Anil Ambani : అనగనగా ఇద్దరు అన్నదమ్ములు.. ఒకరేమో కుబేరుడు, ఇంకొకరు దివాలా!

Anil Ambani : అనగనగా ఇద్దరు అన్నదమ్ములు.. ఒకరేమో కుబేరుడు, ఇంకొకరు దివాలా!

Anil Ambani _ How the world's former 6th richest man became bankrupt ( Image Source : Google )

Anil Ambani : ఒకప్పుడు ఆయన బిలియనీర్.. కానీ, ఇప్పుడు కాదు.. సంపద అంతా ఆవిరై పోయింది. బిలియనీర్ స్థాయి నుంచి దివాలా స్థితికి చేరుకున్నారు.. ఆయన ఎవరో కాదు.. అనిల్ అంబానీ.. బిలియన్ల సంపద కాస్తా హారతి కార్పూరంలా ఆవిరైపోయింది. అంబానీ కుటుంబంలో ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీలు ఇద్దరూ అన్నదమ్ములు. వీరిద్దరికి వారసత్వంగా సమానంగా ఆస్తులు సంక్రమించాయి. వీరిలో ముఖేష్ అంబానీ తెలివిగా పెట్టుబడులు పెడుతూ తన సంపదను అంచెలంచెలుగా పెంచుకుంటూ కుబేరుడిగా నిలిచారు. కానీ, అనిల్ అంబానీ చేసిన సొంత తప్పుడు నిర్ణయాలతో అధ: పాతాళానికి చేరుకున్నారు. వారసత్వంగా వచ్చిన సంపద అయినా సరైన పద్ధతిలో వ్యాపారం చేయకపోతే అది తుడిసిపెట్టుకుపోతుందని అనిల్ అంబానీ నిరూపించారు.

సెబీ నిషేధం.. రూ. 25 కోట్ల జరిమానా :
ఒకప్పుడు ప్రపంచంలోనే 6వ ధనవంతుడిగా నిలిచిన ఆయన పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. కొన్నేళ్లుగా ఆయన్ను ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి. ఏది తలపెట్టినా బెడిసికొడుతోంది. దీనికి కారణం.. స్వయంకృపరాధం అంటారుగా అలా ఉంది.. ప్రస్తుత అనిల్ అంబానీ పరిస్థితి. చూస్తుండగానే తరాలు నిలబడాల్సిన సంపద కళ్ల ముందే ఆవిరైపోయింది. దీనికి తోడు.. దశాబ్ద కాలంలో అంబానీపై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ సంస్థ నుంచి పెద్దమొత్తంలో నగదు మళ్లించినట్లుగా తేలింది. దాంతో సెబీ సంస్థ ఏకంగా రూ. 25 కోట్ల రూపాయల జరిమానా కూడా విధించింది. అంతటితో ఆగలేదు.. ఐదేళ్ల పాటు మార్కెట్‌ కార్యకలాపాల్లో పాల్గనకుండా నిషేధం విధించింది. సెబీ నిషేధంతో అనిల్ అంబానీ గ్రూప్ షేర్లు ఒక్కసారిగా 14 శాతానికి పడిపోయాయి.

ముఖేష్‌కు రిలయన్స్.. అనిల్‌కు అడాగ్ :
ఉమ్మడిగా ఉన్నప్పుడు ఇద్దరు అన్మదమ్ముల సంపద సమానంగానే ఉండేది. ఎప్పుడు అయితే విడిపోయారో ముఖేష్ తన తెలివితో అపర కుబేరుడిగా ఎదిగారు. కానీ, అనిల్ అంబానీ మాత్రం తొందరపాటు నిర్ణయాలతో వరుస పరాజయాలతో వెనుకబడిపోయారు. తండ్రి ధీరూభాయ్ అంబానీ మరణానంతరం ముఖేష్, అనిల్ అంబానీలు కలిసే వ్యాపారాలను కొనసాగించారు. కొన్నాళ్లకు ఇలా కుదరదు.. విడిపోయి ఎవరికి వారు రిలయన్స్ గ్రూపు వ్యాపారాలు చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో రిలయన్స్ కంపెనీ ముఖేష్ అంబానీ దక్కించుకున్నారు. కానీ, అనిల్ మాత్రం అడాగ్ తీసుకున్నారు.

Anil Ambani _ How the world's former 6th richest man

Anil Ambani ( Image Source : Google )

ధీరూబాయ్ అంబానీ గ్రూప్ సొంతంగా ఏర్పాటు చేసుకున్నారు. ప్రారంభ రోజుల్లో రిలయన్స్ గ్రూపులోని కొన్ని కీలక వ్యాపారాలను మాత్రం ఇద్దరూ షేర్ చేసుకున్నారు. అప్పట్లో ఇరువురి బిజినెస్ మార్కెట్ వాటా ఒకేలా ఉంది. అలా ఇద్దరు అన్నదమ్ములు బిలియనీర్లుగా ఎదుగుతూ వచ్చారు. రానురాను వ్యాపారంలో పోటీ కారణంగా ముఖేష్ అంబానీ వరుస విజయాలతో ముందుకు దూసుకెళ్లగా.. అనిల్ అంబానీ అడాగ్ కంపెనీ మాత్రం అనేక ఒడుదొడుకులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒక దశలో రిలయన్స్ ఇన్ఫోకామ్ సైతం విఫలమైంది. దాంతో అనిల్ అంబానీ భారీగా నష్టపోవాల్సి వచ్చింది.

కలిసి ఉంటే కలిసొచ్చేదేమో.. :
కలిసి ఉంటే కలదు సుఖం అన్నారు పెద్దలు.. ఈ విషయంలో అనిల్ అంబానీ తప్పటడగు వేశారని చెప్పవచ్చు. అదే ముఖేష్ తో కలిసి అదే వ్యాపారాన్ని ఉమ్మడిగా కొనసాగించి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదనేది కొందరి అభిప్రాయం. ఇద్దరు అన్నదమ్ములు కలిసి వ్యాపారం చేస్తే నష్టాన్ని ఇద్దరూ భరించవచ్చు. కానీ, విడిగా ఎవరి సొంత కుంపటి వారు పెట్టుకుంటే ఆ నష్టాన్ని ఒకరు మాత్రమే భరించాల్సి ఉంటుంది. అనిల్ అంబానీ విషయంలో ఇది అక్షరాలా నిజమైంది. అప్పట్లో పెట్రోల్ బంకులో పనిచేసి తరాలకు సరిపోయేలా ఆస్తులను కూడబెట్టారు తండ్రి ధీరూబాయ్ అంబానీ.. ఆ ఆస్తులను జాగ్రత్తగా కూడబెట్టుకోమని కొడుకులకు అప్పగిస్తే.. వారిలో ఒకరు మాత్రమే నిలబడగా.. మరొకరు దివాలా తీశారు. అనిల్ అంబానీ తన సొంత ఆస్తులు మాత్రమే కాదు.. అంతా అమ్మినా అప్పులు తీరని పరిస్థితికి వచ్చేశారు. ఫలితంగా ఆయనకు దివాలా పిటిషన్లు వేయాల్సి దుస్థితి వచ్చింది.

వాస్తవానికి, తండ్రి ధీరూబాయ్ అంబానీ కూడా రిలయన్స్ రెండుగా చీలేందుకు ఇష్టపడలేదు. తన వారసులు కలిసి వ్యాపారాలు చేయాలనేది ఆయన భావించారు. ఆయన మరణించిన తర్వాత పరిస్థితి మారింది. సొంతంగా వ్యాపారం చేయాలని అనిల్ అంబానీ పట్టుబట్టారు. అందుకు ముఖేష్ అంబానీ మొదట్లో అంగీకరించలేదు. కలిసే వ్యాపారం చేద్దామన్నారు. అంబానీల తల్లి కూడా ఇదే విషయాన్ని చెప్పిచూశారు. కానీ, అనిల్ అంబానీ ససేమిరా అన్నారు. ఎవరూ చెప్పిన వినకుండా ఆస్తులు పంచాల్సిందే.. సొంత వ్యాపారం పెట్టాల్సిందే అన్నట్టుగా చెప్పేశారు. చేసేది ఏమిలేక ఎవరికి వారు విడిపోయారు.

అనిల్ అంబానీ నికర విలువ తగ్గిందిలా :
అనిల్ అంబానీకి ఆర్థిక ఇబ్బందులు కొత్త కాదు. ఫిబ్రవరి 2020లో ఆయన యూకే కోర్టులో అనేక చట్టపరమైన ఆర్థిక సవాళ్ల మధ్య దివాలా తీసినట్లు ప్రకటించారు. ఒకప్పుడు 42 బిలియన్ డాలర్ల విలువైనది. 2008లో ప్రపంచవ్యాప్తంగా 6వ అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ఆ తర్వాత అంబానీ సంపద భారీగా క్షీణించింది. అనిల్ అంబానీ వ్యాపార ప్రయాణం వరుస అపజయాలతో కొనసాగింది. తండ్రి ధీరూభాయ్ అంబానీ 1986లో మరణించిన తర్వాత 1980లలో వ్యాపార ప్రపంచంలో అనిల్ ప్రయాణం ప్రారంభమైంది. టెలికమ్యూనికేషన్స్, పవర్ జనరేషన్, ఫైనాన్షియల్ సర్వీసెస్‌తో సహా కొత్త వెంచర్‌లను అనిల్ చేపట్టారు. ఈ వెంచర్‌లలో చాలా వరకు రుణాలు, భారీగా నిధులు సమకూర్చడంతో గణనీయమైన సవాళ్లు ఎదురయ్యాయి.

Anil Ambani _ How the world's former 6th richest man

Anil Ambani  ( Image Source : Google )

సోదరుడికి అండగా ముఖేష్ అంబానీ  :
అనిల్ అంబానీ ఆర్థిక చిక్కుల్లో మునిగిపోతే.. సోదరుడు ముఖేష్ అంబానీ అపర కుబేరుడిగా పైకి ఎదిగారు. టెలికారం రంగంలోకి అడుగుపెట్టి అద్భుతాలు చేశారు. ఆయన పెట్టిన జియో కంపెనీ ఎలాంటి సంచలనాలు నమోదు చేసిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తాను వ్యాపార సామ్రాజ్యంలో ఎదుగుతుంటే.. తోడబుట్టిన తమ్ముడు ఇలా దివాలా తీస్తుంటే ఏ అన్నకు మాత్రం బాధకు ఉండదు.. అందుకే అనిల్ అంబానీ దివాలా తీసినట్టుగా ప్రకటించిన వెంటనే ముఖేష్ అంబానీ అండగా నిలిచారు. ఎన్నోసార్లు సోదరుడిని ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించారు. స్వీడన్‌ కంపెనీ ఎరిక్‌సన్‌కు ఇవ్వాల్సిన డబ్బులు లేక చేతులేత్తేసి జైలుకెళ్లే పరిస్థితి వచ్చింది.

చివరి నిమిషంలో రంగంలోకి దిగిన ముఖేష్ అంబానీ నిధులు సమకూర్చేందుకు దాదాపు రూ.462 కోట్లు చెల్లించి అనిల్ అంబానీని ఆర్థిక సమస్యల నుంచి బయటపడేశారు. 680 మిలియన్ డాలర్ల రుణం ఎగవేసినందుకు అనిల్ అంబానీపై మూడు చైనా బ్యాంకులు లండన్ కోర్టులో దావా వేశాయి. మరిన్ని చట్టపరమైన సవాళ్లు ఎదురయ్యాయి. 2012లో అనిల్ వ్యక్తిగత పూచీకత్తుతో రుణాలను ఆర్‌కామ్‌కు అందించారు. అయితే, అంబానీ కోర్టులో వాదించారు. తాను కట్టుబడి లేని “వ్యక్తిగత కంఫర్ట్ లెటర్” మాత్రమే అందించానని తన ఆస్తులకు సంబంధించిన హామీని కాదన్నారు. ఈ కేసు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉంది.

కొనసాగుతున్న అంబానీ ఆర్థిక కష్టాలు :
అనిల్ అంబానీ వ్యాపార సామ్రాజ్యానికి ఆర్థిక ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి. 2021లో రిలయన్స్ క్యాపిటల్ గ్రూప్‌లోని మరో కీలక సంస్థ రూ. 24వేల కోట్ల విలువైన బాండ్‌లపై డిఫాల్ట్ అయిన తర్వాత దివాలాకు దాఖలు చేసింది. ముంబై మొదటి మెట్రో లైన్‌ నిర్మాణంలో రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రసిద్ధి చెందింది. ఆ తర్వాత ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంది. ఈ కొనసాగుతున్న సవాళ్లతో దేశంలోని వివిధ పరిశ్రమలపై అనిల్ అంబానీ ప్రభావాన్ని విస్మరించలేం. ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకరి నుంచి తీవ్రమైన ఆర్థిక, చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కొనే వరకు ఆయన ప్రయాణం దిగజారుతూ వచ్చింది. ఇప్పుడు ఆస్తులు కోల్పోయిన అంబానీగా చరిత్రలో నిలిచిపోయారు.