ప్రధాని మోదీ 3.0 ఎలా ఉండబోతుంది? పూర్తి వివరాలు

ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారాలన్న లక్ష్యం నిర్దేశించుకున్న కేంద్రం...

ప్రధాని మోదీ 3.0 ఎలా ఉండబోతుంది? పూర్తి వివరాలు

Modi

ప్రధాని మోదీ 3.0 ఎలా ఉండబోతుంది..? గత రెండు విడతల పాలనలోలానే సంస్కరణలను పరుగులు తీయిస్తారా…లేక సంక్షేమానికి పెద్దపీట వేస్తారా..? ఆర్థికాభివృద్ధికి, అభివృద్ధి చెందిన భారత్ లక్ష్య సాధనకు సంస్కరణలు తప్పనిసరి.

తొలి, మలి విడత పాలనలో బీజేపీకి సంపూర్ణ మెజార్టీ ఉండడంతో ఎవ్వరి అభిప్రాయాలతో పనిలేకుండా మోదీ ఆర్థిక విధానాలు రూపొందించారు. మరి సంకీర్ణ ప్రభుత్వ సారధిగానూ అదే దూకుడుతో వెళ్తారా లేక సంక్షేమం, సంస్కరణల మేళవింపుగా పాలన సాగిస్తారా అన్నది భారతదేశ భవిష్యత్తును నిర్దేశించనుంది.

మోదీ ప్రధానిగా 2014లో బాధ్యతలు చేపట్టేనాటికి, ఇప్పటికి దేశ ఆర్థిక విధానంలో సమూల మార్పులొచ్చాయి. పదేళ్లగా దేశంలో సంస్కరణలు పరుగులు తీస్తున్నాయి. ఫలితంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ, ప్రయివేటీకరణకు అమిత ప్రాధాన్యత లభిస్తోంది. సంస్కరణల వల్లే దేశ ఆర్థికవృద్ధి పరుగులు పెడుతోందని, ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని, మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా మారేందుకు అడుగులు వేస్తోందని ఆర్థికనిపుణులు చెబుతుంటారు. 2014, 2019లో మోదీ తిరుగులేని మెజార్టీతో పాలన సాగించారు.

మేకిన్ ఇండియాకు పెద్దపీట
మేకిన్ ఇండియాకు పెద్దపీటవేశారు. దిగుమతులపై ఆధారపడే విధానాన్ని తగ్గించి..స్వయం తయారీ, ఎగుమతులను ప్రోత్సహించే ప్రయత్నాలు సాగాయి. మౌలికసదుపాయాలు, తయారీ వంటిరంగాల్లో ఆర్థిక సంస్కరణలు దేశాభివృద్ధికి దారితీశాయని, 2047నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ నిలవాలన్న ఆకాంక్షకు పురుడుపోశాయని భావిస్తారు. ఈ పరిస్థితుల్లో మోదీ 3.0 ఆర్థిక విధానాలపై అంతటా చర్చ జరుగుతోంది.

సంకీర్ణ ప్రభుత్వ హయాంలో అన్నిరంగాల్లో సంస్కరణలు అమలుచేయడం అనుకున్నంత తేలిక కాదు. అయితే పదేళ్లలో సాధించిన విజయాలను ప్రాతిపదికగా తీసుకుంటే….మూడో విడత పాలనలో ఆర్థిక విధానాల పరంగా పెద్దమార్పులేమీ ఉండకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మౌలికసదుపాయాలు, తయారీరంగాలకు ప్రాధాన్యత మోదీ 3.0లోనూ కొనసాగనుంది. రక్షణ రంగానికి భారీ కేటాయింపులు, రైల్వేలైన్ల నిర్మాణం, డిజిటల్ విప్లవం వంటిని నిరాటంకంగా కొనసాగనున్నాయి.

మోదీ పాలన సాగిన పదేళ్ల కాలంలో సంస్కరణలతో దేశం స్వరూపం మారిపోయింది. భారత్‌ను అంతర్జాతీయ తయారీ కేంద్రం…గ్లోబల్ మ్యానుఫాక్చరింగ్ హబ్‌గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. సెమీకండక్టర్ల తయారీ సంస్థలు, ఫోన్ల విడిభాగాల తయారీ, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్రోత్సహించేందుకు భారీగా రాయితీలు కల్పించింది. వచ్చే ఐదేళ్ల కాలంలో మిత్రపక్షాలు నుంచి ఈ విధానాలకు అభ్యంతరాలు ఉండకపోవచ్చు.

మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా..
ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారాలన్న లక్ష్యం నిర్దేశించుకున్న కేంద్రం… దిగుమతి సుంకాల తగ్గింపు, ఎగుమతుల పెంపు, ఉపాధి అవకాశాల కల్పనపై దృష్టిపెట్టాలని భావిస్తోంది. దిగుమతులపై విధిస్తున్న సుంకాలతో తయారీ ఖర్చులు పెరిగిపోతున్నాయి. దీంతో దిగుమతి సుంకాల తగ్గింపుపై దృష్టిపెట్టింది. మోదీ రెండో విడత పాలనలో స్మార్ట్‌ఫోన్ల విడిభాగాల దిగుమతులపై 10శాతం వరకు సుంకాలు తగ్గించింది.

అలాగే భారత్‌ను ఉత్పాదక శక్తిగా మార్చాలని ఎన్నికలకు ముందు కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఎలక్ట్రానిక్స్, ఆటో మొబైల్స్ వంటి రంగాలను అభివృద్ధి చేయడంపై దృష్టిపెట్టనుంది. తయారీ రంగంలో భారత్ వాటా 3శాతానికి పెరిగింది. దీన్ని మరింతగా పెంచేదిశగా చర్యలు చేపట్టనుంది. ఎగుమతుల పెంపు కోసం పారిశ్రామిక వేత్తలపై, ఉత్పత్తిదారులపై పన్నుల భారాన్ని తగ్గించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. దీనికి ఎన్డీఏ కూటమిలోని మిగిలిన పక్షాల మద్దతు తప్పనిసరి.

రోడ్లు, రైల్వే ట్రాకుల నిర్మాణానికి భారీగా నిధులు కేటాయించింది. 20కి పైగా నగరాల్లో మెట్రో అందుబాటులోకొచ్చింది. 31వేలకిలోమీటర్ల రైల్వే ట్రాక్ కొత్తగా నిర్మాణమయింది. ప్రపంచ స్థాయి రైల్వేస్టేషన్ల అభివృద్ధి, బుల్లెట్ రైలు కారిడార్లు వంటివాటికి భారీగా నిధులు ఖర్చుపెట్టాల్సి వస్తుంది. అలాగే ఎలక్ట్రిక్ మొబిలిటీ, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి, ప్రతి గ్రామానికి హై స్పీడ్ ఇంటర్‌నెట్ ఫెసిలిటీ వంటి హామీల అమలుపై మిత్రపక్షాలతో కలిసి ముందుకు సాగనుంది.

పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్‌ నాయుడు.. కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కి కీలక శాఖలు