ఇక తిరుగులేని శక్తిగా బీఆర్ఎస్..! అందుకోసం కేసీఆర్ వ్యూహం ఏంటి?

పార్టీ అధికారంలో ఉన్నా.... ప్రతిపక్షంలో ఉన్నా కార్యకర్తలను చెక్కుచెదరకుండా చూసుకోవడమే ఈ అధ్యయనం తాలుకా మొయిన్‌ కాన్సెప్ట్‌ అంటున్నారు.

ఇక తిరుగులేని శక్తిగా బీఆర్ఎస్..! అందుకోసం కేసీఆర్ వ్యూహం ఏంటి?

Gossip Garage : ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా మారి… ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావించి… అసెంబ్లీ ఎన్నికల్లో బోల్తాకొట్టిన బీఆర్‌ఎస్‌లో అంతర్మథనం మొదలైందా? శాసనసభ ఎన్నికల్లో ఓటమి చెందిన 8 నెలలకు పార్టీ పునర్నిర్మాణంపై ఫోకస్‌ చేసిందా? ఇతర రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల పనితీరును అధ్యయనం చేస్తున్న బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌… రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ను తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దాలని భావిస్తున్నారట… పార్టీ శ్రేణుల్లో మునుపటి ఉద్యమ పంథాను నూరిపోయడంతోపాటు రాజకీయ వ్యూహరచనలో క్షేత్రస్థాయి నుంచే శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఓవరాల్‌గా బీఆర్‌ఎస్‌ను పక్కా ప్రాంతీయ పార్టీగా తయారు చేసి ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం చేస్తున్నారంటున్నారు.

మార్పు మంత్రం జపిస్తున్న కేసీఆర్..
ఒకపక్క ఎమ్మెల్యేల వలసలు.. ఇంకోవైపు నుంచి తరముకొస్తున్న స్థానిక ఎన్నికలు… అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో నైరాశ్యంలో కూరుకుపోయిన కార్యకర్తలు… ఆపరేషన్‌ ఆకర్ష్‌తో తొడగొడుతున్న కాంగ్రెస్‌ను నిలువరించాల్సిన అవసరం…. అధికార పార్టీ తప్పులను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన కర్తవ్యం… టోటల్‌గా పార్టీని పునర్నిర్మించాల్సిన పరిస్థితులు బీఆర్‌ఎస్‌లో కదలిక తెచ్చినట్లు కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత 8 నెలలుగా పార్టీ వ్యవహారాలను పెద్దగా పట్టించుకోని అధినేత కేసీఆర్‌… ఒక్కసారిగా మార్పు మంత్రం జపిస్తున్నారు. తనను కలిసిన నేతలకు కర్తవ్య బోధ చేస్తూనే మరోవైపు నుంచి పార్టీలో అంతర్గత మార్పులు మొదలుపెట్టారు. పార్టీని అన్ని రకాలుగా విస్తరించడంతోపాటు ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా నడుచుకోవాలని నిర్ణయించి… పార్టీ నేతలకు ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యత అప్పగిస్తున్నారట.

క్యాడర్‌ టు లీడర్‌ రిలేషన్‌ డెవలప్‌ చేయాలని వ్యూహం..
పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రక్షాళన మొదలుపెట్టి… తన సమకాలీకుడు, రాష్ట్ర రాజకీయాల్లో అనుభవజ్ఞుడైన రావుల చంద్రశేఖర్‌రెడ్డికి కార్యాలయ కార్యదర్శిగా కీలక బాధ్యతలు అప్పగించినట్లు చెబుతున్నారు. ఇక పార్టీలో నెంబర్‌ 2 లీడర్లు హరీశ్‌రావుకు ఉత్తర తెలంగాణ వ్యవహారాలను, కేటీఆర్‌కు సెంట్రల్‌ తెలంగాణ పార్టీ ఎఫైర్స్‌కు బాధ్యులుగా చేయాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. మరో సీనియర్‌ నేత, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి దక్షిణ తెలంగాణ బాధ్యతలు అప్పగించి.. మూడు ప్రాంతాలకు ముగ్గురు ఇన్‌చార్జులను నియమించాలని ప్లాన్‌ చేస్తున్నారు కేసీఆర్‌. దీనివల్ల ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి సమాచారం పార్టీ హైకమాండ్‌కు తెలియడంతోపాటు క్యాడర్‌ టు లీడర్‌ రిలేషన్‌ డెవలప్‌ చేయాలని వ్యూహం రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది.

దాన్నే ఓటమికి ప్రధాన కారణంగా గుర్తించిన కేసీఆర్..
రాష్ట్ర ఆవిర్భావానికి ముందు ఉద్యమ పార్టీగా వ్యవహరించిన బీఆర్‌ఎస్‌… పదేళ్ల అధికారంలో ఉండగా పార్టీలో వ్యవస్థాగత నిర్మాణంపై పెద్దగా ఫోకస్‌ చేయలేదనే అభిప్రాయం ఉంది. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత జిల్లాల్లో ఓటమికి ఎవరిని బాధ్యులను చేయాలో… ఎవరిని నిందించాలో తెలియని అయోమయ పరిస్థితి ఎదుర్కొంది. పార్టీలో లోటుపాట్లను తెలుసుకునే యంత్రాంగం లేకపోవడం, ఎక్కువగా పోలీస్‌ ఇంటిలిజెన్స్‌పై ఆధారపడటం వల్ల…. పార్టీలో ఏం జరుగుతుందనే సమాచారం కచ్చితంగా తెలియలేదని అంటున్నారు. ఇదే ఓటమికి ప్రధాన కారణంగా గుర్తించారు కేసీఆర్‌.

ఇతర రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల పనితీరుపై అధ్యయనానికి కమిటీ..
ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పోలీస్‌ ఇంటెలిజన్స్‌ను నమ్మాల్సి రావడం.. కార్యకర్తలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకోలేకపోవడం వల్లే వ్యతిరేకత ఎదుర్కొన్న వారికి మళ్లీ టికెట్లు ఇవ్వాల్సి వచ్చిందంటున్నారు. దీని వల్ల ఎంత నష్టం జరిగిందో ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్న కేసీఆర్‌.. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని పునర్నిర్మించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయకపోవడం, ఉన్నా వాటిని పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల ఎన్నికల్లో దెబ్బతిన్నామని… ఈ తప్పు మళ్లీ రిపీట్‌ కాకుండా ఉండాలంటే పార్టీ పునర్నిర్మాణమే ఏకైక మార్గంగా భావిస్తున్న కేసీఆర్‌… ఇతర రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల పనితీరుపై అధ్యయనానికి ఓ కమిటీని నియమించినట్లు చెబుతున్నారు.

డీఎంకే, ఏఐఏడీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, బీజేడీ పార్టీల పనితీరుపై స్టడీ..
పార్టీలో నిర్మాణ లోపాలను అధిగమించాలని భావించిన కేసీఆర్‌… దేశంలో బలమైన ప్రాంతీయ పార్టీలుగా గుర్తింపు తెచ్చుకున్న డీఎంకే, ఏఐఏడీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, బీజేడీ పార్టీల పనితీరు, వ్యవస్థాగత నిర్మాణాలను అధ్యయనం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆధ్వర్యంలో పార్టీ ప్రతినిధుల బృందాన్ని ఇటీవల చెన్నై పంపినట్లు సమాచారం. ఇదే క్రమంలో వచ్చే నెలలో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ కూడా ఇతర రాష్ట్రాల్లో పర్యటించనున్నట్లు చెబుతున్నారు. పార్టీ అధికారంలో ఉన్నా…. ప్రతిపక్షంలో ఉన్నా కార్యకర్తలను చెక్కుచెదరకుండా చూసుకోవడమే ఈ అధ్యయనం తాలుకా మొయిన్‌ కాన్సెప్ట్‌ అంటున్నారు. దాదాపు 60 లక్షల కార్యకర్తల సభ్యత్వం గులాబీ పార్టీ బలం. వీరందరికీ జిల్లా, రాష్ట్ర స్థాయిలో శిక్షణ ఇవ్వడం ద్వారా సుశిక్షితులైన సైనికులుగా తీర్చిదిద్ది ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని భావిస్తున్నారు కేసీఆర్‌.

Also Read : కూల్చేస్తే తప్పేంటి..? హైడ్రా కూల్చివేతలపై ఎంపీ రఘునందన్ స్పెషల్ ఇంటర్వ్యూ..

సెకండ్‌ క్యాడర్‌ను తయారు చేసుకోవాలని నిర్ణయం..
అధినాయకత్వంపై కార్యకర్తల్లో నమ్మకం ఉన్నా, ద్వితీయ శ్రేణి నాయకత్వంలో నిలకడలేని విషయాన్ని గమనించిన గులాబీ బాస్‌ కేసీఆర్‌…. అలాంటి వారే పార్టీ వదిలివెళ్లిపోతున్నట్లు గుర్తించారు. ఈ కారణంగానే ఇకపై సెకండ్‌ క్యాడర్‌ను సొంతంగా తయారు చేసుకోవాలని నిర్ణయించారు. ఉద్యమ సమయంలో చురుగ్గా వ్యవహరించిన విద్యార్థి నాయకులను ఎమ్మెల్యేలుగా చేస్తే… ఇప్పుడు వారంతా పార్టీకి వెన్నుదన్నుగా నిలిచారని.. ఈ క్రమంలోనే ఇకపై పార్టీ కార్యకర్తల్లో చురుగ్గా ఉన్నవారిని గుర్తించి ప్రోత్సహించాలని నిర్ణయించినట్లు సమాచారం. అందుకే రాష్ట్రంలో ఒక్కో ప్రాంతానికి ఒక్కో ఇన్‌చార్జిని నియమించి చురుకైన వారిని గుర్తించడం, పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతంపై దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు.