వలంటీర్లు మళ్లీ వచ్చేస్తున్నారు? పకడ్బందీగా వలంటీర్‌ వ్యవస్థను తీర్చిదిద్దాలని సర్కార్‌ యోచన!

ఇలా ప్రస్తుతం ఉన్న లక్షా 60 వేల మందిలో కొందరిని ఇతర రంగాలకు పంపి.. మిగిలిన వారిని..

వలంటీర్లు మళ్లీ వచ్చేస్తున్నారు? పకడ్బందీగా వలంటీర్‌ వ్యవస్థను తీర్చిదిద్దాలని సర్కార్‌ యోచన!

ఏపీలో వలంటీర్ల వ్యవస్థపై చర్చకు ఇంకా ఫుల్‌స్టాప్‌ పడటం లేదు. వరుసగా రెండో నెలలోనూ పింఛన్ల పంపిణీకి వలంటీర్లను దూరం పెట్టిన ప్రభుత్వం…. ఇంకా వలంటీర్ల మెడపై కత్తి వేలాడుతున్నట్లేనన్న సంకేతాలు పంపిందా? ఇకపై గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారానే పింఛన్లు పంపిణీ చేస్తే… వలంటీర్ల సేవలను ఎలా వాడుకుంటారు? ఎన్నెన్నో ప్రశ్నలు.. సమాధానాలు చెప్పేది ఎవరు? వలంటీర్‌ వ్యవస్థపై ఎప్పటికి క్లారిటీ వస్తుంది? వలంటీర్ల సందేహాలకు సమాధానమే ఈ స్టోరీ……

రాష్ట్రంలో వలంటీర్ల వ్యవస్థ కొనసాగింపుపై ప్రభుత్వం ఓ నిర్ణయానికి వస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎన్నికల ముందు నుంచి విధులకు దూరంగా ఉన్న వలంటీర్ల సేవలను సమర్థంగా వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఐతే ప్రస్తుతం ఉన్న వ్యవస్థకు బదులుగా మరింత సమర్థవంతమైన… పకడ్బందీగా వలంటీర్‌ వ్యవస్థను తీర్చిదిద్దాలని సీఎం భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో పరిమిత సంఖ్యలోనే వలంటీర్లను వాడుకోవాలని… వారి నుంచి మంచి ఫలితాలు రాబట్టాలని కోరుకుంటోంది ప్రభుత్వం. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న వలంటీర్ల విద్యార్హతలు, వారి నైపుణ్యాలను గుర్తించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున..
గత ప్రభుత్వంలో నియమితులైన గ్రామ, వార్డు వలంటీర్లు.. ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున సంక్షేమ సారథులుగా సేవలందించిన విషయం తెలిసిందే. ఐదే వేల రూపాయల గౌరవ వేతనంతో పనిచేసిన వలంటీర్లు ఎక్కువగా పింఛన్ల పంపిణీకే పరిమితమయ్యారు. పైగా గత ప్రభుత్వంలో వలంటీర్ల పనితీరుపై అనేక విమర్శలు వినిపించాయి. ప్రభుత్వ పథకాల్లో అక్రమాలతోపాటు కొన్ని క్రిమినల్‌ వ్యవహారాల్లో వలంటీర్ల ప్రమేయం ఉంటోందని చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ గతంలో ఆరోపించారు.

ఈ నేపథ్యంలో ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వలంటీర్ల భవితవ్యంపై సందేహాలు మొదలయ్యాయి. ఐతే చిరుద్యోగుల పొట్ట గొట్టాలనే ఉద్దేశం లేని చంద్రబాబు ప్రభుత్వం… క్రిమినల్‌ కార్యకలాపాలు… రాజకీయ సంబంధాలు లేని వారిని కొనసాగించాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో లక్షా 60 వేల మంది వలంటీర్లు ఉన్నారు. గత రెండు నెలలుగా వీరికి వేతనాలు ఇవ్వకపోయినా, క్రమం తప్పకుండా… సచివాలయాలకు వెళుతూ హాజరు వేయించుకుంటున్నారు. దీంతో వీరిలో కొందరిని కంటిన్యూ చేసే విషయమై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు.

శిక్షణ ఇప్పించి ఉద్యోగాలు?
ప్రస్తుతం ఉన్న వలంటీర్లలో ఎవరెవరు ఎంత చదువుకున్నది? ఎవరికి ఏ పనిలో నైపుణ్యం ఉన్నది ఆరా తీస్తోంది ప్రభుత్వం. వలంటీర్‌ పోస్టుకి విద్యార్హతగా పదో తరగతి నిర్ణయించినా…. చాలా మంది డిగ్రీ, పీజీ చేసిన వారు… ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లు కూడా వలంటీర్‌గా సేవలందిస్తున్నట్లు గుర్తించింది ప్రభుత్వం.

పెద్ద చదువులు చదివిన వారు కేవలం ఐదు వేల రూపాయల వేతనానికి పరిమితమవడాన్ని ఇష్టపడని ప్రభుత్వం.. వారికి చదువులకు తగ్గ ఉద్యోగాలను చూపించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. విద్యార్హత, నైపుణ్యం ఆధారంగా శిక్షణ ఇప్పించి ప్రైవేటు, కార్పొరేట్‌ సెక్టార్‌లో ఉద్యోగాలు కల్పించే విషయమే ప్రభుత్వం సీరియస్‌గా పరిశీలిస్తోందని చెబుతున్నారు. ముందుగా వలంటీర్ల విద్యార్హతలపై డేటా సేకరించిన తర్వాత… మిగిలిన వారి విషయంలో తుది నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు.

ఇలా ప్రస్తుతం ఉన్న లక్షా 60 వేల మందిలో కొందరిని ఇతర రంగాలకు పంపి.. మిగిలిన వారిని వలంటీర్లుగా కొనసాగించే చాన్స్‌ ఉందంటున్నారు. ఐతే ప్రస్తుతం ఉన్న 50 ఇళ్ల పరిధిని పెంచి పింఛన్ల పంపిణీ కాకుండా ఇతర విధులను అప్పగించే అవకాశాలపై అధ్యయనం చేయాల్సిందిగా ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. మొత్తానికి సక్రమంగా పనిచేసిన వారి ఉద్యోగాలకు వచ్చిన ముప్పేమీ లేదని… గత ప్రభుత్వ పెద్దలతో అంటకాగిన వారు… ఇతర ఫిర్యాదులు ఉన్నవారిని మాత్రం పక్కకు తప్పించే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

కొడాలి, వల్లభనేనిని వెంటాడుతున్న కర్మఫలం.. ఏం జరుగుతోందో తెలుసా?