Virat Kohli – Naveen Ul Haq : ఇక మేం దోస్తులం..! కలిసిపోయిన కోహ్లీ, నవీన్ ఉల్ హక్.. స్పందించిన గంభీర్.. నవీన్ వరుస ట్వీట్లు

భారత్ వర్సెస్ ఆప్గాన్ మ్యాచ్ ప్రారంభం నుంచి అరుణ్ జైట్లీ మైదానంలో రోహిత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మినహా.. మిగిలిన సమయంలో కోహ్లీ నామస్మరణతో మోరమోగిపోయింది.

Virat Kohli – Naveen Ul Haq : ఇక మేం దోస్తులం..! కలిసిపోయిన కోహ్లీ, నవీన్ ఉల్ హక్.. స్పందించిన గంభీర్.. నవీన్ వరుస ట్వీట్లు

Virat Kohli and Naveen Ul Haq

ODI World Cup2023 IND vs AFG Match: భారత్ వేదికగా జరుగుతున్న ఐసీసీ పురుషుల వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఇండియా వర్సెస్ ఆప్గానిస్థాన్ మధ్య బుధవారం సాయంత్రం ఢిల్లీలో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్ లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. భారత్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఆప్గాన్ బౌలర్ నవీన్ ఉల్ హక్ కలిసిపోయారు. ఒకరినొకరు కౌగిలించుకొని సరదాగా మాట్లాడుకున్నారు. ఈ ఘటన చూసిన మైదానంలో, టీవీల ముందున్న ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. మ్యాచ్ కు ముందు నవీన్, కోహ్లీ మధ్య హావభావాలు ఎలా ఉంటాయన్న ఆసక్తి క్రీడాభిమానుల్లో నెలకొంది. అయితే, మ్యాచ్ ప్రారంభంలో ఎడ మొహం, పెడమొహం ఉన్నా తరువాత వారు కలిసిపోయి మైదానంలో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Virat Kohli and Naveen Ul Haq

Virat Kohli and Naveen Ul Haq

కలిసిపోయిన కోహ్లీ, నవీన్ ఉల్ హక్..
భారత్ వర్సెస్ ఆప్గాన్ మ్యాచ్ ప్రారంభం నుంచి అరుణ్ జైట్లీ మైదానంలో రోహిత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మినహా.. మిగిలిన సమయంలో కోహ్లీ నామస్మరణతో మోరమోగిపోయింది. కోహ్లీపై అభిమానంతోపాటు.. దీనికి మరోకారణం ఉంది.. అతనే.. నవీన్ ఉల్ హక్. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ టోర్నీలో వీరిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. సోషల్ మీడియాలోనూ వీరి వివాదంపై పెద్ద చర్చే జరిగింది. ఈ వివాదం తరువాత నవీన్ ఉల్ హక్ ఎక్కడ కనిపించినా కోహ్లీ ఫ్యాన్స్ ఓ ఆటాడుకోవటం పరిపాటిగా మారింది. ఇప్పటి వరకు ఆఫ్గాన్ ఆడిన వన్డే వరల్డ్ కప్ లోనూ కోహ్లీ నామస్మరణే వినిపించింది. బుధవారం జరిగిన మ్యాచ్ లో కోహ్లీ వర్సెస్ నవీన్ మధ్య మ్యాచ్ లా మారిపోయింది. ప్రేక్షకులు సైతం వారిద్దరు ఎదురుపడితే ఎలాంటి వాతావరణం ఉంటుందనే ఆసక్తితో మ్యాచ్ చూశారు. ఆప్గాన్ బ్యాటింగ్ సమయంలో నవీన్ బ్యాటింగ్ కు వచ్చిన సమయంలో ఇద్దరి మధ్య పాత గొడవ ప్రభావం కనిపించింది. కానీ, భారత్ బ్యాటింగ్ సమయంలో కోహ్లీ క్రీజులోకి వచ్చిన తరువాత వీరిద్దరూ ఒక్కటయ్యారు.

Virat Kohli and Naveen Ul Haq

Virat Kohli and Naveen Ul Haq

గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ఐపీఎల్ టోర్నీలో విరాట్ కోహ్లీ – నవీన్ ఉల్ హక్ మధ్య వివాదంలో గంభీర్ నవీన్ వెంట నిలిచాడు. నవీన్ ఆడే లక్నో జట్టుకు గంభీర్ మెంటర్. ఒకవిధంగా చెప్పాలంటే నవీన్ ఉల్ హక్, గంభీర్ వర్సెస్ కోహ్లీ అన్నట్లుగా వివాదం జరిగింది. బుధవారం జరిగిన ఆఫ్గాన్ వర్సెస్ భారత్ మధ్య మ్యాచ్ లో గంభీర్ స్టార్ స్పోర్ట్స్ కు చెందిన హిందీ కామెంటరీ బాక్స్ లో కామెంటేటర్ గా ఉన్నాడు. నవీన్ – కోహ్లీ కౌగిలించుకున్న తరువాత గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆటగాళ్లు క్రికెట్ మైదానం వెలుపల పోటీని ముందుకు తీసుకెళ్లకూడదని చెప్పారు. ఆ తరువాత నవీన్ ఉల్ హక్ వరుస ట్వీట్లు చేశాడు.

 

 

నవీన్ ఉల్ హక్ వరుస ట్వీట్లు..
కోహ్లీ క్రీజులో ఉన్న సమయంలో నవీన్ ఉల్ హక్ బౌలింగ్ వేశాడు. ఈ సమయంలో స్టేడియం మొత్తం కోహ్లీ.. కోహ్లీ అంటూ మారుమోగిపోయింది. ఒక రన్ కొట్టి నాన్ స్ట్రైకింగ్ లోకి వచ్చిన కోహ్లీ.. అభిమానులను వారించాడు. అలా అరవొద్దు అంటూ సైగలతో చెప్పడంతో కొద్దిసేపటి అభిమానులు ఆగిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోను నవీన్ ఉల్ హక్ తన ట్విటర్ (ఎక్స్) ఖాతాలో షేర్ చేసి ‘థ్యాక్యూ కింగ్’ అంటూ పేర్కొన్నాడు. ఆ కొద్ది సేపటికే కోహ్లీతో మైదానంలో సరదాగా మాట్లాడుతున్న ఫొటోను నవీన్ ట్విటర్ షేర్ చేసి.. ‘మై ఫ్రెండ్’ అని రాశాడు. ఆ కొద్దిసేపటికే కోహ్లీతో ఉన్న ఫొటోను షేర్ చేసిన నవీన్.. ‘విరాట్ కోహ్లీ చాలా మంచి వ్యక్తి.. ఢిల్లీ అతని హోం గ్రౌండ్. ప్రేక్షకులు వారి స్వస్థలం అబ్బాయికి మద్దతు ఇచ్చారు. కాబట్టి వారు కోహ్లీ.. కోహ్లీ అని నినాదాలు చేశారు’ అంటూ రాశాడు.