కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసును ఎన్ ఐఏకు అప్పగించిన కేంద్రం

  • Published By: bheemraj ,Published On : July 9, 2020 / 10:02 PM IST
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసును ఎన్ ఐఏకు అప్పగించిన కేంద్రం

కేరళలో సంచలనం సృష్టించిన గోల్డ్ స్మగ్లింగ్ కేసును కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏకు అప్పగించింది. ఈ కేసును ఎన్ఐఏకు అప్పగిస్తున్నట్లుగా కేంద్ర హోంశాఖ కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది. కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసును ఎన్ఐఏ విచారించనుంది. సీఎంవోలో పని చేసిన అధికారి హస్తం ఉండటంతో కేంద్రం ఈ కేసును సీరియస్ గా తీసుకుంది.

కేరళ సీఎం పినరయి విజయన్ ప్రధాని మోడీకి లేఖ రాసిన కాసేపటికే దీన్ని ఎన్ఐఏకు అప్పగించారు. బంగారం స్మగ్లింగ్ విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదని.. పారదర్శకంగా విచారణ జరపాలని పినరయి విజయన్ లేఖలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం సిబ్బందే ఈ స్మగ్లింగ్ వెనుక ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో సీఎం పినరయి విజయన్ నేరుగా ప్రధానికి లేఖ రాశారు.

కేరళలో రాజకీయ ప్రకంపనలు సృష్టింస్తోన్న ముప్పై కేజీల గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారంలో ఏకంగా సీఎంవోకు సంబంధాలున్నాయని ఆరోపణలు చేస్తున్నాయి. సీఎంవోలో కీలక ఉద్యోగిగా పని చేస్తున్న స్వప్న సురేష్ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి ఊతమిచ్చినట్లుగానే ఐటీ శాఖ మాజీ ఉద్యోగి స్వప్న సురేష్ ఐదు రోజులుగా పరారీలో ఉన్నారు. కాంట్రాక్టు ఉద్యోగి స్వప్నను ఇదివరకే కేరళ ప్రభుత్వం తొలగించింది.

కేరళ సీఎం కార్యాలయంపై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో ఈ కేసులో ఇప్పటికే ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శి శివశంకర్ పై వేటు వేశారు. ఇటీవల తిరువనంతపురం విమానాశ్రయంలో 30 కేజీల గోల్డ్ సీజ్ చేయడంతో అసలు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో కస్టమ్స్ అధికారులు సీఎం కార్యాలయం పాత్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. స్వప్న సురేష్ ను విధుల నుంచి తొలగించారు. ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ కు చెందిన కొందరు అధికారులను తప్పించారు.

ప్రస్తుతం ఎన్ఐఏ దర్యాప్తు దేశ సమగ్రతకు దెబ్బ కలిగించే విధంగా గోల్డ్ స్మగ్లింగ్ ఉందని పినరయి విజయన్ లేఖలో పేర్కొన్నారు. దానికి ఆధారంగానే వ్యవస్థీకృత స్మగ్లింగ్ జాతీయ భద్రతకు ముప్పుకల్గిస్తుందన్న కోణంలో ఎన్ఐఏకు అప్పగిస్తున్నట్లుగా కేంద్ర హోంశాఖ కూడా పేర్కొంది. దీంతో ఇకపై సీబీఐ దర్యాప్తు చేస్తుందన్న బంగారం అక్రమ రవాణా కేసు.. ఎన్ఐఏకు బదిలీ అయింది.

ఇటీవల యూఏఈ నుంచి 30 కేజీల బంగారం తిరువనంతపురం ఎయిర్ పోర్టుకు వచ్చింది. కస్టమ్స్ అధికారులు, సీఎంవో కార్యాలయంలోని అధికారులు దీని వెనకాల ఉన్నారన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అక్కడున్న యూడీఎఫ్ ప్రతిపక్షం పినరయి విజయన్ రాజీనామా చేయాలని డిమాండ్ వినిపిస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ కేంద్రానికి లేఖ రాశారు. ప్రధానికి ఆయన లేఖ రాసిన కాసేపటికే దీన్ని ఎన్ఐఏకు అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ ప్రకటన విడుదల చేసింది.