పాలిటిక్స్‌లో 30 ఇయర్స్‌ అనుభవం ఉన్న నేతలు.. అయినా మౌనం!

తమకు సంబంధం లేని విషయాల్లో కలగజేసుకుని అనవసరంగా బీఆర్ఎస్‌కు టార్గెట్ కావడం ఎందుకని చాలా మంది మంత్రులు సైలెంట్‌గా..

పాలిటిక్స్‌లో 30 ఇయర్స్‌ అనుభవం ఉన్న నేతలు.. అయినా మౌనం!

వాళ్లంతా సీనియర్ మంత్రులు.. ఇప్పుడే కాదు ఉమ్మడి రాష్ట్రంలోనూ మంత్రులుగా పనిచేసిన అనుభవం వారిది. రాష్ట్రంలో అన్ని విషయాలపై సమగ్ర అవగాహన ఉన్న నేతలు. కానీ ఎందుకో ఇప్పుడు ఎక్కువగా మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు. మరీ ముఖ్యంగా అసెంబ్లీలో కొందరు సీనియర్‌ తీరును చూసి కాంగ్రెస్‌ కార్యకర్తలే ఆశ్చర్యపోతున్నారు. వాగ్ధాటిలో తిరుగులేని నేతలు… ఇలా మౌనమునుల్లా మారిపోయేరేంటి? అని చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యేలు సైతం మంత్రుల వ్యవహారశైలిపై పెదవి విరుస్తున్నారు. అసలు సీనియర్‌ మంత్రులకు ఏమైంది? రాజకీయంగా అలసిపోయారా?

కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కొందరు మంత్రుల వ్యవహారశైలిపై ఆ పార్టీలో విస్తృత చర్చ జరుగుతోంది. పాలిటిక్స్‌లో 30 ఇయర్స్‌ అనుభవం ఉన్న నేతలు…. అసెంబ్లీలో అనుసరించిన విధానంపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విపక్షం ధాటిగా దాడి చేసినా, కొందరు మంత్రులు నిమ్మకు నీరెత్తనట్లు ప్రవర్తించడం విమర్శలకు దారి తీస్తోందంటున్నారు. ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలతో విరుచుకుపడితే… అధికార పక్షం పెద్దగా స్పందన కనిపించ లేదన్న వాదన వినిపిస్తోంది.

అసెంబ్లీలో ప్రతిపక్షాల దాడిని తిప్పికొట్టడానికి అనుభవం ఉన్న సభ్యులు లేకపోవడమే కారణమా? అంటీ అదీకాదనే వాదన ఉంది. ఎందుకంటే ప్రస్తుత అసెంబ్లీలో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో సుదీర్ఘ అనుభవం ఉన్నవారే ఎక్కువగా ఉన్నారు. 11 మంది మంత్రుల్లో అంతా సీనియర్లే అయినా… ప్రతిపక్షాల దాడిని అడ్డుకోలేకపోయారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న మెజార్టీ మంత్రుల్లో కొందరు సమైక్య రాష్ట్రంలోనూ అమాత్య పదవులను అనుభవించారు.

అనుభవానికి తగ్గట్టు వ్యవహరించరా?
ఉమ్మడి రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన దామోదర రాజనర్సింహ, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణా రావు ప్రస్తుతం ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు. కానీ, వీరిలో ఒకరిద్దరు తప్ప మిగిలిన వారు ప్రతిపక్ష దాడిని ఎదుర్కోవడంలో అనుభవానికి తగ్గట్టు వ్యవహరించలేదని విమర్శలు ఎదుర్కొంటున్నారు.

బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తే… మంత్రుల నుంచి పెద్దగా స్పందన కనిపించలేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలే పెదవి విరుస్తున్నారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వర రావు, కొండా సురేఖ వారి శాఖలుపై చర్చ జరిగిన సందర్భాల్లో తప్ప, ఇంకెప్పుడూ మాట్లాడకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విర్కమార్క సైతం ఆర్థిక, విద్యుత్ శాఖలపై చర్చ సందర్భంగానే స్పందిస్తున్నారు.

తప్పదు కాబట్టి స్పందిస్తున్నారా?
సీఎం రేవంత్ రెడ్డి సభలో లేని సమయంలో తప్పదన్నట్లు రెస్పాండ్ అవుతున్నారు భట్టి. మరోవైపు శ్రీధర్ బాబు శాసనసభా వ్యవహారాల మంత్రిగా ఉన్నారు కాబట్టి సభలో గందరగోళం నెలకొన్నప్పుడు, సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంటున్న సమయంలో తప్పదు కాబట్టి స్పందిస్తున్నారని, అది కూడా చాలా పరిమిత స్థాయిలోనే మాట్లాడుతున్నారన్న వాదన వినిపిస్తోంది.

ప్రభుత్వంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తప్ప.. మిగతా సీనియర్ మంత్రులు ఎవరూ స్థాయికి తగ్గట్టు విపక్షాన్ని ఎదుర్కోలేకపోయారనే చర్చ జరుగుతోంది. దీంతో సీనియర్లు ఇలా మౌనాన్ని ఆశ్రయించడం వెనుక కారణం ఏమైనా ఉందా? అని ఆరా తీస్తున్నారు.

తమకు సంబంధం లేని విషయాల్లో కలగజేసుకుని అనవసరంగా బీఆర్ఎస్‌కు టార్గెట్ కావడం ఎందుకని చాలా మంది మంత్రులు సైలెంట్‌గా ఉంటున్నారని కొందరు చెబుతుండగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఉన్న దూరం కూడా సీనియర్ మంత్రుల మౌనానికి కారణమన్న టాక్‌ కూడా ఒకటుంది. ఏది ఏమైనా మంత్రుల మౌనాన్ని అదునుగా తీసుకుని బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై దాడి ఎక్కువ చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Also Read: వలంటీర్లు మళ్లీ వచ్చేస్తున్నారు? పకడ్బందీగా వలంటీర్‌ వ్యవస్థను తీర్చిదిద్దాలని సర్కార్‌ యోచన!