Revanth Reddy: పొలిటికల్‌ ఫ్రెండ్‌షిప్.. వైఎస్సార్, కేవీపీ లాగానే ఇప్పుడు రేవంత్ రెడ్డి, వేం నరేందర్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రతి విషయంలో చేదోడు వాదోడుగా ఉంటున్నారు వేం నరేందర్ రెడ్డి.

Revanth Reddy: పొలిటికల్‌ ఫ్రెండ్‌షిప్.. వైఎస్సార్, కేవీపీ లాగానే ఇప్పుడు రేవంత్ రెడ్డి, వేం నరేందర్

Revanth Reddy - Vem Narendar Reddy

పొలిటికల్‌ ఫ్రెండ్‌షిప్ అంటే టక్కున గుర్తొచ్చేది వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కేవీపీ రామచంద్రరావు. వీరిద్దరిని మించిన ఫ్రెండ్‌షిప్‌ మరొకటి లేదనే చెప్పాలి. మనుషులు వేరు కానీ మనసులు, ఆలోచనలు ఒక్కటే.. సేమ్ టు సేమ్ ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్‌లో ఫ్రెండ్‌షిప్‌ అంటే టక్కున గుర్తొచ్చేది ఇద్దరే ఇద్దరు వ్యక్తులు. ఒకరు… తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మరొకరు ఆయన ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డి. వీరు కూడా అచ్చం వైఎస్సార్, కేవీపీ లాగానే.. పాలు, నీళ్లలా కలిసిపోయారు. ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా వీరి మధ్య ఉన్న స్నేహంపై ఓ లుక్కేద్దాం…

పాలిటిక్స్‌లో ఫ్రెండ్‌షిప్‌ అనేది చాలా అరుదుగా ఉంటుంది. రాజకీయాల్లో ఉండే పరిస్థితుల కారణంగా ఎప్పటికప్పుడు సమీకరణాలు మారిపోతుంటాయి. కొందరు మాత్రం పరిస్థితులు ఎలాగున్నా…స్నేహానికే పెద్ద పీట వేస్తారు. పొలిటికల్‌ ఫ్రెండ్‌షిప్‌లో ప్రధానంగా గుర్తుకువచ్చేది దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి, కేవీపీ రామచంద్రరావు.

వీరిద్దరి మధ్య స్నేహం రాజకీయాల్లో ఎవర్‌గ్రీన్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత హైదరాబాద్ బ్రదర్స్‌గా పేరొందిన దివంగత కాంగ్రెస్‌ నేత పి.జనార్ధన్‌ రెడ్డి, ప్రస్తుత బీజేపీ నేత మర్రి శశిధర్ రెడ్డి మధ్య కూడా స్నేహానికి చిరునామాగా నిలిచారు. ప్రస్తుత తెలంగాణ రాజకీయాల్లో అచ్చం అలాంటి స్నేహపూర్వక వాతావరణం ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి మధ్య కొనసాగుతోంది.

బంధం ఇప్పటిది కాదు..
సీఎం రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డిల మధ్య బంధం ఇప్పటిది కాదు… 16 ఏళ్లుగా వీరి మధ్య స్నేహం బంధం కొనసాగుతోంది. అది మరింత బలోపేతం అవుతోంది. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు వేం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీని చేసేందుకు రేవంత్ రెడ్డి గట్టి ప్రయత్నాలు చేశారు. ఆ సందర్భంలోనే ఓటుకు నోటు కేసులో రేవంత్‌ రెడ్డి ఇరుక్కోవాల్సి వచ్చింది.

ఈ కేసులో రేవంత్‌ రెడ్డి ఎన్ని ఇబ్బందులు పడినా గానీ.. వేం నరేందర్ రెడ్డితో స్నేహం మాత్రం కంటిన్యూ చేశారు. వేం నరేందర్ రెడ్డి కూడా రాజకీయంగా ప్రతీ విషయంలో రేవంత్ రెడ్డికి అండగా నిలుస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో ఇద్దరూ కలిసి జర్నీ చేయడం.. ప్రతీ ఆపదలో ఒకరికి ఒకరు తోడు నీడగా నిలుస్తున్నారు.

తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. సీఎం అయ్యాక తన స్నేహితుడికి తగిన ప్రాధాన్యం కల్పించారు. వేం నరేందర్‌ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమించడం ద్వారా తన స్నేహాన్ని చాటుకున్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. మిగతా వారిని ప్రభుత్వ సలహాదారులుగా నియమించినా.. వేం నరేందర్ రెడ్డి ఒక్కరిని మాత్రం సీఎం సలహాదారుగా పక్కన పెట్టుకున్నారు రేవంత్‌ రెడ్డి.

ప్రతి విషయంలో చేదోడు వాదోడుగా..
 ప్రస్తుతం ప్రభుత్వ అధినేతగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రతి విషయంలో చేదోడు వాదోడుగా ఉంటున్నారు వేం నరేందర్ రెడ్డి. సీఎం ఆదేశాలను.. ఆలోచనలను అత్యంత సమర్ధవంతంగా నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం పొలిటికల్‌గా అనేక సందర్భాల్లో వేం నరేందర్ రెడ్డి కీలకపాత్ర పోషిస్తున్నారు.

ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయాల్లో సైతం నరేందర్ రెడ్డి ఉంటున్నారంటేనే సీఎం ఆయనకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే గతంలో రాజశేఖరరెడ్డికి.. కేవీపీ రామచంద్రరావు ఎలాగో.. ప్రస్తుతం రేవంత్ రెడ్డికి వేం నరేందర్ రెడ్డి అచ్చం అలాగే వ్యవహరిస్తున్నారు.

ఫ్రెండ్‌ షిప్‌ డే సందర్భంగా రాజకీయాల్లో సీఎం రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డిల మధ్య బంధం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. కష్ట సుఖాల్లో…ఒకరికొకరు తోడుగా ఉంటూ తమది నిజమైన స్నేహమని నిరూపించారు ఇరువురు నేతలు.

Also Read: వాళ్లకు వణుకు పుట్టేలా వ్యవస్థలను బాగు చేస్తున్నాం: కొల్లు రవీంద్ర