India tour of West Indies : టెస్టు సిరీస్‌కు రోహిత్, కోహ్లితో పాటు సీనియ‌ర్ల‌కు విశ్రాంతి..? కెప్టెన్‌గా అజింక్య ర‌హానె..?

ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్(WTC) ముగిసింది. ఇప్పుడు భార‌త అభిమానుల దృష్టి వెస్టిండీస్ ప‌ర్య‌ట‌న‌పై నిలిచింది. ఈ ప‌ర్య‌ట‌న‌లో భార‌త జ‌ట్టు విండీస్ టీమ్‌తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడ‌నుంది.

India tour of West Indies : టెస్టు సిరీస్‌కు రోహిత్, కోహ్లితో పాటు సీనియ‌ర్ల‌కు విశ్రాంతి..? కెప్టెన్‌గా అజింక్య ర‌హానె..?

Kohli-Rahane-Rohit

India tour of West Indies 2023 : ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్(WTC) ముగిసింది. ఇప్పుడు భార‌త అభిమానుల దృష్టి వెస్టిండీస్ ప‌ర్య‌ట‌న‌పై నిలిచింది. ఈ ప‌ర్య‌ట‌న‌లో భార‌త జ‌ట్టు విండీస్ టీమ్‌తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడ‌నుంది. జూలై 12 నుంచి టెస్టు మ్యాచుల‌తో ప‌ర్య‌ట‌న‌ ఆరంభం కానుంది. గ‌త కొంత‌కాలంగా సీనియ‌ర్ ఆట‌గాళ్లైన కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌(Rohit Sharma), విరాట్ కోహ్లి(Virat Kohli) లు విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్నారు. ఈ నేప‌థ్యంలో వారిపై ప‌ని భారాన్ని త‌గ్గించేందుకు విండీస్ ప‌ర్య‌ట‌న‌లో టెస్టుల్లో వీరికి విశ్రాంతి ఇచ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ఈ ఇద్ద‌రితో పాటు మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ సైతం దూరంగా ఉండే అవ‌కాశం ఉంది. అంతేకాకుండా పేల‌వ ఫామ్‌తో ఇబ్బందులు ప‌డుతున్న ఛ‌తేశ్వ‌ర్ పుజారా, ఉమేశ్ యాద‌వ్‌ల‌పై వేటు వేసే ఛాన్స్ ఉంది. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ టెస్టు సిరీస్‌కు దూరం అయితే.. అజింక్య ర‌హానె జ‌ట్టును న‌డిపించ‌నున్నాడు. ఇదే జ‌రిగితే.. యువ ఆట‌గాళ్లు యశస్వీ జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ లు టెస్టు క్రికెట్‌లో అరంగ్రేటం చేయ‌డం దాదాపుగా ఖాయం కానుంది.

ఈ ఏడాది స్వ‌దేశంలో వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో సీనియ‌ర్ ఆట‌గాళ్ల‌ను ఈ ఒక్క ఫార్మాట్‌కే ప‌రిమితం చేయాల‌నే ఆలోచ‌న‌లో బీసీసీఐ ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే.. ఆట‌గాళ్ల‌తో చర్చించిన త‌రువాతే విశ్రాంతి ఇవ్వాలా వ‌ద్దా అనే దానిపై నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. విండీస్ ప‌ర్య‌ట‌న‌కు జ‌ట్టును ఈ నెల 27న ప్ర‌క‌టించే ఛాన్స్ ఉంది.

వెస్టిండీస్ ప‌ర్య‌ట‌న షెడ్యూల్ ఇదే..

టెస్టు సిరీస్‌

– జూలై 12 నుంచి 16 వ‌ర‌కు మొద‌టి టెస్టు
– జూలై 20 నుంచి 24 వ‌ర‌కు రెండో టెస్టు

వన్డే సిరీస్

– జూలై 27న తొలి వన్డే
– జూలై 29న‌ రెండో వన్డే
– ఆగ‌స్టు 1న మూడో వన్డే

టి20 సిరీస్

– ఆగ‌స్టు 3న‌ తొలి టి20
– ఆగస్టు 6న‌ రెండో టి20
– ఆగస్టు 8న మూడో టి20
– ఆగస్టు 12న నాలుగో టి20
– ఆగస్ట్ 13న ఐదో టి20