ఆ సమయంలో ఆ ఉద్యోగి ఎందుకు వెళ్లాడు? మదనపల్లి ఘటనపై సీఎం చంద్రబాబు ప్రశ్నల వర్షం

ఈ ఘటనపైన జిల్లా కలెక్టర్ తో కూడా చంద్రబాబు ఫోన్ లో మాట్లాడారు. ఈ ఘటన రాత్రి 11 గంటల 24 నిమిషాలకు జరిగినట్లు సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు.

ఆ సమయంలో ఆ ఉద్యోగి ఎందుకు వెళ్లాడు? మదనపల్లి ఘటనపై సీఎం చంద్రబాబు ప్రశ్నల వర్షం

Madanapalle sub collectors office fire Incident : మదనపల్లి సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో అగ్నిప్రమాదంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అసెంబ్లీలోని సీఎం చాంబర్ లో జరిగిన సమీక్షకు సీఎస్, సీఎంవో అధికారులు, ఇంటెలిజెన్స్ చీఫ్ హాజరయ్యారు. అగ్నిప్రమాదంలో అసైన్డ్ భూముల ఫైల్స్ దగ్దమైనట్లు ప్రాథమిక సమాచారం. ఈ వ్యవహారంలో సీసీటీవీ ఫుటేజ్ తో సహా మొత్తం వివరాలు బయటకు తీయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీంతో డీజీపీ ద్వారక తిరుమలరావు మదనపల్లికి బయలుదేరారు.

ఇక, ఈ ఘటనపైన జిల్లా కలెక్టర్ తో కూడా చంద్రబాబు ఫోన్ లో మాట్లాడారు. ఈ ఘటన రాత్రి 11 గంటల 24 నిమిషాలకు జరిగినట్లు సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. ఈ ఘటనపై జిల్లా అధికారులు సత్వరం స్పందించకపోవడంపై చంద్రబాబు ఆరా తీశారు. నిన్న రాత్రి 10.30 గంటల వరకు కార్యాలయంలో గౌతమ్ అనే ఉద్యోగి ఉన్నట్లు వారు సీఎంకు తెలిపారు. ఆ సమయంలో అతడు అక్కడికి ఎందుకు వెళ్లాడు? ఏ పని కోసం వెళ్లాడు? అనే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.

ఈ ఘటన సమయంలో విధుల్లో వీఆర్ఏలు ఉన్నారని చంద్రబాబుకు తెలిపారు అధికారులు. ఘటనా స్థలానికి పోలీస్ జాగిలాలు వెళ్లాయా? ఉదయం నుంచి ఏం విచారణ చేశారు? అని అధికారులను సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ, ఇతర ఆధారాల సేకరణ విషయంలో జాప్యంపైనా చంద్రబాబు ప్రశ్నించారు. ఘటన జరిగిన సమయంలో విద్యుత్ సరఫరా పరిస్థితిపైన విచారణ జరపాలని, సీసీ కెమెరాలో ఫుటేజీని వెంటనే హ్యాండోవర్ చేసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

ఇక సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆ ప్రాంతంలో ఆ సమయంలో సంచరించిన వ్యక్తుల వివరాలు, వారి కాల్ డేటా సేకరించాలని అధికారులకు సూచించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. గతంలో సాక్ష్యాలు మాయం చేసిన ఘటనలను అధికారులు మర్చిపోకూడదని, ఆ కోణంలో లోతుగా దర్యాఫ్తు జరపాలన్నారు. ఈ ఘటనపై మినిట్ టు మినిట్ ఏం జరిగింది? అనే వివరాలు సమగ్రంగా తన ముందు ఉంచాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు.

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత అర్థరాత్రి వేళ ప్రభుత్వ కార్యాలయాల్లో అగ్నిప్రమాదాలు జరగడం, రికార్డులు దగ్ధం కావడం అనేది చాలా చోట్ల జరుగుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒకటి రెండు ఎమ్మార్వో కార్యాలయాల్లో, ఒక ఎంపీడీవో కార్యాలయంలో ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. అన్నింటికంటే పెద్ద ఘటన.. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగినదే. ఈ అగ్నిప్రమాదంలో పెద్ద మొత్తంలో రికార్డులన్నీ దగ్ధమయ్యాయి. దీని వెనుక కుట్ర కోణం ఉందని, ఉద్దేశపూర్వకంగానే, తప్పు చేసిన వారు తప్పించుకునేందుకు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు అనేది ప్రభుత్వం అనుమానిస్తోంది.

దేశంలోనే అతిపెద్ద రెవెన్యూ డివిజన్ మదనపల్లె రెవెన్యూ డివిజన్. సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉంది. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిన్న రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం వెనుక కుట్రకోణం ఉంది, ఉద్దేశపూర్వకంగానే పత్రాలు కాల్చి వేసేందుకే ఆ తరహాలో అగ్నిప్రమాదం సృష్టించారు అనే అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. దీనిపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. ఏకంగా రాష్ట్ర డీజీపీ, సీఐడీ చీఫ్ ఇద్దరూ మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరపబోతున్నారు.

కాగా.. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఘటనపై సీఎం చంద్రబాబు రెండోసారి సమీక్ష చేశారు. ఉదయం నుంచి జరుగుతున్న దర్యాప్తు అంశాలపై అధికారులతో నిరంతరం సమీక్షిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. దగ్ధమైన దస్త్రాలు ఏఏ విభాగాలకు చెందినవి, ఆధారాల సేకరణలో నిర్లక్ష్యానికి కారకులు ఎవరు? అనే అంశాలపై ఆరా తీశారు. గతంలో ఇక్కడ పని చేసి వెళ్లిన అధికారుల ప్రమేయంపైనా దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు.

Also Read : శాంతి నియామకం అక్రమమని తేలితే బాధ్యులపై చర్యలు తప్పవు- మంత్రి ఆనం హెచ్చరిక