ఏపీకి ఇచ్చి తెలంగాణకు ఎందుకు ఇవ్వలేదు?- కేంద్ర బడ్జెట్‌పై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్

తెలంగాణకు జరిగిన అన్యాయానికి రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పి, తక్షణమే మోదీ మంత్రివర్గం నుంచి తప్పుకోవాలి.

ఏపీకి ఇచ్చి తెలంగాణకు ఎందుకు ఇవ్వలేదు?- కేంద్ర బడ్జెట్‌పై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్

Cm Revanth Reddy : కేంద్ర బడ్జెట్ పై తీవ్రంగా స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్రంలోని మోదీ సర్కార్ పై ఆయన నిప్పులు చెరిగారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ పట్ల కక్ష పూరితంగా వ్యవహరించారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వికసిత్ భారత్ లో తెలంగాణ భాగం కాదన్నట్లుగా కేంద్రం తీరు ఉందని ధ్వజమెత్తారు. బీహార్, ఏపీకి తప్ప ఇతర రాష్ట్రాలకు కేటాయింపులు లేకపోవడం దారుణం అన్నారు. ఓట్లు, సీట్లు మాత్రమే తెలంగాణ నుంచి కావాలి..కానీ, తెలంగాణ ఆత్మగౌరవం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి పట్టింపు లేదని మరోసారి రుజువైందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

బడ్జెట్ లో తెలంగాణకు నిధులు కేటాయించాలని కోరుతూ ఢిల్లీకి 14సార్లు వెళ్లి వినతిపత్రాలు ఇచ్చినా.. తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి నిధులు కేటాయించలేదని సీఎం రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీని తాము పెద్దన్నగా భావించామని, తెలంగాణకు పెద్దన్నగా న్యాయం చేయాలని, నిధులు కేటాయించాలని ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులను కోరినా ప్రయోజనం లేకపోయిందన్నారు. కేంద్ర బడ్జెట్ లో కనీసం తెలంగాణ అనే పదాన్నే ఉచ్చరించలేదని సీఎం రేవంత్ అన్నారు.

కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఇవాళ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ”బీజేపీ అధ్యక్షుడిగా, నరేంద్ర మోదీ మంత్రివర్గంలో యూనియన్ కేబినెట్ మినిస్టర్ గా కిషన్ రెడ్డి బాధ్యత వహించాలి. తెలంగాణకు జరిగిన అన్యాయానికి తెలంగాణ ప్రజలకు వెంటనే క్షమాపణలు చెప్పి, తక్షణమే మోదీ మంత్రివర్గం నుంచి కిషన్ రెడ్డి తప్పుకోవాలి” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

”ఏపీకి నిధులు ఎందుకిస్తున్నారని అడగడం లేదు. మాకు ఎందుకు ఇవ్వడం లేదనే అడుగుతున్నాం. గుజరాత్ కు ఎలా నిధులు కేటాయిస్తున్నారో, తెలంగాణకు అలానే ఇవ్వాలని కోరాం. మూసీ నది అభివృద్ధికి నిధులు ఇవ్వాలని అడిగాం. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంతా బోగస్” అని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

Also Read : వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఆక్సిజన్ ఇచ్చి బతికించారు- కేంద్ర బడ్జెట్‌పై సీఎం చంద్రబాబు