South Africa : చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. టీమ్ఇండియా రికార్డు క‌నుమ‌రుగు..

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లో ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు చ‌రిత్ర సృష్టించింది.

South Africa : చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. టీమ్ఇండియా రికార్డు క‌నుమ‌రుగు..

PIC credit : ICC

South Africa – T20 World Cup history : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లో ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు చ‌రిత్ర సృష్టించింది. పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లో అతి త‌క్కువ స్కోరును కాపాడుకున్న జ‌ట్టుగా రికార్డు సృష్టించింది. సోమ‌వారం రాత్రి న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఈ రికార్డును అందుకుంది. ఈ మ్యాచ్‌లో ద‌క్షిణాఫ్రికా 114 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని కాపాడుకుంది. ఉత్కంఠ పోరులో నాలుగు ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది.

ఈ మ్యాచ్‌లో ద‌క్షిణాఫ్రికా మొద‌ట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత‌ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ (44 బంతుల్లో 46), డేవిడ్ మిల్లర్ (38 బంతుల్లో 29) లు రాణించారు. అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 109 పరుగులకే పరిమితమైంది. బంగ్లా బ్యాట‌ర్ల‌లో తౌహిద్ హృదోయ్ (34 బంతుల్లో 37) పోరాడినా ఓట‌మి త‌ప్ప‌లేదు. స‌ఫారీ బౌల‌ర్ల‌లో కేశవ్ మహరాజ్ మూడు వికెట్లు తీశాడు. నోకియా, రబాడ చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు.

SA vs BAN : బంగ్లాదేశ్ కొంపముంచిన ఐసీసీ రూల్‌.. గెలిచే మ్యాచ్‌లో ఓట‌మి.. సౌతాఫ్రికా ల‌క్కీ..

ఈ మ్యాచ్‌లో గెల‌వ‌డంతో ద‌క్షిణాఫ్రికా ప‌లు రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టింది. పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ చరిత్రలో తక్కువ స్కోరును కాపాడుకున్న జ‌ట్టుగా చ‌రిత్ర సృష్టించింది. అంత‌క‌ముందు ఈ రికార్డు భార‌త్, శ్రీలంక పేరిట ఉండేది. 2014లో కివీస్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో శ్రీలంక‌, 2024 పాకిస్తాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో భార‌త్ లు 120 ప‌రుగుల ల‌క్ష్యాన్ని కాపాడుకున్నాయి. ఆ త‌రువాతి స్థానాల్లో అఫ్గానిస్థాన్ (వెస్టిండీస్ పై124 ప‌రుగులు ), న్యూజిలాండ్ (ఇండియా పై 127 ప‌రుగులు) ఉన్నాయి.

5 కంటే త‌క్కువ ప‌రుగులు..
టీ20 ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లో 5 కంటే త‌క్కువ ప‌రుగుల తేడాతో అత్య‌ధిక సార్లు విజ‌యం సాధించిన జ‌ట్టుగా ద‌క్షిణాఫ్రికా రికార్డుల‌కు ఎక్కింది. నాలుగు సార్లు సౌతాఫ్రికా ఇలా విజ‌యం సాధించింది. 2009లో న్యూజిలాండ్‌పై 1 పరుగు, 2014లో న్యూజిలాండ్‌పై 2 పరుగులు, 2014లో ఇంగ్లాండ్ పై 3 పరుగులు, ప్రస్తుత ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌పై 4 పరుగుల తేడాతో సౌతాఫ్రికా గెలిచింది.

IND vs PAK : పాక్ పై విజ‌యం.. భార‌త బ్యాట‌ర్ల‌పై సునీల్ గ‌వాస్క‌ర్ ఆగ్ర‌హం.. ఒక్క‌రైనా..