సొంత చిన్నాన్నను చంపేసినప్పుడు ఢిల్లీలో ధర్నా ఎందుకు చేయలేదు: జగన్‌ను ప్రశ్నించిన షర్మిల

మీ కార్యకర్తను చంపేస్తే ఢిల్లికి వెళ్లి ధర్నా చేస్తున్నారే.. మరి సొంత చిన్నాన్నను చంపేసినప్పుడు న్యాయం కోసం మీరు ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేదు? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి.

సొంత చిన్నాన్నను చంపేసినప్పుడు ఢిల్లీలో ధర్నా ఎందుకు చేయలేదు: జగన్‌ను ప్రశ్నించిన షర్మిల

YS Sharmila sensational comments on YS Jagan Delhi Dharna

YS Sharmila on YS Jagan Delhi Dharna: ఏపీలో హత్యా రాజకీయాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో ధర్నా చేస్తామంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు. సోమవారం విజయవాడలో పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. శాసనసభా సమావేశాల నుంచి తప్పించుకునేందుకే జగన్ ఢిల్లీ వెళుతున్నారని ఆరోపించారు. జగన్ హత్యరాజకీయాలు చేశారని.. ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టారని, విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడలేకపోయారని విమర్శించారు.

”వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హత్యరాజకీయాలు, గొడ్డలి రాజకీయాలు చేశారు. హత్య చేయించిన వారితో భుజాలు రాసుకుని తిరిగారు. సొంత చెల్లెళ్లకే వెన్నుపోటు పొడిచారు. ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టారు. ఢిల్లీలో ధర్నా చేస్తారా? ప్రత్యేక హోదా కోసం ఎందుకు ధర్నా చేయలేదు? ఐదేళ్లు అధికారంలో ఉన్నారు కదా.. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ఎన్నిసార్లు ధర్నా చేశారు? ప్రత్యేక హోదా ఊసే లేకుండా చేశారు కదా. అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టును ఏ రోజు పట్టించుకోలేదు. మూడు రాజధానులు అని చెప్పి ప్రజలను కన్ఫ్యూజ్ చేశారు. కడప స్టీల్ ఫ్యాక్టరీని కూడా పట్టించుకోలేదు.

రాష్ట్రానికి తలమానికమైన విశాఖ స్టీల్ ను అమ్మేస్తామన్నా పట్టించుకోలేదు? ఈ రోజు మాత్రం ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తారా? మీ కార్యకర్తను చంపేస్తే ఢిల్లికి వెళ్లి ధర్నా చేస్తున్నారే.. మరి సొంత చిన్నాన్నను చంపేసినప్పుడు న్యాయం కోసం మీరు ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేదు? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అసెంబ్లీ జరుగుతున్న సమయంలో ఉండకుండా సాకులు వెతుక్కుని ఢిల్లీ వెళ్తున్నారు. మీరు ఉన్నదే 11 మంది. అసెంబ్లీలో బిల్లులపై డిస్కసన్ మీకు అవసరం లేదా? ప్రజావ్యతిరేక బిల్లులపై కొట్లాడాల్సిన అవసరం మీకకు లేదా? ఏం ఆలోచిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు?

Also Read : అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం.. జగన్‌ను పలకరించిన రఘురామ కృష్ణరాజు.. జగన్ ఏమన్నారంటే?

వినుకొండలో జరిగిన హత్య రాజకీయ హత్యకానే కాదు వ్యక్తిగత కక్షలతో జరిగిన మర్డర్. హత్యచేసిన వాళ్లు, హత్యకు గురైనవాళ్లు మొన్నటివరకు వైసీపీతోనే ఉన్నారు. మరి పొలిటికల్ మర్డర్ ఎలా అవుతుంది? ఇది పొలిటికల్ మర్డర్ అని చెప్పి, ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తున్నారా? మీ ఉనికి కాపాడుకోవడం కోసమే ధర్నా చేస్తున్నారు. రాష్ట్రంలో వరద బాధితులను పరామర్శించాలని మీకు అనిపించలేదు. ప్రజల కోసం మీరు ఎందుకు నిలబడలేదు? మీ పార్టీవాళ్లు ఓటేస్తేనే మీరు గెలిచారా? మీ పార్టీవాళ్లు ఓటేస్తేనే మీరు ముఖ్యమంత్రి అయ్యారా? ఐదేళ్లు ప్రజల కోసం పనిచేయలేదు గానీ, ఈరోజు ఢిల్లికి వెళ్లి ధర్నా చేస్తారంట.. సిగ్గుండాలి కదా” అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.