Ganesh Chaturthi 2023 : ఈ 21 ఆకులతో గణపతిని పూజిస్తే మీ ఇంట్లో సిరిసంపదలకు లోటుండదు

వినాయకచవితి రోజు గణపతిని 21 రకాల పత్రితో పూజిస్తారు. అసలు ఏ ఆకులతో పూజిస్తారు. వాటితో పూజించడం వెనుక ఉన్న కారణాలు చదవండి.

Ganesh Chaturthi 2023 : ఈ 21 ఆకులతో గణపతిని పూజిస్తే మీ ఇంట్లో సిరిసంపదలకు లోటుండదు

Ganesh Chaturthi 2023

Ganesh Chaturthi 2023 : తలచిన పనులు నిర్విఘ్నంగా జరిగేలా చూడమని భక్తులు గణపతిని మొక్కుకుంటారు. గణేశుని పూజిస్తే ఇంట్లో సిరిసంపదలకు లోటు ఉండదని నమ్ముతారు. ముఖ్యంగా వినాయకచవితి రోజు 21 రకాల పత్రితో పూజిస్తారు. వాటి పేర్లు.. వాటితో పూజించడం వెనుక ఉన్న విశిష్టత తెలుసుకుందాం.

Ganesh Chaturthi 2023 : మొదటి పూజ గణపతికే ఎందుకు చేస్తారో తెలుసా?

పత్రి అంటే మామూలు ఆకులు కావు. ఎన్నో ఔషధ గుణాలు ఉన్నవి. కొత్త మట్టితో చేసిన వినాయక ప్రతిమ, పత్రి నుంచి వచ్చే గాలి మనలో ఉండే అనారోగ్యాల్ని హరిస్తుంది. వినాయకుడిని 21 రకాల ఆకులతో పూజిస్తారు. వీటి గురించి అనేక గ్రంథాల్లో కూడా రాసారు. అవి ..

1. మాచీ పత్రం : తెలుగు పేరు. చేమంతి జాతికి చెందిన ఈ ఆకులు సువాసన వెదజల్లుతాయి. చేమంతి ఆకుల రూపంలోనే ఉంటాయి. తలనొప్పి, చర్మ సమస్యలు, కండరాల నొప్పులతో బాధపడేవారు వీటిని వాడితే ప్రభావం చూపిస్తుందట.

2. దూర్వా పత్రం : అంటే గరిక. తెల్ల గరిక, నల్ల గరిక రెండు రకాలుంటాయి. గడ్డి జాతి మొక్కలు విఘ్నేశ్వరునికి ప్రీతికరమైనవి. ఔషద గుణాలు దండిగా ఉంటాయి. శరీరంపై ఉండే గాయాలు, రకరకాల అలర్జీలు నివారించే గుణం ఈ ఆకులో ఉంది.

3. అపామార్గ పత్రం : తెలుగులో దీన్నే ఉత్తరేణి అంటారు. సంజీవనిగా కూడా పిలుస్తారు. ఉత్తరేణిని సర్వరోగ నివారిణి అంటారు ఆయుర్వేద నిపుణులు. ఆకులు గుండ్రంగా ఉంటాయి. గింజలు, ముళ్ళు ఉంటాయి. ఈ ఆకు శివుని ఎంతో ప్రతికరమైనదిగా చెబుతారు. పాము కాటుకు, గాయాలు తగ్గడానికి ఇది ఉపయోగపడుతుందట.

4. బృహతీ పత్రం: ములక అని కూడా అంటారు. చిన్న ములక, పెద్ద ములక రెండు రకాలున్నాయి. చూడటానికి వంగ ఆకులుగా ఉంటాయి. జీర్ణ సమస్యలు, గుండె, చర్మ సమస్యలను ఈ ఆకు నివారిస్తుందట.

5. దుత్తూర పత్రం : ఉమ్మెత్త అని కూడా పిలుస్తారు. పువ్వులు తెల్లగా ఉంటాయి. ఉమ్మెత్త కాయలనిండా ముళ్లే. కాలిన గాయాలు, బొబ్బలకు ఈ ఆకు చక్కగా పనిచేస్తుందంటారు.

6. తులసీ పత్రం : శివకేశవులకు తులసి అంటే ప్రాణం. ఔషద గుణాలు మొండు. గణేషుడుని తులసి దళాలతో పూజలు చేయటం శుభప్రదం. తులసి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలోనూ, దగ్గు, జలుబు, జ్వరం తగ్గించడంలో పనిచేస్తుంది.

7. బిల్వ పత్రం : మారేడు ఆకు. శివునికి ఎంతో ఇష్టం. మారేడు దళాన్ని చూస్తే అచ్చు పరవశివుడి మూడు కళ్లు గుర్తుకు వస్తాయి. శివుడి మూడు కళ్లు.. ఈ మారేడు దళంలో కనిపిస్తాయి. డయాబెటీస్ నియంత్రణలో, డయేరియా, గ్యాస్ట్రిక్ సమస్యలకు ఈ ఆకును వాడతారు.

8. బదరీ పత్రం : బదరీ పత్రం అంటే రేగు. దీనిలో రేగు, జిట్రేగు, గంగరేగు అని మూడు రకాలు ఉంటాయి. జీర్ణ సమస్యలు, గొంతు, సమస్యలకు ఈ ఆకును వాడతారు. దగ్గును ఈ ఆకు తగ్గిస్తుందట.

9. చూత పత్రం : మామిడి ఆకు. మామిడి తోరణం లేని పూజ ఉండదు. ఎన్నో ఔషదాలు ఈ మామిడి ఆకుల్లో ఉంటాయి. ఇంటికి శుభం కూడా. రక్తపు విరోచనాలు, స్కిన్ పై వచ్చే దద్దుర్లు తగ్గిస్తుంది. ఈ ఆకు గుమ్మానికి కడితే కీటకాలు ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటుంది.

10. కరవీర పత్రం : గన్నేరు అంటారు. పూజలో విశిష్ట స్థానం ఉంది. గన్నేరు చెట్టులేని దేవాలయం ఉండదు. పాలు కారే ఈ చెట్టు పువ్వులతో నిండుగా శోభాయమానంగా ఉంటుంది. క్యాన్సర్, ఆస్తమా నివారణలో ఈ ఆకును వినియోగిస్తారు.

11. మరువక పత్రం : వాడుక భాషలో ధవనం, మరువం అంటారు. ఆకులు ఎండినా సువాసన వెదజల్లుతుండటం వీటి ప్రత్యేకత. జుట్టు రాలడం, జీర్ణ సంబంధ సమస్యలకు ఈ ఆకును వాడతారు.

12. శమీ పత్రం : జమ్మిచెట్టు ఆకులనే శమీ అంటారు. దసరా రోజుల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పైల్స్, కుష్ఠు నివారణలో, దంతాల సమస్యలకు ఈ ఆకు పనిచేస్తుందట.

13. విష్ణుక్రాంత పత్రం : నీలం, తెలుపు పువ్వులుండే మొక్క. నీలి పువ్వులుండే రకాన్ని విష్ణుక్రాంత అంటారు. జలుబు, దగ్గు, జ్వరం, ఆస్తమా, నరాల బలహీనత వంటి అనేక అంశాల్లో ఈ ఆకును ఔషధంగా వాడతారు.

14. సింధువార పత్రం : సింధువార పత్రాన్నే వాడుకలో వావిలి అని కూడా అంటారు. చెవి నొప్పి తగ్గించడంలో ఈ ఆకు ప్రభావం చూపిస్తుంది.

15. అశ్వత్థ పత్రం : రావి ఆకులనే అశ్వత్థ అంటారు. రావి చెట్టుకు పూజలు చేయటం తరాలుగా వస్తున్న సంప్రదాయం. రక్తాన్ని శుద్ధి చేయడంలో, ఆస్తమా వంటి సమస్యలకు ఇది ఔషధంలా పనిచేస్తుందట.

16. దాడిమీ పత్రం : దాడిమీ అంటే దానిమ్మ అని అర్థం. దానిమ్మ చెట్లు ఆకులు కూడా వినాయకుడి పూజలో ప్రత్యేక స్థానం సంపాదించాయి. డయేరియా, కంటి జబ్బులు, చర్మ సంబంధ సమస్యలకు దీనిని నివారణిగా వాడతారు.

17. జాజి పత్రం : సన్నజాజి అనే మల్లి జాతి మొక్క. వీటి నుంచి సుగంధ తైలం కూడా తీస్తారు. మొటిమలు, చర్మ సంబంధ సమస్యలకు, ఒళ్లు నొప్పులకు ఈ ఆకును వాడతారు.

18. అర్జున పత్రం : మద్ది చెట్టు ఆకులనే అర్జున ఆకులు అంటారు. అచ్చం మర్రి ఆకులుగానే ఉంటాయి. అడవుల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది ఇది. రక్తపోటు గుండె సంబంధ వ్యాధులకు ఈ ఆకు వాడతారు.

19. దేవదారు పత్రం : దేవతలకు ఇష్టమైన ఆకు ఇది. ఎత్తుగా పెరుగుతుంది. ఈ చెట్లతోనే కొన్ని వస్తువులను కూడా తయారు చేస్తారు. అజీర్తి నివారణలో, చర్మ వ్యాధులకు ఇది పనిచేస్తుంది.

20. గండకీ పత్రం : దీనిని దేవ కాంచన అని పిలుస్తారు. సీతాకోక చిలుక మాదిరి దీని ఆకులు ఉంటాయి. దగ్గు, ఉదర సంబంధ సమస్యలకు ఈ ఆకును వాడతారు.

21. అర్క పత్రం : జిల్లేడు ఆకులు ఇవి. తెల్లజిల్లేడు ఆకులతో పూజించటం చూస్తూనే ఉన్నాం. చెవినొప్పి, కాలిన గాయాలు, దంత, దగ్గు సమస్యల్లో ఇది పనిచేస్తుంది. ఈ 21 రకాల పత్రితో వినాయకచవితి రోజు గణపతిని పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు ఇంటికి వస్తాయని భక్తులు విశ్విసిస్తారు. ఈ ఏడాది వినాయకచవితి సెప్టెంబర్ 18 న జరుపుకుంటున్నారు.

Ganesh Chaturthi 2023 : వినాయకచవితి రోజు చంద్రుని చూస్తే నీలాపనిందలు తప్పవా? శాస్త్రీయ కారణాలేంటంటే..