కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కులగణన చేపట్టి రిజర్వేషన్లు పెంచుతాం: గురుదీప్ సింగ్

కులగణన చేసి రిజర్వేషన్లు పెంచాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు పెంచాలంటే కులాల లెక్కలు తప్పకుండా కావాలి.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కులగణన చేపట్టి రిజర్వేషన్లు పెంచుతాం: గురుదీప్ సింగ్

Gurdeep Singh Sappal: కేంద్రంలో 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేయాలని బీజేపీ చూస్తోందని కాంగ్రెస్ సీడబ్ల్యూసీ శాశ్వత సభ్యులు గురుదీప్ సింగ్ సప్పల్ ఆరోపించారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో మంగళవారం ఏఐసీసీ అధికార ప్రతినిధులు మధు యాష్కీ గౌడ్, సుజాత పాల్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కులగణన చేపట్టి రిజర్వేషన్లు పెంచుతామని అన్నారు.

”బీజేపీ 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చూస్తోంది. ఆర్ఎస్ఎస్ తన శ్వేతపత్రంలో రాజ్యాంగం హిందు వ్యతిరేకంగా ఉందని, మార్పు చేయాలని రాసుకుంది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎజెండా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంది. రాజ్యాంగంలో అందరికీ ఓటు హక్కు ఉంది, రిజర్వేషన్లు ఉన్నాయి. అందరి హక్కులు కాపాడే అంశాలు ఉన్నాయి. ఆర్ఎస్ఎస్‌కు ఇవన్నీ నచ్చవు. అందుకే వీరు రాజ్యాంగాన్నివ్యతిరేకిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ ఎజెండానే బీజేపీ ఎజెండా. ఆర్ఎస్ఎస్ మనువాద రాజ్యాంగాన్ని అమలు చేయాలని భావిస్తోంది.

10 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయలేదు. రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంటుందన్న కారణంతో ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకుండా అన్ని ప్రైవేట్‌కు అప్పగించారు. 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఆర్మీలో కూడా కేంద్ర సర్కారు ఇలాంటి తప్పులు చేసింది. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్మీఅయిన భారత సైన్యాన్ని మోదీ నిర్వీర్యం చేశారు.

Also Read: గతంలో కేసీఆర్ నాపై కేసు పెడితే కారు షెడ్డుకు పోయింది, ఇప్పుడు.. సీఎం రేవంత్ రెడ్డి

బీజేపీ, మోదీ కులగణనకు వ్యతిరేకం. కులగణన చేసి రిజర్వేషన్లు పెంచాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు పెంచాలంటే కులాల లెక్కలు తప్పకుండా కావాలి. కులగణన చేయకపోతే ఓబీసీ రిజర్వేషన్లు పెంచే అవకాశం లేదు. మోదీ పదేళ్ల పాలనలో కుట్ర పూరితంగా కులగణన చేయలేద”ని గురుదీప్ సింగ్ సప్పల్ విమర్శించారు.