అమరావతి ఆర్5 జోన్‌ లబ్దిదారుల అంశంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

త్వరితగతిన ఇళ్ల కేటాయింపు పూర్తి చేయాలన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.

అమరావతి ఆర్5 జోన్‌ లబ్దిదారుల అంశంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

Amaravati R5 Zone : అమరావతి ఆర్-5 జోన్ లబ్దిదారుల అంశంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడ, గుంటూరు వాసులకు ఆర్-5 జోన్ లో ఇళ్లు కేటాయిస్తూ గత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని చంద్రబాబు సర్కార్ పున:సమీక్షించింది. లబ్దిదారులకు వాళ్ల ప్రాంతాల్లోనే ఇళ్లు కేటాయించాలని కలెక్టర్లను ఆదేశించారు చంద్రబాబు. త్వరితగతిన ఇళ్ల కేటాయింపు పూర్తి చేయాలన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఆర్-5 జోన్ వివాదానికి తెరపడినట్లైంది. రాజధానిలోని ఆర్-5 జోన్ లో ఇళ్ల స్థలాలు పొందిన లబ్దిదారులకు వారి సొంత ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అవసరమైతే వారికి టిడ్కో ఇళ్లలాగా నిర్మించి ఇవ్వాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. గత వైసీపీ ప్రభుత్వం విజయవాడ, గుంటూరు వాసులకు ఆర్5 జోన్ లో ఇళ్లు కేటాయించింది.

ఆర్5 జోన్ వివాదానికి తెరదించే విధంగా సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దీనిపై కలెక్టర్ల సమావేశంలో స్పష్టత ఇచ్చారు. ఆర్5 జోన్ లబ్దిదారులకు వారు నివాసం ఉంటున్న ప్రాంతాల్లోనే ఇళ్ల స్థలాలు కేటాయించాలన్నారు. అవసరమైతే టిడ్కో తరహా ఇళ్లను నిర్మించి వారికి ఇవ్వాలని, ప్రథమ ప్రాధాన్యత వారికే ఇవ్వాలని కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన అధికార యంత్రాంగానికి సీఎం చంద్రబాబు ఆదేశించారు. జగన్ ప్రభుత్వంలో రాజధాని ప్రాంతంలో 1400 ఎకరాల్లో లేఔట్లు వేశారు. 50వేల 793 మందికి ఇంటి పట్టాలు కూడా పంపిణీ చేశారు. దీనికి సంబంధించి రాజధాని ప్రాంత రైతులు హైకోర్టును ఆశ్రయించారు. రాజధాని ప్రాంత మాస్టర్ ప్లాన్ ను చెడగొట్టేలా జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుందని రైతులు ఆరోపించారు.

Also Read : అలా చేస్తే ఎవర్నీ వదిలిపెట్టను.. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు