Wimbledon 2023: వింబుల్డన్ విజేత అల్కరాజ్.. మీడియా ముందు కంటతడి పెట్టిన జొకోవిచ్

వింబుల్డన్ మెన్స్ సింగిల్స్ ఫైనల్లో స్పెయిన్ యువ ఆటగాడు కార్లోస్ అల్కరాజ్ చేతిలో ఓటమితో సెర్బియా టెన్నిస్ స్టార్ నోవాక్ జొకోవిచ్ భావోద్వేగానికి లోనయ్యాడు. మీడియా ముందు కంటతడి పెట్టాడు.

Wimbledon 2023: వింబుల్డన్ విజేత అల్కరాజ్.. మీడియా ముందు కంటతడి పెట్టిన జొకోవిచ్

Carlos Alcaraz, Novak Djokovic

Wimbledon 2023 Final: మెన్స్ సింగిల్స్ టెన్నిస్ స్టార్ నోవాక్ జొకోవిచ్ (Novak Djokovic) జోరుకు కళ్లెం పడింది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ గెలిచి వింబుల్డన్ నూ కొట్టాలనుకున్న జొకోవిచ్ ఆశలు నెరవేరలేదు. స్పెయిన్ యువకెరటం కార్లోస్ అల్కరాజ్ (Carlos Alcaraz) చేతిలో అతడికి భంగపాటు ఎదురైంది. లండన్ వేదికగా ఆదివారం జరిగిన వింబుల్డన్ ఫైనల్ మ్యాచ్ లో అల్కరాజ్ విజేతగా నిలిచాడు. 4 గంటల 42 నిమిషాల పాటు జరిగిన హోరాహోరీ పోటీలో జొకోవిచ్ తలవంచాడు.

యువ ఆటగాడు అల్కరాజ్ చివరి వరకు పోరాడి జొకోవిచ్ ను ఓడించాడు. మొదటి సెట్ కోల్పోయినప్పటికీ తర్వాత సెట్ లో జొకోవిచ్ కు చుక్కలు చూపించాడు. 85 నిమిషాల పాటు సాగిన సుదీర్ఘ సెట్ లో అల్కరాజ్ 7-6 తో పైచేయి సాధించాడు. ఏకపక్షంగా సాగిన 3వ సెట్ లోనూ 6-1తో ఆధిపత్యం చెలాయించాడు. నాలుగు సెట్ లో జొకోవిచ్ (63) పుంజుకోవడంతో మ్యాచ్ 5వ సెట్ వరకు సాగింది. చివరి సెట్ లో అల్కరాజ్ 6-4తో జొకో పనిపట్టాడు.

వింబుల్డన్ విజేతగా నిలిచిన అల్కరాజ్ కు 25 కోట్ల 29 లక్షల రూపాయలు, రన్నరప్ గా నిలిచిన జొకోవిచ్ కు 12 కోట్ల 64 లక్షల రూపాయలు ప్రైజ్ మనీగా దక్కింది. 36 ఏళ్ల జొకోవిచ్ 10 ఏళ్ల తర్వాత సెంటర్ కోర్టులో ఓడిపోవడం విశేషం. ఓపెనింగ్ సెట్ గెలిచిన తర్వాత గ్రాండ్ స్లామ్ మ్యాచ్ ఓడిపోవడం ఇదే మొదటిసారి. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌ లో ఓటమిపాలవడంతో జొకోవిచ్ కన్నీటి పర్యంతమయ్యాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు.

Also Read: బీచ్‌లో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఎలన్ మస్క్,జుకర్ బర్గ్.. దీనిపై మస్క్ ఏమన్నారంటే..

హోరాహోరీ పోరులో ఓటమి అతడు జీర్ణించుకోలేకపోయాడు. 2019 వింబుల్డన్ ఫైనల్‌లో రోజర్ ఫెదరర్‌తో జరిగిన మ్యాచ్ ను గుర్తుచేసుకున్నాడు. తాను వెనుకబడినప్పటికీ తర్వాత పుంజుకుని విజేతగా నిలిచిన విషయాన్ని ప్రస్తావించాడు. తాజాగా వింబుల్డన్ విజేతగా నిలిచిన కార్లోస్ అల్కరాజ్ పై ప్రశంసలు కురిపించాడు. అల్కరాజ్ పరిస్థితులకు తగ్గట్టుగా గొప్పగా ఆడాడని మెచ్చుకున్నాడు. 20 ఏళ్ల అల్కరాజ్ 2022లో యూఎస్ ఓపెన్ టైటిల్ సాధించాడు. వింబుల్డన్ విజయంతో రెండో గ్రాండ్ స్లామ్ టైటిల్ అతడి ఖాతాలో చేరింది.

Also Read: నేను ఇండియన్ జెర్సీని ధరించడం చూసి.. నాకంటే వాళ్లే ఎక్కువ సంతోషిస్తారు: రింకు సింగ్