియాంక గాంధీ అభ్యర్థిత్వంపై హైకమాండ్ ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆమె పేరును ప్రకటిస్తారని చెప్తున్నారు కాంగ్రెస్ లీడర్లు. రాయబరేలీలో ఎన్నికల నిర్వహణ కోసం సోనియా గాంధీ 24 మంది సభ్యులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రియాంక పోటీ చేస్తుండటంతోనే.. సోనియా గాంధీ రాయబరేలీపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. సిట్టింగ్‌ సీటును నిలబెట్టుకోవాలని ప్లాన్‌తో పాటు మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రియాంకను గెలిపించి చట్టసభల్లో అడుగుపెట్టేలా చేయాలని భావిస్తోంది హస్తం పార్టీ హైకమాండ్.

Also Read : అమిత్ షా డీప్ ఫేక్ వీడియో కేసు.. సీఎం రేవంత్ రెడ్డికి సమన్లు