Spam Calls : మీకు స్పామ్ కాల్స్ వస్తున్నాయా? ఎవరైనా ఇలా అడిగితే అసలు నమ్మొద్దు.. తస్మాత్ జాగ్రత్త..!
Spam Phone Calls : టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఆన్‌లైన్ మోసాలు ఎక్కువవుతున్నాయి. ఫేక్ కాల్ సెంటర్లు, నకిలీ కస్టమర్ల సర్వీస్ సెంటర్ల పేరుతో సైబర్ నేరగాళ్లు.. టెలికాం వినియోగదారులను టార్గెట్ చేస్తున్నారు.

Beware of These common online Mobile Phone Selling Scams
Spam Calls : హలో… మేము టెలీకామ్ రెగ్యులేటరి అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి కాల్ చేస్తున్నాం. మీ మొబైల్ నెంబర్ కాసేపట్లో డిస్‌కనెక్ట్ అవుతుంది.. అలా కావొద్దంటే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అప్‌డేట్ చేసుకోవాలి. మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం.. మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందిస్తే.. మీ మొబైల్ నెంబర్‌ను నిరంతరాయంగా ఉపయోగించవచ్చు.. అని ఎవరైనా మీకు కాల్ చేశారా..? భయపడి.. బెదిరిపోయి మీ వ్యక్తిగత సమాచారం మొత్తం చెప్పేశారా..? అయితే, మీరు రిస్క్‌లో పడ్డట్లే?
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఆన్‌లైన్ మోసాలు ఎక్కువవుతున్నాయి. ఫేక్ కాల్ సెంటర్లు, నకిలీ కస్టమర్ల సర్వీస్ సెంటర్ల పేరుతో సైబర్ నేరగాళ్లు.. టెలికాం వినియోగదారులను టార్గెట్ చేస్తున్నారు. వ్యక్తిగత సమాచారం ఇవ్వాలంటూ మోసపూరిత మెసేజ్‌లు, కాల్స్ చేస్తున్నాయి. ఈ వ్యవహారంపై అవగాహనలేనివారు స్కామర్ల చేతికిచిక్కి ఆర్థికంగా, మనసికంగా బలవుతున్నారు.
తాజాగా కాల్ సెంటర్లు, కస్టమర్ సర్వీస్ సెంటర్ల పేరుతో నేరగాళ్లు టెలీకామ్ రెగ్యులేటరి అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి కాల్ చేస్తున్నామంటూ మొబైల్ యూజర్లను బురిడీ కొట్టిస్తున్నారు. మొబైల్ నెంబర్ డిస్‌కనెక్ట్ అవుతుందని.. అలా కావొద్దంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ అప్‌డేట్ చేసుకోవాలని నమ్మబలుకుతున్నారు. ట్రాయ్ నుంచి కాల్ రావడంతో నిజమే అని నమ్ముతున్న కొందరు అమాయకులు.. వారికి తమ వ్యక్తిగత సమాచారం అందిస్తూ మోసపోతున్నారు.
మోసపూరిత కాల్స్ వలలో పడవద్దని టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వినియోగదారులను హెచ్చరించింది. వ్యక్తిగత సమాచారం ఇవ్వకపోతే మొబైల్ నంబరు డిస్‌కనెక్ట్ అవుతుందని బెదిరిస్తూ ట్రాయ్ పేరుతో వచ్చే ఫేక్ కాల్స్‌కు మోసపోవద్దని కోరింది. మొబైల్ నంబరు డిస్‌కనెక్ట్ చేస్తామని మెసేజ్‌లుగాని, ఇతర విధానాల్లోగాని లేదా మూడో పార్టీ ఏజెన్సీ ద్వారాగాని తాము సమాచారం పంపమని ట్రాయ్ స్పష్టం చేసింది.
ఇలా మొబైల్ నంబరు డిస్‌కనెక్ట్ అవుతుందని ట్రాయ్ పేరిట వచ్చే ఎటువంటి సందేశమైనా లేదా కాల్ అయినా కచ్చితంగా మోసం చేయడానికి చేసే ప్రయత్నమేనని వెల్లడించింది. వాటికి స్పందించవద్దని వినియోగదారులను ట్రాయ్ కోరింది. కస్టమర్ సర్వీస్ సెంటర్లు, కాల్ సెంటర్ల పేరుతో వచ్చే కాల్స్.. సంబంధిత కంపెనీలతో క్రాస్ చెక్ చేసుకోవాలని సూచించింది. ఇలాంటి సైబర్ క్రైమ్, ఆర్థిక మోసాలపై టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ సంచార్ సాథీ ప్లాట్‌ఫారమ్‌లో ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది.
మరోవైపు మోసపూరిత మెసేజ్‌లు, కాల్స్‌ను కట్టడి చేసేందుకు టెలికాం నియంత్రణ సంస్థ కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. మెసేజ్ సేవల దుర్వినియోగాన్ని అరికట్టడానికి, మోసపూరిత విధానాల నుంచి వినియోగదారులను రక్షించడానికి నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని టెల్కోలను ఆదేశించింది. సరైన గుర్తింపులేని సర్వీస్ ప్రొవైడర్ల ప్రసారాలను నిలిపేస్తామని ప్రకటించింది. మెసేజ్‌లు, కాల్స్ చేస్తున్నవారి సమాచారం తెలియని యూఆర్‌ఎల్‌లు, ఓటీటీ లింక్‌లను లేదా కాల్ బ్యాక్ నంబర్‌లను సెప్టెంబర్ 1 నుంచి నిలిపేస్తున్నట్లు ట్రాయ్ తెలిపింది.
ఆయా విభాగాల్లోని సర్వీస్ ప్రొవైడర్లు ప్రసారాలు చేయకుండా తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. సమాచారం పంపినవారి నుంచి మెసేజ్ గ్రహీతల వరకు అన్నింటినీ ట్రేస్ చేయడానికి నవంబర్ నుంచి తగిన చర్యలు తీసుకోవాలని ట్రాయ్ నిర్దేశించింది. పారదర్శకతలేని టెలిమార్కెటర్ చైన్ నుంచి వచ్చే సందేశాల ప్రసారం నిలిపివేతకు కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది.