పొలిటికల్ బ్రదర్స్.. పవన్ కల్యాణ్, లోకేశ్ మధ్య రోజురోజుకు పెరుగుతున్న అనుబంధం

రాజకీయ ప్రత్యర్థులకు మింగుడు పడని విధంగా కూటమి పావులు కదుపుతుండటం... పవన్‌, లోకేశ్‌ మధ్య అనుబంధం ఆసక్తికరంగా సాగుతుండటమే రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారింది.

పొలిటికల్ బ్రదర్స్.. పవన్ కల్యాణ్, లోకేశ్ మధ్య రోజురోజుకు పెరుగుతున్న అనుబంధం

Gossip Garage : ఆ ఇద్దరూ సూపర్‌ బ్రదర్స్‌.. ఒకటే మాట.. ఒకటే బాట… వారి మధ్య భేదాభిప్రాయాలు రాకపోతాయా? అని ఎదురుచూస్తున్నవారికి నిరాశే మిగులుతోంది. రోజురోజుకి వారి మధ్య బంధం బలపడుతోంది. అన్నకు తోడుగా తమ్ముడు… తమ్ముడు నిర్ణయాలకు అండగా అన్న… ఒకరికొకరు అన్నట్లు సాగుతోంది వారి ప్రయాణం… ఆ ఇద్దరి మధ్య అనుబంధం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది…. రాజకీయ చదరంగంలో ఎంతో పరిణతితో వ్యవహరిస్తున్న ఆ ఇద్దరు ఎవరూ..? వారి మధ్య అనుబంధం ఎంత ధృడంగా సాగుతోంది?

సరికొత్త చరిత్రకు నాంది పలుకుతున్న పవన్‌, లోకేశ్‌
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, హెఆర్‌డీ మంత్రి నారా లోకేశ్‌ మధ్య పరస్పర సహకారం ఏపీ రాజకీయాల్లో ప్రత్యేక చర్చకు దారితీస్తోంది. పవన్‌ మాట… లోకేశ్‌ బాట అన్నట్లు సాగుతున్న పొలిటికల్‌ జర్నీ ఆసక్తిరేపుతోంది. వీరిద్దరి పరస్పర సహకారం… రోజురోజుకు పెరుగుతున్న అనుబంధం రాజకీయ ప్రత్యర్థులకు నిరాశే మిగుల్చుతోందంటున్నారు. కూటమిలో విభేదాలు రావాలంటే ఈ ఇద్దరి మధ్య అగ్గిరాజేయాలని ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నా…. ఇద్దరూ ఎంతో సమన్వయంతో నడుచుకోవడమే కాకుండా.. ఇరు పార్టీల కేడర్‌కు సరైన దిశానిర్దేశం చేస్తూ సరికొత్త చరిత్రకు నాంది పలుకుతున్నట్లు చెబుతున్నారు.

పవన్‌ను ఓ అన్నలా భావిస్తూ లోకేశ్ అడుగులు..
మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడం ద్వారా మంత్రి లోకేశ్‌… డిప్యూటీ సీఎం పవన్‌కు చాలా ప్రాధాన్యమిస్తున్న సంకేతాలు పంపారంటున్నారు. ఇటీవల జనసేన సమావేశంలో అన్న క్యాంటీన్లలో కొన్నింటికి డొక్కా సీతమ్మ పేరు పెడితే బాగుంటుందని డిప్యూటీ సీఎం పవన్‌ చేసిన ప్రతిపాదనకు మంత్రి నారా లోకేశ్ వెంటనే స్పందించారు. పవన్‌ తన పార్టీ సమావేశంలో చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకున్న లోకేశ్‌…. విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడం ద్వారా పవన్‌ ఆదర్శాలను తాము ఆచరిస్తామని చెప్పకనే చెప్పారు. ఈ ఒక్క విషయంలోనే కాదు టీడీపీ-జనసేన మధ్య పొత్తు కుదిరిన క్షణం నుంచి పవన్‌తో చక్కని సమన్వయానికి ప్రాధాన్యమిస్తూ…. పవన్‌ను ఓ అన్నలా భావిస్తూ అడుగులు వేస్తున్నారు లోకేశ్‌.

కుమారుడి కన్నా ప్రభుత్వంలో పవన్‌కే ఎక్కువ ప్రాధాన్యం..
కూటమి నేత, సీఎం చంద్రబాబు సైతం పవన్‌కు ఎంతో గౌరవం ఇస్తున్నట్లు చెబుతున్నారు. తన క్యాబినెట్‌లో రెండో స్థానం ఇవ్వడమే కాకుండా… అన్ని విషయాల్లోనూ పవన్‌కు ప్రాధాన్యమిస్తూ… తన కుమారుడు కన్నా ప్రభుత్వంలో పవన్‌ ప్రాధాన్యం ఎక్కువ ఉండేలా చూడటం కూడా పవన్‌, లోకేశ్ మధ్య అనుబంధాన్ని పెంచుతోందంటున్నారు. గత నెలలో సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం తర్వాత రెండో స్థానంలో పవన్‌, మూడోస్థానంలో లోకేశ్‌ ప్రమాణం చేశారు. మంత్రిగా లోకేశ్‌ ప్రమాణస్వీకారం తర్వాత చంద్రబాబు, ఆ తర్వాత పవన్‌కు పాదాభివందనం చేయడం కూడా ఈ ఇద్దరి మధ్య బంధాన్ని బలపడేలా చేసిందంటున్నారు.

విధి నిర్వహణలో ఇద్దరి మధ్య పోటాపోటీ..
వాస్తవానికి కూటమిలో రెండు పార్టీలు కానీ, ఇద్దరు నేతల మధ్య గాని ఈ స్థాయి సహకారం ఉంటే ఆ బంధం ఎక్కువ కాలం కొనసాగే అవకాశాలు ఉంటాయనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. పొత్తు కుదిరిన సమయంలో కూడా పవన్‌ తమ మధ్య పొత్తు 30 ఏళ్లు కొనసాగుతుందని చెప్పారు. ఇప్పుడు కూటమి నేతలు ఇద్దరూ ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుండటం శుభపరిణామంగా అభివర్ణిస్తున్నారు ఇరు పార్టీల నేతలు. మరోవైపు ఇద్దరు నేతలు తొలిసారి ఎమ్మెల్యేలు అయినప్పటికీ, ఇద్దరూ కీలక శాఖలకు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. విధి నిర్వహణలో ఇద్దరూ పోటాపోటీగా వ్యవహరిస్తూనే ఒకరినొకరు గౌరవించుకోవడం, ఒకరి నిర్ణయాలను ఒకరు అభినందించుకుంటూ ముందుకు సాగుతుండటమే పొలిటికల్‌ సర్కిల్స్‌లో ఎక్కువ చర్చకు దారితీస్తోంది.

ఇరు పార్టీల్లోనూ సానుకూల దృక్పథాన్ని పెంచుతున్న లోకేశ్ తీరు..
పవన్‌, లోకేశ్ మధ్య అనుబంధాన్ని చూస్తున్న వారు సైతం ఆశ్చర్యపోతున్నారు. సీఎం కుమారుడిగా, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్న లోకేశ్‌… కూటమిలో ఇతర పక్షాలకు.. నేతలకు ఇంతలా గౌరవించడం కూడా చక్కని వాతవారణానికి కారణమవుతోందంటున్నారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్‌ విషయంలో లోకేశ్‌ తీరు ఇరు పార్టీల్లోనూ సానుకూల దృక్పథాన్ని పెంచుతోందనే టాక్‌కు కారణమవుతోంది.

పొత్తు ప్రకటన వెలువడిన నాటి నుంచి అనుబంధం..
చంద్రబాబు అరెస్టు సమయంలో టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు జనసేనాని పవన్‌ ప్రకటించిన నుంచి ఇద్దరి మధ్య అనుబంధం పెనవేసుకుందని చెబుతున్నారు. కష్టకాలంలో అన్నలా అండగా నిలిచిన పవన్‌కు అప్పట్లో కృతజ్ఞతలు తెలిపిన లోకేశ్‌… ఆ సంఘటననే స్ఫూర్తిగా తీసుకుని అడుగులు వేస్తున్నారంటున్నారు. అందుకే చంద్రబాబు సైతం పవన్‌కు సముచిత స్థానమే కల్పిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో తన ఫొటోతో పాటు పవన్‌ ఫొటో కూడా ఉండేలా అధికారులకు సూచనలివ్వడాన్ని గుర్తుచేస్తున్నారు.

రాజకీయ ప్రత్యర్థులకు మింగుడు పడని విధంగా కూటమి పావులు..
మరోవైపు కూటమిలో కీలక భాగస్వామి బీజేపీ కూడా టీడీపీ, జనసేన నిర్ణయాలను స్వాగతిస్తూ తమ సహకారాన్ని అందిస్తోందంటున్నారు. పవన్‌ సూచన ప్రకారం పథకాలకు విద్యావేత్తల పేర్లు పెట్టడాన్ని బీజేపీ చీఫ్‌ పురందేశ్వరి కూడా అభినందించారు. ఇలా ఒకవైపు పవన్‌, లోకేశ్‌ జోడెద్దులా ప్రభుత్వంలో పనిచేస్తుంటే… సీఎం చంద్రబాబు, బీజేపీ చీఫ్‌ పురందేశ్వరి కూడా తమ వైపు నుంచి కావాల్సిన సహకారమందిస్తూ కూటమిని మరింత బలోపేతం చేస్తున్నారు. మొత్తానికి రాజకీయ ప్రత్యర్థులకు మింగుడు పడని విధంగా కూటమి పావులు కదుపుతుండటం… పవన్‌, లోకేశ్‌ మధ్య అనుబంధం ఆసక్తికరంగా సాగుతుండటమే రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారింది.

Also Read : వైసీపీకి బిగ్ షాక్‌ తప్పదా? అధికార పార్టీకి దగ్గరవుతున్న ఎమ్మెల్సీలు..!