అక్టోబర్ 4 నుంచి 12 వరకు తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.
Tirumala Srivari Varshika Brahmotsavam: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుంచి 12 వరకు కన్నుల పండువగా జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని, అక్టోబర్ నాలుగో తేదీన ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జే. శ్యామలరావు తెలిపారు. శనివారం తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 4న శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. ఆ రోజు రాత్రి పెద్దశేష వాహన సేవలో సీఎం చంద్రబాబు పాల్గొంటారని వెల్లడించారు.
”శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నాం. బ్రహ్మోత్సవాల్లో లడ్డూల కొరత లేకుండా 2 లక్షల లడ్డూలు బఫర్ స్టాక్ ఉంచడం జరుగుతుంది. జిల్లా రెవెన్యూ, టీటీడీ విజిలెన్స్, జిల్లా పోలీసు యంత్రాంగం సమన్వయంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాం. 8వ తేదీ రాత్రి జరిగే గరుడ సేవకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాం. గరుడ వాహనం సేవ సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుంది. వాహన సేవలు ఉదయం 8 గంటలకు, రాత్రి వాహన సేవలు సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతాయి.
భక్తులను ఆకట్టుకునేలా విద్యుత్ దీపాలు, అలంకరణలు చేపట్టడం జరుగుతుంది. మాడ వీధుల్లో భక్తులు వాహన సేవలు వీక్షించడానికి ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నాం. బ్రహ్మోత్సవాల రోజుల్లో దాతలకు గదుల కేటాయింపు రద్దు చేస్తున్నాం, గదులు దొరకని భక్తులు తిరుపతిలోనే బస చేయాలి. పారిశుద్ధ్యం పనులపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాం. భక్తులకు సౌకర్యవంతంగా అదనపు టాయిలెట్లు ఏర్పాటు చేస్తున్నాం. అన్న ప్రసాదాల వితరణ అందరికీ అందేలా చర్యలు తీసుకుంటామ”ని శ్యామలరావు చెప్పారు.
Also Read: టెక్సాస్‌లో 90అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహం.. దీని ప్రత్యేక ఏంటో తెలుసా? వీడియో వైరల్