జూన్‌ తొలివారంలో రైళ్ల కూత.. ఆర్టీసీ బస్సులు నడిచేనా?

  • Published By: srihari ,Published On : May 10, 2020 / 02:04 AM IST
జూన్‌ తొలివారంలో రైళ్ల కూత.. ఆర్టీసీ బస్సులు నడిచేనా?

వచ్చే జూన్‌ తొలి వారంలో పబ్లిక్ ట్రాన్స్ ఫోర్ట్ సర్వీసులను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య వేగంగా పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రజా రవాణా ప్రారంభించటం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా 50 రోజులుగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. జూన్‌ మొదటి వారంలో ప్రజా రవాణ సర్వీసులను ప్రారంభించాలని కేంద్రం యోచిస్తోంది. ఆర్టీసీ బస్సు సర్వీసులపై ఆయా రాష్ట్రాలకే కేంద్రం నిర్ణయాన్ని వదిలేసింది. గ్రీన్‌జోన్‌లలో బస్సులు తిరిగేందుకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. బస్సులను ఆయా జోన్లలో నడపాలా? లేదా అనేది రాష్ట్రాలే నిర్ణయించుకోవాలని పేర్కొంది. ఆరెంజ్, రెడ్‌ జోన్లలో మాత్రం ప్రజా రవాణాకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదు.

రైల్వే సర్వీసుల విషయంలో కూడా కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈనెలాఖరు వరకు రైళ్లను నడపొద్దని స్వయంగా రైల్వే బోర్డు తెలిపింది. ప్రస్తుతం సరుకు రవాణా రైళ్లు పెద్ద సంఖ్యలో నడుస్తున్నాయి. దేశవ్యాప్తంగా గల వలస కూలీలను సొంత ప్రాంతాలకు తరలించేందుకు శ్రామిక్‌ స్పెషల్స్‌ పేరుతో సాధారణ రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే. సాధారణ రైళ్లను నడిపితే ప్రయాణికుల మధ్య భౌతిక దూరాన్ని పాటించడం కష్టమే. ఇదే భయం కేంద్రాన్ని వెంటాడుతోంది. ఈనెల 17 కేంద్రం లాక్‌డౌన్‌ విషయంలో ప్రజా రవాణా సర్వీసులపై సమీక్షించనుంది. తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నెల 17 తర్వాత రైళ్లను నడపాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నిర్వహించే సమావేశంలో దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

గ్రీన్‌జోన్లు పెరగటంతో రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులను నడిపే విషయంలో ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. బస్సులు నడిపేందుకు కేంద్రం అనుమతించినా, రాష్ట్రంలో గ్రీన్‌జోన్‌ పరిధి తక్కువగా ఉండటమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. గ్రీన్ మధ్యలోనే ఆరెంజ్, రెడ్‌ జోన్లు ఉండటంతో బస్సులు నడిపే అవకాశం లేదు. ప్రస్తుతం గ్రీన్‌ జోన్ల సంఖ్య పెరగటంతో ఇప్పుడు కొంత సానుకూలత ఏర్పడిందని చెప్పాలి. త్వరలో గ్రీన్ జోన్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్‌తో అనుసంధానం లేకుండా బస్సులు నడపడం కష్టమని ఆర్టీసీ అధికారులు అంటున్నారు. హైదరాబాద్‌–జిల్లాల మధ్యనే ప్రయాణికులు ఎక్కువగా రాకపోకలు సాగిస్తుంటారు. 

హైదరాబాద్‌ నగరంలో ప్రస్తుతం కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నందున ఇప్పట్లో గ్రీన్‌జోన్‌ పరిధిలోకి వచ్చే అవకాశం లేదు. గ్రీన్, ఆరెంజ్, రెడ్‌ జోన్లు పక్కనే ఉన్నాయి. దాంతో బస్సులు నడిపేటప్పుడు ఏమాత్రం తేడా వచ్చినా, గ్రీన్‌ జోన్లలో కూడా కొత్త పాజిటివ్‌ కేసులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈనెల 15న మరోసారి సమీక్షించి బస్సుల విషయంలో నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.