Cm Revanth Reddy : గతంలో కేసీఆర్ నాపై కేసు పెడితే కారు షెడ్డుకు పోయింది, ఇప్పుడు..- సీఎం రేవంత్ రెడ్డి

సెమీఫైనల్లో కేసీఆర్ ను ఓడించిన మీరు.. ఫైనల్లో బీజేపీని ఓడించి సూరత్ కు పంపించాలి.

Cm Revanth Reddy : గతంలో కేసీఆర్ నాపై కేసు పెడితే కారు షెడ్డుకు పోయింది, ఇప్పుడు..- సీఎం రేవంత్ రెడ్డి

Cm Revanth Reddy : కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో కాంగ్రెస్ జన జాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ, కేసీఆర్ టార్గెట్ గా నిప్పులు చెరిగారు. లోక్ సభ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలని, చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి.

”కరీంనగర్ చైతన్యవంతమైన జిల్లా. ఎమ్మెస్సార్, చొక్కారావు లాంటి ఎందరో ఉద్ధండులు ఈ జిల్లా నుంచి గెలిచారు. తెలంగాణ ఆకాంక్ష కోసం ఆనాడు మీరంతా కేసీఆర్ ను మూడు సార్లు గెలిపించారు. అదే కేసీఆర్ మా పాలమూరు గడ్డ మీదకు పోటీ కోసం వస్తే మేము కూడా గెలిపించాం. అదే కేసీఆర్ ను మీరు మొన్న ఓడించి బుద్ధి చెప్పారు. సెమీఫైనల్లో కేసీఆర్ ను ఓడించిన మీరు.. ఫైనల్లో బీజేపీని ఓడించి సూరత్ కు పంపించాలి.

తెలంగాణకు మోదీ ఇచ్చిందేమీ లేదు. బండి సంజయ్ కరీంనగర్ కు తెచ్చిందేమీ లేదు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సహా ఏ విభజన హామీని బీజేపీ నెరవేర్చలేదు. తెలంగాణ ఏర్పాటును అవమానించేలా మోడీ మాట్లాడారు. తలుపులు మూసి తెలంగాణ ఇచ్చారని, తల్లిని చంపి బిడ్డను బతికించారని మోడీ అవహేళన చేశారు. తెలంగాణను అవమానించేలా మోడీ మాట్లాడితే బండి సంజయ్ ఎందుకు మాట్లాడటం లేదు? తెలంగాణకు గాడిద గుడ్డు కూడా ఇవ్వలేదు. అందుకే బండికి ఓటేయాలా? ఆనాడు అరగుండు బండిని, పూర్తి గుండు అర్వింద్ ను ఓడించారు.

అయోధ్యలో రాముని కల్యాణం జరగక ముందే అక్షింతలు ఇంటికి పంపించడమంటే సంప్రదాయాలను మంట గలిపి రామున్ని అవమానించారు. మనందరం రాముని భక్తులం కాదా.. మనం పండుగలు చేసుకోవడం లేదా? గ్రామ దేవతలకు కల్లు కోడి కొయ్యలేదా? హిందుత్వాన్ని ఓట్ల కోసం, వ్యాపారానికి వాడుకుంటున్నారు. దేవుని బొమ్మ చూపించి ఓట్లడుక్కునే నీచ రాజకీయాలు చేస్తున్నారు. గాంధీ, నెహ్రూ, అంబేద్కర్ లాంటి మహానీయుల నుంచి మేము దేశభక్తిని పునికి పుచ్చుకున్నాం.

బీసీల రిజర్వేషన్ పెంచాలని, బీసీ జనగణన చేయాలని రాహుల్ చెప్పారు. దానికి అనుగుణంగా రాష్ట్రంలో చర్యలు చేపట్టాం. మీరు రిజర్వేషన్లు రద్దు చేయాలనుకుంటున్నారని నేను ఆరోపిస్తున్నా. అందులో భాగంగానే 400 సీట్లు కావాలంటున్నారు. 2/3 మెజార్టీ వస్తే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తారు. బీజేపీ బీసీ లెక్కలు వద్దంటోంది. ఎందుకు రిజర్వేషన్లు రద్దు చేయాలనుకుంటున్నారో మోడీ ఇక్కడికొచ్చి చెప్పాలి. బీజేపీ ఓడితేనే రిజర్వేషన్లు కొనసాగుతాయి.

మనం గెలవాలంటే బీజేపీ ఓడాలి. సర్జికల్ స్ట్రైక్ చేసి రిజర్వేషన్లు రద్దు చేసేందుకు మోడీ సిద్ధమవుతున్నారు. ఈ మాట చెప్పినందుకే నాపై కేసులు పెట్టి పోలీసులను పంపారు. గతంలో కేసీఆర్ కూడా నాపై ఇలాంటి కేసు పెడితే కారు షెడ్డుకు పోయింది. అందుకే కారు పక్కన పెట్టి బస్సు యాత్ర చేస్తున్నారు. తిక్కలోడు తిరునాళ్లకు పోయినట్లుగా కేసీఆర్ యాత్ర ఉంది. పలు చోట్ల బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయి. ఇండియా కూటమిలోకి బీఆర్ఎస్ ను రానీయం. వాళ్ల గోడ మీద కాకి మా గోడ మీద వాలినా కాల్చి పడేస్తాం. రాబోయే ఎన్నికల్లో హంగ్ వస్తే తాము ప్రభుత్వంలో చేరతామని చెబుతున్నారంటేనే వారి కుమ్మక్కు రాజకీయాలు అర్థం చేసుకోవాలి. కేసీఆర్ కుట్రలు గమనించే కమ్యూనిస్టులు మాకు మద్ధతిచ్చారు.

వచ్చిన నెల రోజుల్లోనే 30 వేల ఉద్యోగాలిచ్చాం. రామప్ప శివుని సాక్షిగా మరోసారి చెబుతున్నా. ఆగస్టు 15 లోగా రైతులకు రుణమాఫీ చేస్తా. మీ ఆకాంక్ష నెరవేరుస్తా.. కాంగ్రెస్ ను గెలిపించండి. వెలిచాల కుటుంబం ప్రజాసేవ చేసింది. లక్ష మెజార్టీతో రాజేందర్ రావును గెలిపించాలి” అని రేవంత్ రెడ్డి అన్నారు.

Also Read : సీఎం రేవంత్ రెడ్డి అరెస్టుకు బీజేపీ కుట్ర: సీపీఐ నారాయణ