ఈరోజుల్లో న్యాయం కొందరికే..! కూటమి ప్రభుత్వంపై మండిపడ్డ జగన్
రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు. మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజూ దాడులను ప్రోత్సహించలేదు.

Ys Jagan Mohan Reddy : ఏపీలో లా అండ్ అర్డర్ అదుపు తప్పిందని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ప్రభుత్వం మంచి పనులపై దృష్టి పెట్టడం లేదని విమర్శించారు. రెడ్ బుక్ లో పేర్లు పెట్టుకుని ఎవరిని తొక్కాలి, ఎవరిపై కేసు పెట్టాలి అని మాత్రమే ఆలోచన చేస్తున్నారని జగన్ ఆరోపించారు. రాష్ట్రంలో అరాచకాలు, విధ్వంసాలు చేస్తున్నారని కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు జగన్. రాష్ట్రంలో న్యాయం, ధర్మం ఎక్కడా కనిపించడం లేదన్నారు.
”ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులన్నీ మీకు తెలియనివి కావు. రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు. మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజూ దాడులను ప్రోత్సహించలేదు. న్యాయం, ధర్మం అందరికీ ఒక్కటే. న్యాయం, ధర్మం కాపాడేందుకు మనమంతా ఉండాలి అని ఆ రోజుల్లో మనం మాట్లాడితే.. ఈరోజు మాత్రం ఎలా ఉందంటే.. న్యాయం కొందరికి మాత్రమే అన్నట్లుగా తయారు చేశారు ఈరోజు వ్యవస్థలను. లా అండ్ ఆర్డర్ దిగజారిపోయింది. పైనున్న వాళ్లు రెడ్ బుక్ లు పెట్టుకుంటారు. అందులో ఎవరిని తొక్కాలి, ఎవరిని నాశనం చేయాలి, ఎవరి ఆస్తులు ధ్వంసం చేయాలి, ఎవరి మీద కేసులు పెట్టాలి అన్నది అందులో రాసుకున్నారు” అని జగన్ ఆరోపించారు.
Also Read : వీఆర్ఎస్‌పై సీనియర్ ఐఏఎస్ యూటర్న్..! మళ్లీ సర్వీసులోకి తీసుకోవాలని ప్రభుత్వానికి విన్నపం..!
”ఎన్నికలు అయ్యే వరకే రాజకీయాలు. ఎన్నికలు అయిపోయాక మనకు ఓటు వేయని వారు కూడా మన వారే అన్నట్లుగానే ప్రతి అడుగు మనం ముందుకు వేశాం. మనకు ఓటు వేయని వారిని సైతం వెతుక్కుంటూ వెళ్లి మరీ ప్రతి పథకాన్ని డోర్ డెలివరీ చేశాం. మంచి చేసే ప్రతి పనికి శ్రీకారం చుట్టాం. ఎక్కడా కూడా వివక్ష, అవినీతి చూపలేదు. ఓటు వేశారా లేదా అన్నది చూడలేదు. నా మొట్టమొదటి కలెక్టర్ల సమావేశంలో ఆ రోజు నేను చేసిన మాటలు, ఇవాళ చంద్రబాబు మాట్లాడుతున్న మాటలు, చేష్టలు చూస్తే ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మనం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంపిన మేసేజ్.. న్యాయం, ధర్మం అన్నది అందరికీ ఒక్కటే.. న్యాయం ధర్మం కాపాడటానికి మనమంతా ఉండాలి. ఇవాళ మాత్రం న్యాయం కొందరికి మాత్రమే” అన్న రీతిలో చంద్రబాబు పాలన ఉందని ధ్వజమెత్తారు జగన్.
వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులతో జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రతి వైసీపీ కార్యకర్తకు మీ అవసరం ఉందని లీగల్ సెల్ ప్రతినిధులతో జగన్ అన్నారు. డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ ను మరింత బలోపేతం చేస్తామన్నారు. కార్యకర్తలకి అండగా, తోడుగా నిలబడాలని వారికి పిలుపునిచ్చారు. మనం అందరం ఏకతాటిపైకి వచ్చి యుద్ధం చేస్తేనే టీడీపీ అరాచకాలను ప్రజలకు చూపగలం అని లీగల్ సెల్ ప్రతినిధులతో జగన్ అన్నారు.