త్వరలో జన్మభూమి 2, నామినేటెడ్ పదవులు భర్తీ- టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీలో కీలక నిర్ణయాలు

నామినేటెడ్ పోస్టులకు ఎవరి రెకమెండేషన్లు అవసరం లేదు. ఎవరు కష్టపడి పని చేశారో అధినేతకు అన్నీ తెలుసు. త్వరలోనే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని అధినేత చెప్పారు.

త్వరలో జన్మభూమి 2, నామినేటెడ్ పదవులు భర్తీ- టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీలో కీలక నిర్ణయాలు

Tdp Politburo Meeting : త్వరలో జన్మభూమి-2 ని ప్రారంభించాలని టీడీపీ పొలిట్ బ్యూరో నిర్ణయించింది. ఏపీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జన్మభూమి మలివిడతపై నిర్ణయం తీసుకున్నారు. సుమారు 3 గంటల పాటు జరిగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొన్ని నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ కొలిక్కి వచ్చిందని పొలిట్ బ్యూరో సమావేశంలో సీఎం చంద్రబాబు చెప్పారు. దశల వారీగా నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామన్నారు చంద్రబాబు. త్వరలో జన్మభూమి-2 కార్యక్రమం ఉంటుందని ఆయన వెల్లడించారు. ఈ నెల 15న అన్న క్యాంటీన్ల ప్రారంభం ఉంటుందన్నారు. నైపుణ్య గణనను దేశంలోనే తొలిసారిగా ఏపీలో చేపట్టాలనే అభిప్రాయానికి వచ్చారు. త్వరలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని ఇందులో పేర్కొన్నారు. పేదరిక నిర్మూలనపై సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. జిల్లా యూనిట్ గా ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని పొలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయించారు. త్వరలోనే మొదటి దశ నామినేటెడ్ పదవుల భర్తీ చేపట్టాలనే అభిప్రాయానికి వచ్చారు.

నామినేటెడ్ పోస్టులకు ఎవరి రెకమెండేషన్లు అవసరం లేదు- అచ్చెన్నాయుడు
”నామినేటెడ్ పోస్టులకు ఎవరి రెకమెండేషన్లు అవసరం లేదు. ఎవరు కష్టపడి పని చేశారో అధినేతకు అన్నీ తెలుసు. త్వరలోనే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని అధినేత చెప్పారు. అన్ని పనులు వెంట వెంటనే అయిపోవాలని కార్యకర్తలు గాబరా పడుతున్నారు. కార్యకర్తలు సంయమనం పాటించాలి.

పార్టీల వారీగా నామినేటెడ్ పోస్టుల్లో పర్సంటేజ్‌లంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవం. కూటమి తరపున కష్టపడి పని చేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుంది. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా త్వరలో ప్రారంభిస్తున్నాం. పొలిట్ బ్యూరోలో 55 రోజుల పాలనపై చర్చించాము. త్వరలో జన్మభూమి 2 ప్రారంభం కాబోతుంది. జన్మభూమి 2 కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు ఎన్నారైలు, పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి.

వర్షాలతో ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. ప్రాజెక్టులు నిండటంతో వైఎస్ జగన్ గుండె నీరుకారుతోంది. నామినేటెడ్ పోస్టులు అతి త్వరలో భర్తీ చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇసుకలో అక్రమాలు సహించబోనని అధినేత మరోసారి హెచ్చరించారు. జనాభా నియంత్రణ వలన డీ లిమిటేషన్ లో దక్షిణ భారత దేశానికి అన్యాయం జరుగుతోంది. ఒక్క యూపీలో 140 పార్లమెంటు స్థానాలు వస్తే దక్షిణ భారత దేశంలో 160 మాత్రమే ఉంటాయి. జనాభా తగ్గడంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా తగ్గిపోతాయి” అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.

Also Read : శత్రుత్వానికి బైబై..! పిఠాపురంలో ప్రతిపక్షమే లేకుండా చేసేందుకు పవన్ కల్యాణ్ సరికొత్త వ్యూహం..!