Dream Home : ముచ్చర్లలో కలల నగరం.. మరో సిటీ నిర్మాణానికి ప్రభుత్వం ప్లాన్‌!

Mucherla Future City : హైదరాబాద్ సిటిలో ఉన్నట్లుగానే రాబోయే 50 ఏళ్లను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వ పెద్దలు డిసైడ్ చేశారు.

Dream Home : ముచ్చర్లలో కలల నగరం.. మరో సిటీ నిర్మాణానికి ప్రభుత్వం ప్లాన్‌!

Dream Home

Dream Home : తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌ల కలయిక అన్న సంగతి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. తాజాగా ఈ మూడు నగరాలకు తోడు మరో కొత్త నగరం త్వరలో రూపుదిద్దుకోబోతుంది. రాజధానిలో ఫోర్త్‌ సిటీకి తెలంగాణ సర్కార్‌ చక్కని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ముచ్చర్లలో మరో అద్బుతమైన నగరానికి పునాధి వేస్తామంటోంది రేవంత్ సర్కార్.

ఇక్కడ వేలాది ఎకరాల భూమి అందుబాటులో ఉండటంతో ఫోర్త్‌ సిటీ పనులు శరవేగంగా జరుగుతాయనే అంచనాలున్నాయి. హైదరాబాద్ సిటిలో ఉన్నట్లుగానే రాబోయే 50 ఏళ్లను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వ పెద్దలు డిసైడ్ చేశారు. ప్రధానంగా విశాలమైన రోడ్లు, త్రాగునీటి సౌకర్యాలు, విద్యావైద్య సౌకర్యాలను అందించేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అధికారులు.

చక్కని ప్లాన్‌తో తెలంగాణ సర్కార్‌ : 
శ్రీశైలం హైవేతో ఈ ప్రాంతానికి ప్రస్తుతం చక్కని రోడ్‌ కనెక్టివిటీ ఉంది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి మెట్రోను ముచ్చర్ల వరకు పొడిగించాలనే ప్లాన్‌ సిద్ధం చేస్తోంది రేవంత్‌ సర్కార్‌. ఓఆర్‌ఆర్‌ నుంచి కందుకూరు, యాచారం నుంచి ముచ్చర్లకు రోడ్డు కనెక్టివిటీ ఇచ్చేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

ప్రభుత్వం ప్రతిపాదించిన రెండో దశ మెట్రోలోనే ముచ్చర్ల మార్గాన్ని సైతం చేర్చేందుకు అధికారులు ప్లాన్ రెడీ చేస్తున్నారు. మెట్రో రూట్‌ను ఎంపిక చేయడం, అలైన్‌మెంట్‌ ఫిక్స్‌ చేయడం, భూ సేకరణ వంటి విషయాలపై త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేలా మెట్రో అధికారులు ప్లాన్ చేస్తున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే మెట్రో రెండో దశలోనే ముచ్చర్ల మార్గానికి డీపీఆర్ సిద్ధం చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక ముచ్చర్ల ప్రాంతంలో ప్రభుత్వం సేకరించిన దాదాపు 14వేల ఎకరాల భూములను వివిధ అవసరాల కోసం కేటాయించేలా అధికారులు ప్లాన్‌ చేస్తున్నారు. 10 జోన్లుగా భూమిని విభజించి కేటాయింపులు చేయనున్నారు. ఇందులో ఎలక్ట్రానిక్‌, జనరల్‌ ఇండస్ట్రీస్‌, లైఫ్‌ సైన్స్‌ హబ్‌, నివాస-వాణిజ్య అవసరాలు, ఆసుపత్రులు, విద్యాలయాలు, క్రీడా మైదానాలు, వినోదం, పర్యాటకం తదితర మౌలిక సదుపాయాల కోసం భూములను కేటాయించాలని నిర్ణయించారు.

ఇక ఫోర్త్‌ సిటీ కోసం ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేయాలని తెలంగాణ సర్కార్‌ యోచిస్తోంది. ఆ ప్రాంతాన్ని అన్ని వర్గాలకు అనువుగా ఉండే ఫ్యూచర్‌ సిటీ మాదిరి నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ ప్రక్రియలో వివిధ విభాగాల మధ్య సమన్వయంతోపాటు ప్రభుత్వ ఆలోచనల అమలును పర్యవేక్షించేలా అథారిటీ పనిచేయనుంది. ఈ అథారిటీకి సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి నేతృత్వం వహించనున్నారని సమాచారం. ఫోర్త్‌ సిటీని ప్రెస్టిజియస్‌గా డెవలప్‌ చేయాలని భావిస్తోన్న సర్కార్‌… హైదరాబాద్‌ మహానగరంలో ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లను పరిగణనలోకి తీసుకుని అభివృద్ధిని ప్రణాళికాబద్ధంగా చేయాలని నిర్ణయించింది.

దీనికోసం ఏర్పాటు చేయనున్న అథారిటీ సైబరాబాద్‌లోని ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌తోపాటు ఢిల్లీ సమీపంలో ఉన్న నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్, గ్రేటర్‌ నోయిడా సహా మరికొన్ని సంస్థల పనితీరును అధ్యయనం చేయనుంది. కొత్త నగరంలో పారిశ్రామిక, పర్యాటక, ఆతిథ్య రంగాలకు కీలక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం కొన్ని జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో సంప్రదింపులు సైతం జరుపుతోంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక అథారిటీ ఆధీనంలో పని చేయడానికి రెవెన్యూ, పట్టణాభివృద్ధి తదితర విభాగాల సిబ్బందిని తీసుకురానున్నారని తెలిసింది.

Read Also : Dream Home : తగ్గేదేలే.. సీజన్ ఏదైనా.. హైదరాబాద్‎లో తగ్గని నిర్మాణ పనులు