వైఎస్ జగన్ సొంత జిల్లాలో పాగా వేయాలని సీఎం చంద్రబాబు స్కెచ్..!

మ‌ళ్లీ 2029లో అధికారంలోకి వ‌స్తామ‌ని, కాస్త ఓపిక పట్టాలని వారిని జగన్ కోరిన‌ట్టు తెలుస్తోంది.

వైఎస్ జగన్ సొంత జిల్లాలో పాగా వేయాలని సీఎం చంద్రబాబు స్కెచ్..!

Gossip Garage : పరువు కోసం ఒకరు, పట్టు కోసం మరొకరు.. ఏది ఏమైనా తన పాగా వేయాలనే ప్రయత్నం ఆ పార్టీది. అపోజిషన్ లో ఉన్నా కుర్చీ మనదే అయ్యి ఉండాలనే కసి మరో పార్టీది. ఒక్కొక్కరికి గాలం వేస్తూ సొంత గడ్డ మీద వైఎస్ జగన్ కు షాక్ ఇవ్వాలని సైకిల్ పార్టీ ప్లాన్ చేస్తుంటే.. సౌండ్ కు రీసౌండ్ ఇచ్చి నిలబడాలనే పట్టుదలతో ఉంది ఫ్యాన్ పార్టీ. పోటాపోటీ రాజకీయాలతో కడప గడపలో పొలిటికల్ రచ్చ కాకరేపుతోంది. ఇంతకీ ఆ పీఠం దక్కించుకునేది ఎవరు? వైసీపీ పరువు నిలబెట్టుకుంటుందా? టీడీపీకి ఆ పీఠం దక్కడ ఈజీనా?

ఆపరేషన్ కడప జడ్పీ స్టార్ట్..
వైసీపీకి పవర్‌ పోయింది. మాజీ సీఎం సొంత జిల్లాలోనే పొలిటికల్ గేమ్‌ స్టార్ట్ చేసింది టీడీపీ. రాష్ట్రమంతా ఎలా ఉన్నా వైఎస్‌ జగన్‌ సొంత జిల్లాలో రాజకీయమంటే కొంత డిఫరెంట్. కానీ మొన్నటి ఎన్నికల్లో కడప జిల్లాలో కూటమి బంపర్ విక్టరీ సాధించింది. ఇప్పుడు ఏకంగా కడప జడ్పీ పీఠంపై కన్నేసింది టీడీపీ. మాజీ సీఎం జగన్‌ సొంత జిల్లాలో పాగా వేసి ఝలక్ ఇవ్వాలని ఫిక్స్ అయింది. అందుకే ఆపరేషన్ కడప జడ్పీని స్టార్ట్ చేసింది. టీడీపీ ఆకర్ష్‌తో వైసీపీ కూడా అలర్ట్ అయింది. దీంతో పోటాపోటీ రాజకీయాలు.. వ్యూహ ప్రతివ్యూహాలు, బుజ్జగింపులు, ప్రలోభాలతో కడప జిల్లా ZPTCల చుట్టూ తిరుగుతోంది రాజకీయం.

మ‌ళ్లీ 2029లో అధికారంలోకి వ‌స్తామ‌ని, కాస్త ఓపిక పట్టాలని జగన్ విన్నపం..
కడప జిల్లాలో మొత్తం 50 ZPTC స్థానాలు ఉన్నాయి. అందులో రెండు ఖాళీగా ఉండగా.. ఒక గోపవరం సభ్యుడు మినహా 48 మంది ZPTCలు వైసీపీ వారే. ఎన్నికలకు ముందు వైసీపీని వీడి టీడీపీలో చేరారు ఐదుగురు జడ్పీటీసీలు. మరో జడ్పీటీసీ బీజేపీ గూటికి చేరారు. అయితే రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని మున్సిపాలిటీలను తమ ఖాతాలో వేసుకుంది టీడీపీ. అందులో భాగంగా కడప జిల్లా జడ్పీ పీఠంపై కూడా ఫోకస్ పెట్టింది. దీంతో వైసీపీ ముందుగానే అలర్ట్ అయింది. మరింత మంది జడ్పీటీసీలు చేజారకుండా.. కడప జడ్పీ చైర్మన్‌ పదవి కూడా దూరం కాకుండా పావులు కదుపుతోంది.

అందులో భాగంగా కడప జిల్లా ZPTCలను విజయవాడకు పిలిపించారు మాజీ సీఎం జగన్. జడ్పీటీసీలతో వేర్వేరుగా సమావేశమైన జగన్‌ టీడీపీ ప్రలోభాల‌కు గురి కావ‌ద్దని సూచించారు. 2014లో వైసీపీ ఓడిపోయిన‌ప్పుడు కూడా ఇక పార్టీ ప‌ని అయిపోయింద‌ని మాట్లాడార‌ని గుర్తు చేశారు. ఆ త‌ర్వాత 2019లో అధికారంలోకి వ‌చ్చామ‌న్నారు. ఇప్పుడు కూడా అలాంటి ప‌రిస్థితే ఉంద‌న్నారు. మ‌ళ్లీ 2029లో అధికారంలోకి వ‌స్తామ‌ని, కాస్త ఓపిక పట్టాలని జడ్పీటీసీలను కోరిన‌ట్టు తెలుస్తోంది.

సొంత జిల్లాలో జడ్పీ పీఠాన్ని వదులుకోవద్దని పట్టుదల..
కడప జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజీనామా చేశారు. జడ్పీ చైర్మన్ పదవి ఖాళీ అయింది. దీంతో జిల్లా పరిషత్ చైర్మన్ పదవి చేజారకుండా కసరత్తు ప్రారంభించింది వైసీపీ. ఇప్పటికే కడప జడ్పీ ఛైర్మన్ అభ్యర్థిగా.. బ్రహ్మంగారి మఠం జడ్పీటీసీ రామగోవిందరెడ్డి పేరును ప్రకటించేశారు మాజీ సీఎం జగన్. ఎట్టి పరిస్థితుల్లో సొంత జిల్లాలో జడ్పీ పీఠాన్ని వదులుకోవద్దని పట్టుదలతో ఉన్నారు ఫ్యాన్ పార్టీ బాస్.

ఈ మధ్యే ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ప‌ద‌విని ఏక‌గ్రీవంగా గెలుచుకున్న వైసీపీ.. అదే హ‌వాను కొన‌సాగించాల‌ని భావిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని ఆరోపణలు ఎదుర్కొన్న జగన్.. ఇప్పుడు ఏకంగా జడ్పీటీసీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారంటే.. కడప జడ్పీ పీఠాన్ని ఎంత ప్రెస్టేజ్‌గా తీసుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు.

Also Read : వీఆర్ఎస్‌పై సీనియర్ ఐఏఎస్ యూటర్న్..! మళ్లీ సర్వీసులోకి తీసుకోవాలని ప్రభుత్వానికి విన్నపం..!

జగన్ సొంత జిల్లాలో వైసీపీని రాజ‌కీయంగా దెబ్బతీయాల‌నే ఆలోచన..
జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో వైసీపీని రాజ‌కీయంగా దెబ్బ తీయాల‌ని టీడీపీ ఆలోచిస్తోంది. ఇందులో భాగంగా వైసీపీ చేతిలో ఉన్న క‌డ‌ప జెడ్పీని సొంతం చేసుకోవాల‌ని ప్లాన్ చేస్తోంది. ఈ విష‌యాన్ని ప‌సిగ‌ట్టిన వైసీపీ హైకమాండ్ ముందుగానే అలర్ట్ అయింది. ఏ ర‌కంగా చూసినా వైసీపీ వైపు 40 మంది సభ్యులు ఉన్నారు. అయితే కూట‌మి అధికారంలో ఉండటంతో.. ప్రలోభాలకో, అధికారం కోసమో జడ్పీటీసీలు వెళ్తారని భావించిన వైసీపీ.. ముందు జాగ్రత్త చర్యలు మొదలు పెట్టింది.