ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.. కేంద్రంలో మాదే అధికారం: కాంగ్రెస్ సీనియర్ నేత

మొదట్లో 400 పైగా సీట్లు వస్తాయని ప్రచారం చేసిన బీజేపీ నాయకులు ఇప్పుడు ఆ మాటే ఎత్తడం లేదని సల్మాన్ ఖుర్షీద్ ఎద్దవా చేశారు.

ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.. కేంద్రంలో మాదే అధికారం: కాంగ్రెస్ సీనియర్ నేత

Salman Khurshid: లోక్‌స‌భ‌ ఎన్నికల్లో అధికార బీజేపీకి కాంగ్రెస్ పార్టీ గట్టిపోటీ ఇచ్చిందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ అన్నారు. లోక్‌స‌భ‌ ఎన్నికలు ఐదో విడత ముగిసిన నాటికే తమకు 300పైగా సీట్లు వస్తాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై సల్మాన్ ఖుర్షీద్ స్పందించారు. మొదట్లో 400 పైగా సీట్లు వస్తాయని ప్రచారం చేసిన బీజేపీ నాయకులు ఇప్పుడు ఆ మాటే ఎత్తడం లేదని ఎద్దవా చేశారు. ప్రధాని మోదీ కూడా 400 సీట్లు వస్తాయని చెప్పడం లేదన్నారు.

సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి గెలుస్తుందని సల్మాన్ ఖుర్షీద్ ధీమా వ్యక్తం చేశారు. ”ఈ ఎన్నికల్లో బిజెపికి గట్టిపోటీ ఇచ్చాం. గత రెండు లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో బాగా పోరాడాం. ఫలితం ఎలా ఉంటుంది అనేది జూన్ 4 తెలుస్తుంది. మేనిఫెస్టోలో అంశాలు, నిరుద్యోగం, పేపర్ లీకేజీలు ప్రజా సమస్యలను రాహుల్ గాంధీ పదే పదే ప్రస్తావించారు. ప్రజలు వాటిని అంగీకరించారు. మా హామీలను ప్రజలు ఆమోదించారు.

ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. పార్టీ ఉత్సాహం, పార్టీ కార్యకర్తల అంకితభావం చూస్తుంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామనే విశ్వాసం ఉంది. మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఎన్డీఏకు 400 స్థానాలు వస్తాయన్న మోదీ ఇప్పుడు ఆ మాట చెప్పడం లేదు. ఇప్పుడు వారి దృష్టి కాంగ్రెస్ (అధికారంలోకి) వస్తే ఏం జరుగుతుందనే దానిపైనే ఉంది. మేము గట్టి పోటీ ఇచ్చామని బీజేపీఒప్పుకుంద”ని సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యానించారు.

Also Read: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు సర్‌ప్రైజ్‌గా ఉంటాయి.. ఎందుకో తెలుసా?: రాహుల్ గాంధీ