అసమర్ధ పాలనతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు- జగన్‌పై మంత్రి పార్థసారధి ఫైర్

దాదాపు 11లక్షల కోట్ల అప్పుల ఊబిలో రాష్ట్రాన్ని దించేసిన మీరు.. ఇవాళ నీతులు వల్లిస్తున్నారు. ఆరోగ్యశ్రీకి డబ్బులు చెల్లించడం లేదని ఎంతవరకు సబబో ఆలోచించాలి.

అసమర్ధ పాలనతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు- జగన్‌పై మంత్రి పార్థసారధి ఫైర్

Kolusu Parthasarathy : దేశంలోనే 1, 2 స్థానాల్లో ఉండాల్సిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం… జగన్ పాలన కారణంగా ఆర్థికంగా చితికిపోయిందని మంత్రి పార్థసారధి ఆరోపించారు. ఇటువంటి పరిస్థితుల్లోనూ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో పేదలు, వృద్ధులు ఇబ్బంది పడకూడదని పెంచిన పెన్షన్లను సీఎం చంద్రబాబు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. పెన్షన్లకు సంబంధించి రూ.2వేల 737.41 కోట్లను ఒక్కటే రోజు పంపిణీ చేయబోతున్నామని మంత్రి వెల్లడించారు. పోయిన సారి సర్వర్లు కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ.. ఎంతో కమిట్ మెంట్ తో ఇంటింటికి వెళ్లి లబ్దిదారులు అందరికీ పెన్షన్లు అందజేశామన్నారు.

”ఆరోగ్యశ్రీలో రూ.1500 కోట్లు ప్రభుత్వం ఎగ్గొట్టిందని చెబుతున్నారు. ఆలోచన జ్ఞానం ఉన్న వారు ఎవరూ ఇలా మాట్లాడరు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన స్థాయి వ్యక్తి మాట్లాడే మాటలేనా ఇవి. ఒకవేళ ఆరోగ్యశ్రీలో రూ.1500 కోట్లు అప్పు ఉంటే దానికి కారణం జగన్ పాలన కాదా? 45 రోజుల్లోనే చెల్లించాల్సిన పేమెంట్ ని మీరు చెల్లించకపోవడం వల్ల ఎన్నిసార్లు ఆసుపత్రుల యాజమాన్యాలు స్ట్రైక్ ప్రకటించాయి. బకాయిలు కడితేనే వైద్య సేవలు అందిస్తామని ఎన్నోసార్లు చెప్పారు. దీని వల్ల ఎంతో మంది పేదలు ఇబ్బంది పడ్డారు.

జగన్ చేసిన ఆర్థిక అవకతవకల మూలంగా, రాష్ట్రాన్ని ఆర్థికంగా కుదేలు చేయడం వల్ల లక్షల కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయి. కాంట్రాక్టర్లకు, ఆసుపత్రులకు, ఆఖరికి భోజనాలు సప్లయ్ చేసిన వారికి కూడా బిల్లులు ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్రం ఉంది. దాదాపు 11లక్షల కోట్ల అప్పుల ఊబిలో రాష్ట్రాన్ని దించేసిన మీరు.. ఇవాళ నీతులు వల్లిస్తున్నారు. ఆరోగ్యశ్రీకి డబ్బులు చెల్లించడం లేదని ఎంతవరకు సబబో ఆలోచించాలి. ఇటువంటి అబద్దాలను వైసీపీ నాయకులు మానుకోవాలి” అని మంత్రి పార్థసారధి హితవు పలికారు.

ఇప్పటికే పెన్షన్ నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఆగస్టు నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం ప్రభుత్వం రూ.2,737.41 కోట్లను రిలీజ్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 64.82 లక్షల మందికి ఆగస్టు 1 ఉదయం 6 గంటల నుంచే పెన్షన్ల పంపిణీని ప్రారంభించాలని సీఎస్ నీరభ్ కుమార్ ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి 1వ తేదీన 96శాతం, 2వ తేదీన 100శాతం పంపిణీని పూర్తి చేయాలని స్పష్టం చేశారు. వృద్ధులు, వితంతువులకు రూ.4వేలు, దివ్యాంగులకు రూ.6వేలు అందనున్నాయి.

Also Read : పొలిటికల్ బ్రదర్స్.. సరికొత్త చరిత్రకు నాంది పలుకుతున్న పవన్‌ కల్యాణ్, నారా లోకేశ్‌