షర్మిలతో రాజీపడతారా, బీజేపీని ఎదిరించి ఇండియా కూటమితో జతకడతారా.. వైఎస్ జగన్ దారెటు?

ఢిల్లీ ఎపిసోడ్ పరిశీలిస్తే... రెండు జాతీయ పార్టీల జంక్షన్‌లో జగన్ చిక్కుకున్నట్లే కనిపిస్తోంది. పద్మవ్యూహం లాంటి ఈ పరిస్థితుల నుంచి ఆయన ఎలా బయటకు వస్తారనేది ఉత్కంఠ రేపుతోంది.

షర్మిలతో రాజీపడతారా, బీజేపీని ఎదిరించి ఇండియా కూటమితో జతకడతారా.. వైఎస్ జగన్ దారెటు?

Gossip Garage : ఇండియా కూటమితో చర్చలకే జగన్ ఢిల్లీకి వెళ్లినట్టుంది తప్ప.. ధర్నాకు వెళ్లినట్టు లేదు అన్నారు ఏపీకి చెందిన ఓ మంత్రి… నిజమే… ఏపీలో శాంతిభద్రతల విషయమై ఢిల్లీ వెళ్లిన జగన్ చుట్టూ ఇండియా కూటమి నేతలు ర్యాలీ కావడం దేనికి సంకేతం…? తటస్థంగా ఉన్నానని చెబుతూ.. పరోక్షంగా ఎన్డీఏ కూటమికి ఇన్నాళ్లు సహకరించిన జగన్‌ను.. తమవైపు తిప్పుకోవాలని ఇండియా కూటమి భావిస్తోందా? జగన్ ఇండియా కూటమితో జతకడితే రాష్ట్రంలో రాజకీయం ఎలా? షర్మిలతో రాజీపడతారా? ఢిల్లీ బీజేపీ పెద్దలను ఎదిరించి రాజకీయం చేయగలరా..? ఇలా ఎన్నో ప్రశ్నలు ఉదయిస్తున్నాయి…! మరి జగన్ ఏం చేయనున్నారు.. అటు ఎన్డీఏ.. ఇటు ఇండియా కూటమి జంక్షన్‌లో నిలిచిన జగన్ దారెటు..?

నిలదొక్కుకోవాలంటే జాతీయస్థాయిలో బలమైన అండ లభించాల్సిందే..
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి.. రాజకీయంగా ఇప్పుడు అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన జగన్.. కేవలం నలుగురు లోక్‌సభ సభ్యులు, 11 మంది రాజ్యసభ సభ్యుల అండతోనే రాజకీయం నెట్టుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో బలమైన పార్టీలు అన్నీ కూటమిగా ఏర్పడి వైసీపీని ఒంటరి చేశాయి. ఈ పరిస్థితుల్లో వైసీపీ నిలదొక్కుకోవాలంటే జాతీయస్థాయిలో బలమైన అండ లభించాల్సి వుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో ఏపీలో పెద్దగా ప్రభావం చూపలేని ఇండియా కూటమికి… వైసీపీ వంటి పెద్ద పార్టీ సహకారం ముఖ్యమనే వాదన వినిపిస్తోంది. ఈ సంక్లిష్ట పరిస్థితుల్లోనే ఢిల్లీలో జగన్ చేపట్టిన ధర్నాకు ఇండియా కూటమి నేతలు తరలివచ్చారంటున్నారు.

ఢిల్లీలో వైసీపీ ధర్నాపై కన్నెత్తి చూడని బీజేపీ పెద్దలు..
వైసీపీ అధికారంలో ఉండగా, ఎన్డీఏ కూటమికి పరోక్షంగా సహకరించారనే అభిప్రాయం ఉంది. ముఖ్యంగా బీజేపీ పెద్దలకు అనుకూలంగా వ్యవహరించారనే విమర్శలు ఎదుర్కొన్నారు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టడమే జగన్ ఓటమికి కారణమన్న వాదన కూడా ఉంది. కానీ, ఇప్పటికీ బీజేపీ పెద్దలతో యుద్దానికి సిద్ధంగా లేనట్లే వ్యవహరిస్తున్నారు జగన్. కానీ, బీజేపీ భాగస్వామ్యిగా ఉన్న కూటమి ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతూ ఢిల్లీలో ఆందోళన చేపట్టారు. జగన్‌తో రహస్య స్నేహం కొనసాగుతున్నా… బీజేపీ పెద్దలు ఎవరూ ఢిల్లీలో వైసీపీ ధర్నాపై కన్నెత్తి చూడలేదు. దీనికి కారణం ఇక్కడా… అక్కడా.. ఎన్డీఏ ప్రభుత్వం ఉండటమే.. పైగా జాతీయ స్థాయిలో టీడీపీ మద్దతు బీజేపీకి ఎంతో అవసరం… ఈ పరిస్థితుల్లో జగన్ రాజకీయంగా ఎలాంటి అడుగులు వేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

జగన్‌కు బాసటగా నిలిచిన ఇండియా కూటమి నేతలు..
ఇదే సమయంలో ఢిల్లీలో జగన్‌కు బాసటగా నిలిచిన ఇండియా కూటమి నేతలు సరికొత్త చర్చకు తెరలేపారు. ఇండియా కూటమిలో కాంగ్రెస్ తరువాత ఎక్కువ సీట్లు సాధించిన సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ జగన్‌కి వెన్ను దన్నుగా నిలవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అదే విధంగా ఇండియా కూటమిలో మరో పెద్ద పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కూడా జగన్‌కి గట్టి మద్దతు ప్రకటించింది. ఇక శివసేన, ఇండియన్ ముస్లిం లీగ్ వంటి పార్టీలూ మేమున్నాం అంటూ వైసీపీకి భరోసాగా నిలిచాయి. ఇవన్నీ ఇండియా కూటమి పార్టీలే.. అదే విధంగా పక్కనే ఉన్న తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే కూడా జగన్ ధర్నా శిబిరంలో కనిపించింది. అన్నాడీఎంకే కూడా ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చి ప్రస్తుతం తటస్థంగా ఉండిపోయింది. ఇలా ఢిల్లీలో జగన్ ఊహించని విధంగా ఇండియా కూటమి నుంచి మద్దతు లభించడమే పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.

కాంగ్రెస్, వామపక్షాలను జగన్‌ చేరదీస్తే మేలు జరిగేదేమో?
జగన్‌తో స్నేహం ఇటు ఇండియా కూటమికి.. అటు వైసీపీకి ఉభయకుశలోపరిగా వ్యాఖ్యానిస్తున్నారు రాజకీయ పండితులు. జగన్‌కు జాతీయ పార్టీల అండ అవసరమవగా, ఇండియా కూటమికి ఏపీలో బలమైన పార్టీ ఆసరా ఉండాల్సిన పరిస్థితి ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ సంయుక్తంగా పోటీ చేయడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలలేదు. దీనివల్ల వైసీపీ నష్టపోయింది. అదే వైసీపీ ఇండియా కూటమిలోని కాంగ్రెస్, వామపక్షాలను చేరదీస్తే… కొంతవరకైనా మేలు జరిగే అవకాశం ఉండేదని విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.

షర్మిల ఎంత వరకు సహకరిస్తుందనే ప్రశ్న..
ఇదే సమయంలో కాంగ్రెస్‌ను వ్యతిరేకించి… సొంత పార్టీ పెట్టుకున్న జగన్ మళ్లీ ఆ పార్టీతో స్నేహంగా మెలగడం కుదురుతుందా? అన్న చర్చ కూడా జరుగుతోంది. ఐతే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరనే విషయాన్ని గుర్తుచేస్తున్నారు పరిశీలకులు. ప్రస్తుతం బీజేపీతో స్నేహంగా ఉన్న టీడీపీ… కాంగ్రెస్‌తో స్నేహం చేస్తున్న తృణమూల్, డీఎంకే వంటి పార్టీలు గతంలో ఆయా పార్టీలను వ్యతిరేకించిన విషయాన్ని మరచిపోకూడదని అంటున్నారు. అయితే జగన్‌ను ఇండియా కూటమిలోకి ఆహ్వానించడానికి ఆ పార్టీలు సిద్ధంగా ఉన్నప్పటికీ… స్థానికంగా జగన్ టార్గెట్‌గా రాజకీయం చేస్తున్న పీసీసీ అధ్యక్షురాలు షర్మిల వైఖరి కూడా ఇక్కడ చర్చనీయాంశమవుతోంది. జగన్… ఇండియా కూటమికి దగ్గరైతే షర్మిల ఎంత వరకు సహకరిస్తుందనే ప్రశ్న తలెత్తుతోంది. మొత్తానికి ఢిల్లీ ఎపిసోడ్ పరిశీలిస్తే… రెండు జాతీయ పార్టీల జంక్షన్‌లో జగన్ చిక్కుకున్నట్లే కనిపిస్తోంది. పద్మవ్యూహం లాంటి ఈ పరిస్థితుల నుంచి ఆయన ఎలా బయటకు వస్తారనేది ఉత్కంఠ రేపుతోంది.