ప్రజల్లో భయం తగ్గాలి.. వారిపై వివక్ష చూపొద్దు: సీఎం జగన్

  • Published By: vamsi ,Published On : May 16, 2020 / 09:55 AM IST
ప్రజల్లో భయం తగ్గాలి.. వారిపై వివక్ష చూపొద్దు: సీఎం జగన్

కోవిడ్‌-19 నివారణ చర్యలు, లాక్‌డౌన్ అమలుపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డితో పాటు పలువురు అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. 

ఈ సంధర్భంగా మాట్లాడిన జగన్.. జనాల్లో భయాందోళనలు తగ్గాలని అన్నారు. కరోనా పట్ల ప్రజల్లో ఉన్న ఆందోళన, భయం పూర్తిగా తొలగిపోవాలని, అలా జరగాలంటే ఏం చేయాలన్న దానిపై దృష్టి పెట్టాలని అధికారులను కోరారు. కరోనా లక్షణాలు ఉన్నాయని తెలియగానే ప్రజలు పరీక్షలతో పాటు, వైద్యం చేయించుకోవడానికి ముందుకు రావాలన్నారు.

కరోనా లక్షణాలు ఉన్నవారు స్వయంగా ముందుకు వచ్చే పరిస్థితి తీసుకురావాలని, అప్పుడే వైరస్‌ను అరికట్టగలుగుతామని అన్నారు. కరోనా లక్షణాలు కనిపించగానే వైరస్‌ ఉన్నదీ లేనిదీ ఒక వ్యక్తి ఎలా నిర్ధారించుకోగలుగుతారు అన్నది చాలా ముఖ్యమని, ఆ వ్యక్తి ఎవర్ని సంప్రదించాలి? ఎలా సంప్రదించాలి? అన్న దానిపై ఒక పటిష్టమైన యంత్రాంగం అవసరమని అన్నారు. అందుకు సంబంధించి ప్రతి ఇంటికీ ఒక కరపత్రం పంచాలి అన్నారు. 

కరోనా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, లక్షణాలు కనిపిస్తే ఆందోళన చెందవద్దని, ప్రజలు వారంతట వారే ముందుకు రావడం ద్వారా పరిస్థితిలో మార్పు వస్తుందని అన్నారు. కరోనా రావటం తప్పు కాదని, అది పాపం కాదనే విషయాన్ని ప్రజలకు గట్టిగా చెప్పాలన్నారు. కరోనా వచ్చిన వారి పట్ల వివక్ష చూపడం, తక్కువగా చూడడం ప్రజలు మానుకోవాలని అన్నారు. 

Read Here>>వలస కూలీల అవస్థలపై చలించిన సీఎం జగన్ :ఫ్రీ బస్సు సౌకర్యం