IND vs ENG : రెండో టెస్టుకు ముందు టీమ్ఇండియాకు భారీ షాక్‌..

ఓట‌మి బాధ‌లో ఉన్న భార‌త్‌కు ఇప్పుడు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది.

IND vs ENG : రెండో టెస్టుకు ముందు టీమ్ఇండియాకు భారీ షాక్‌..

Ravindra Jadeja

ఉప్ప‌ల్ వేదిక‌గా జ‌రిగిన మొద‌టి టెస్టు మ్యాచులో టీమ్ఇండియా 28 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది. గెల‌వాల్సిన మ్యాచులో ఓడిపోవ‌డం టీమ్ఇండియా అభిమానుల‌కు పెద్ద షాక్. ఓ వైపు ఓట‌మి బాధ‌లో ఉన్న భార‌త్‌కు ఇప్పుడు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా రెండో టెస్టు మ్యాచ్‌కు దూరం అయ్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. మొద‌టి టెస్టు మ్యాచులో అత‌డి తొడ కండ‌రాలు ప‌ట్టేశాయి.

ఉప్ప‌ల్ టెస్టు మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో అద‌న‌పు ప‌రుగు కోసం య‌త్నించిన ర‌వీంద్ర జ‌డేజాను బెన్‌స్టోక్స్ ర‌నౌట్ చేశాడు. ఆ స‌మ‌యంలో వేగంగా ప‌రిగెత్తుతుండ‌గా జ‌డేజా తొడ కండ‌రాలు ప‌ట్టేశాయి. ఈ క్ర‌మంలోనే జ‌డేజా ఇబ్బంది ప‌డుతూనే గ్రౌండ్ బ‌య‌ట‌కు వెళ్లాడు. అత‌డి నొప్పి తీవ్ర‌త చాలా ఎక్కువ‌గా ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. ర‌వీంద్ర జ‌డేజా గాయంపై మ్యాచ్ అనంత‌రం హెచ్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్ స్పందించాడు. ఈ విష‌యం గురించి ఇంకా ఫిజియోతో మాట్లాడ‌లేద‌ని చెప్పాడు. కాబ‌ట్టి ఇప్పుడే అత‌డి ప‌రిస్థితి గురించి తెల‌ప‌లేన‌న్నాడు.

Also Read : క్రికెట్ మ్యాచా.. కామెడీ షోనా.. వీడియో చూస్తే ప‌గ‌ల‌బ‌డి న‌వ్వుతారు

అటు భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సైతం జ‌డేజా గాయంపై ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి అప్‌డేట్‌ను ఇవ్వలేదు. అయితే.. అత‌డి గాయానికి స్కానింగ్ నిర్వ‌హించార‌ని, రిపోర్టుల కోసం వెయిట్ చేస్తున్నారు. గాయం తీవ్ర‌మైనది కాక‌పోయిన‌ప్ప‌టికీ క‌నీసం వారం రోజులు అత‌డికి వైద్యులు విశ్రాంతి సూచించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో విశాఖ వేదిక‌గా ఫిబ్ర‌వ‌రి 2 నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టు మ్యాచ్‌కు అత‌డు అందుబాటులో ఉంటాడా..? ఉండ‌డా అన్న ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి.

ఒక‌వేళ మ్యాచ్‌కు జ‌డ్డూ దూరం అయితే మాత్రం అది భార‌త విజ‌యావ‌కాశాల‌పై ప్ర‌భావం చూప‌నుంది. ఐదు టెస్టు మ్యాచుల సిరీస్‌లో ఇంగ్లాండ్ 1-0 ఆధిక్యంలో ఉంది. ఇక మొద‌టి టెస్టు మ్యాచులో జ‌డేజా తొలి ఇన్నింగ్స్‌లో 87 ప‌రుగులు చేశాడు. బౌలింగ్‌లో 5 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

Also Read: ఉపఖండంలో ఇదే గొప్ప విజయం.. ఉప్ప‌ల్‌లో గెలుపు పై ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్‌