తెలుగు చిత్రసీమలో గద్దర్‌ అవార్డుల ప్రతిపాదన చిచ్చురేపుతోందా? రేవంత్‌ ఆగ్రహంతో వచ్చిన మార్పేంటి?

Gaddar Awards: అదే సమయంలో సినీ నటుడు బాలకృష్ణ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 50 ఏళ్లు అవుతున్న సందర్భంగా..

తెలుగు చిత్రసీమలో గద్దర్‌ అవార్డుల ప్రతిపాదన చిచ్చురేపుతోందా? రేవంత్‌ ఆగ్రహంతో వచ్చిన మార్పేంటి?

టాలీవుడ్‌లో గద్దర్‌ వర్సెస్‌ ఎన్టీఆర్‌ వివాదానికి తెరలేస్తుందా? సినీ రంగానికి సంబంధం లేని గద్దర్‌ పేరుతో అవార్డులిస్తామనే ప్రభుత్వ ప్రతిపాదన ఇండస్ట్రీ పెద్దలకు నచ్చలేదా? తెలుగు చిత్రసీమకు ఎంతోసేవ చేసిన ఎన్టీఆర్‌ పేరుతో అవార్డులిస్తే బాగుంటుందనే అభిప్రాయంతోనే గద్దర్‌ అవార్డులపై ఇండస్ట్రీ ఆసక్తి ప్రదర్శించడం లేదా? సీఎం రేవంత్‌ ఆగ్రహంతో వచ్చిన మార్పేంటి? ఫిలిం చాంబర్‌, నిర్మాతల మండలి స్పందనతో గద్దర్‌ అవార్డుల దిశగా అడుగులు పడుతున్నట్లేనా?

తెలుగు చిత్రసీమలో గద్దర్‌ అవార్డుల ప్రతిపాదన చిచ్చురేపుతోందా? అనే చర్చ జరుగుతోంది. సీఎంగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత… ప్రజా యుద్ధనౌక గద్దర్‌ పేరిట అవార్డులిస్తామని ప్రతిపాదించారు. సీఎం ప్రకటన చేసి నెలలు దాటుతున్నా, సినీ పరిశ్రమ నుంచి ఎవరూ పట్టించుకోలేదు. దీనికి కారణం సినీ రంగంతో సంబంధం లేని గద్దర్‌ పేరిట అవార్డులు ఏంటన్న చర్చే కారణమనే టాక్‌ ఉంది. ఐతే ఎవరూ ఈ విషయంపై బహిరంగంగా వ్యాఖ్యలు చేయకపోయినా, తన ప్రతిపాదనపై సినీ రంగం నుంచి సానుకూల స్పందన రాకపోవడంపై సీఎం రెండు రోజుల క్రితం ఆగ్రహం వ్యక్తం చేశారు.

సినీ పరిశ్రమలో భిన్నాభిప్రాయాలు
అయితే సీఎం సీరియస్‌ కావడంతో మెగాస్టార్‌ చిరంజీవి… దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. చిరంజీవి సూచనతో ఫిలిం చాంబర్‌, నిర్మాతల మండలి సమావేశమై అవార్డుల ప్రక్రియను ప్రారంభించేందుకు ఎఫ్‌డీసీని కలవాలని నిర్ణయించారు. ఐతే గద్దర్‌ అవార్డులపై సినీ పరిశ్రమలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సినీ పరిశ్రమలో ఎక్కువ మంది ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు ఉండటంతో గద్దర్‌ పేరిట అవార్డులను ఇష్టపడటం లేదని చెబుతున్నారు.

ఇదే సమయంలో సినీ పరిశ్రమకు ఆరాధ్యుడిగా భావించే ఎన్టీఆర్‌ పేరిట అవార్డులిస్తే బాగుంటుందని కొందరు ప్రతిపాదిస్తున్నారంటున్నారు. ఐతే ఎన్టీఆర్‌ పేరిట అవార్డులిస్తే తెలంగాణలో అభ్యంతరం రావొచ్చనే అంచనాతో ప్రభుత్వం అంగీకరించకపోవచ్చే అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు. దీంతో గద్దర్‌కు బదులుగా తెలంగాణకు చెందిన దివంగత నటులు ప్రభాకర్‌రెడ్డి, కాంతారావు తదితరుల పేరుతో అవార్డులిస్తే బాగుంటుందనే ప్రతిపాదన మరికొందరు చేస్తున్నారు. ఐతే ఎవరూ సీఎం దృష్టికి ఈ ప్రతిపాదన తీసుకువెళ్లే సాహసం చేయడం లేదంటున్నారు.

ఇదే సమయంలో సినీ పరిశ్రమపై సీఎం ఆగ్రహానికి మరో కారణం చెబుతున్నారు. గద్దర్‌ అవార్డులను పరిశ్రమ పట్టించుకోకపోవడం ఓ కారణమైతే… అదే సమయంలో సినీ నటుడు బాలకృష్ణ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 50 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఆయనకు సన్మానం చేయాలని తీసుకున్న నిర్ణయమూ ఓ కారణం కావొచ్చని అంటున్నారు. మొత్తానికి గద్దర్‌ అవార్డులపై సీఎం తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తుండటంతో టాలీవుడ్‌ ఎలా ముందుకు వెళుతుందనేది ఆసక్తికరంగా మారింది. సీఎం ప్రతిపాదనలను యథాతథంగా ఓకే చేసేస్తుందా? లేక తెలంగాణ నటుల పేరుతో కొన్ని అవార్డులివ్వాలని ప్రతిపాదిస్తుందా? అనేది చూడాల్సివుంది.

Also Read: నాన్న మంగళగిరిలోనే ఉంటున్నారు.. వదిన కాలికి ఫ్రాక్చర్.. అన్నేమో.. ఫ్యామిలీపై నిహారిక కంప్లైంట్స్..