Pinipe Viswarupu: పినిపే విశ్వరూప్‌ లక్ష్యంగా పావులు కదుపుతున్న ప్రత్యర్థులు

వైసీపీకి గట్టిపట్టున్న ప్రాంతం గోదావరి తీరం.. ఉభయ గోదావరి జిల్లాల్లో గత ఎన్నికల్లో రికార్డు విజయాలు నమోదు చేసిన వైసీపీకి.. ప్రస్తుత పరిస్థితులు చికాకు పుట్టిస్తున్నాయి.

Pinipe Viswarupu: పినిపే విశ్వరూప్‌ లక్ష్యంగా పావులు కదుపుతున్న ప్రత్యర్థులు

Pinipe Viswarup

Minister Pinipe Viswarupu: కోనసీమ వైసీపీలో అసమ్మతి రాజకీయం జోరందుకుంటోంది. నిన్నమొన్నటి వరకు కాకరేపిన రామచంద్రాపురం (Ramachandrapuram) పాలిటిక్స్ హీట్ తగ్గాయంటే.. ఇప్పుడు అమలాపురం రాజకీయం (Amalapuram Politics) వేడెక్కుంతోంది. మంత్రి విశ్వరూప్ టార్గెట్‌గా ఆయన ప్రత్యర్థి వర్గం యాక్టివ్ అవుతోంది. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఖరారు చేస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించినా.. ఆయన వ్యతిరేకులు వెనక్కి తగ్గడంలేదు. ప్రత్యేకంగా సమావేశమై వ్యతిరేకత ప్రకటిస్తున్నారు..? వైసీపీలో (YSr Congress Party) అసమ్మతి పెరిగిపోడానికి కారణమేంటి? కీలకమైన గోదావరి జిల్లాల్లో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది. తెరవెనుక ఏం జరుగుతోంది?

వైసీపీకి గట్టిపట్టున్న ప్రాంతం గోదావరి తీరం.. ఉభయ గోదావరి జిల్లాల్లో గత ఎన్నికల్లో రికార్డు విజయాలు నమోదు చేసిన వైసీపీకి.. ప్రస్తుత పరిస్థితులు చికాకు పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా కోనసీమ జిల్లాల్లో రాజకీయం పూర్తిగా మారిపోతున్నట్లు కనిపిస్తోంది. నిన్నమొన్నటి వరకు రామచంద్రాపురంలో మంత్రి వేణు, ఎంపీ బోస్ వర్గాల మధ్య నువ్వా-నేనా అన్నట్లు నడిచిన రాజకీయం అధిష్టానం జోక్యంతో సర్దుమణిగింది. పరిస్థితులు ఇప్పుడిప్పుడే సర్దుకుంటున్నాయనుకున్న సమయంలో మరో మంత్రి పినిపే విశ్వరూప్‌ను టార్గెట్ చేస్తూ ఆయన ప్రత్యర్థులు పావులు కదుపుతున్నారు. అమలాపురం ఎమ్మెల్యేగా కాంగ్రెస్ హయాం నుంచి కొనసాగిన విశ్వరూప్‌ను పార్టీలో ఓ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అల్లవరం మండలం గుడ్డివానిచింత అనే గ్రామంలో మంత్రి వ్యతిరేకులు ప్రత్యేకంగా సమావేశమై.. విశ్వరూప్‌కు వ్యతిరేకంగా ప్రకటనలు చేయడంతోపాటు.. పార్టీలో తమకు అన్యాయం జరిగిందని విమర్శలు చేశారు.

Also Read: జనసేనతో పొత్తు కుదిరితే బుచ్చయ్యచౌదరి త్యాగం చేస్తారా?

అంబేద్కర్ కోనసీమ ప్రత్యేక జిల్లా (ambedkar konaseema district) ఏర్పడిన సమయంలోనూ విశ్వరూప్ నివాసంపై కొందరు దుండగులు దాడి చేశారు. అప్పటి నుంచి అధికార వైసీపీలో గ్రూప్ రాజకీయాలు ఎక్కువయ్యాయంటున్నారు. గత ఎన్నికల్లో మంత్రి విశ్వరూప్ గెలవడనికి ముఖ్య కారణమైన సుభాశ్ అనే నాయకుడిని కొంతకాలంగా పక్కన పెట్టేశారు మంత్రి. పార్టీ అధికారంలో ఉన్నా తాను నిరాదరణకు గురవుతున్నానంటూ ఆవేదన చెందుతున్న సుభాశ్ తన మనోవ్యధను అధినేత జగన్‌తో చెప్పుకునేందుకు ప్రయత్నించడం హాట్‌టాపిక్‌గా మారింది. పక్క నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి (Chirla Jaggi Reddy) మంత్రి ప్రత్యర్థి సుభాశ్‌ను రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టుకు తీసుకురావడం.. అది చూసిన విశ్వరూప్ జగ్గిరెడ్డిపై చిటపటలాడటం వైసీపీలో తీవ్ర చర్చకు దారితీసింది.

Also Read: గల్లా కుటుంబం తరఫున ఎవరుపోటీ చేసినా ఓకే.. టిక్కెట్ ఇచ్చేందుకు రెడీ!

మరోవైపు సీఎం జగన్ అమలాపురం పర్యటనలోనే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ విశ్వరూప్ కుటుంబానిదే అన్న ప్రకటన చేసేశారు. నువ్వు తిరుగుతావో.. శ్రీధర్ (Srikanth Pinipe) తిరుగుతాడో మీరే తేల్చుకోండి.. అన్నారు సీఎం జగన్. ఇలాంటి ప్రకటనతో విశ్వరూప్ లేదా.. ఆయన కుమారుడు శ్రీధర్‌ల్లో ఎవరో ఒకరికి టిక్కెట్ ఇవ్వడానికి సీఎం సానుకూలంగా ఉన్నట్లు తేలిపోయింది. ఐనా.. విశ్వరూప్‌కు వ్యతిరేకంగా ఆయన ప్రత్యర్థులు సంఘటితం అవుతుండటమే ఆసక్తి రేకెత్తిస్తోంది. సీఎం పర్యటనలో విశ్వరూప్‌కు అవమానం జరిగిందని సోషల్ మీడియాలో ఓ వైపు ట్రోలింగ్ జరుగుతుండగా.. ఇంతలో పార్టీ క్యాడర్ కుంపటి రాజేయడంపై వైసీపీ అధిష్టానం ఆగమాగం అవుతోంది. రామచంద్రాపురం రాజకీయంలా అమలాపురంలోనూ రాజీ కుదుర్చుతుందా? లేక విశ్వరూప్‌పై భారం వేసి వదిలేస్తుందో అన్నదే సస్పెన్స్‌గా మారింది.