కేవలం 5 రోజుల్లోనే.. దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజీ గేట్ల మరమ్మతులు పూర్తి

రేయింబవళ్లు పని చేసిన సిబ్బంది, ఇంజినీర్లు, అధికారులను కన్నయ్యనాయుడు సన్మానించారు.

కేవలం 5 రోజుల్లోనే.. దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజీ గేట్ల మరమ్మతులు పూర్తి

Prakasam Barrage Damaged Gates Repair Works : ప్రకాశం బ్యారేజీ దెబ్బతిన్న గేట్లకు మరమ్మతులు పూర్తి చేశారు. 67, 69, 70 గేట్ల వద్ద దెబ్బతిన్న కౌంటర్ వెయిట్ పనులు పూర్తయ్యాయి. దెబ్బతిన్న వాటి స్థానంలో స్టీల్ తో తయారు చేసిన భారీ కౌంటర్ వెయిట్లు ఏర్పాటు చేశారు ఇంజినీర్లు. కేవలం 5 రోజులలోపే రేయింబవళ్లు శ్రమించి మూడు గేట్ల వద్ద భారీ కౌంటర్ వెయిట్లు ఏర్పాటు పనులు పూర్తి చేశారు ఇంజినీరింగ్ అధికారులు. ఇరిగేషన్ ప్రాజెక్టుల గేట్ల నిపుణులు, ఏపీ జలవనరుల శాఖ అడ్వైజర్ కన్నయ్యనాయుడు ఆధ్వర్యంలో పనులు జరిగాయి.

బెకెమ్ (Bekem) ఇన్ ఫ్రా సంస్థ గేట్ల మరమ్మతులు చేపట్టి పూర్తి చేసింది. రేయింబవళ్లు పని చేసిన సిబ్బంది, ఇంజినీర్లు, అధికారులను కన్నయ్యనాయుడు సన్మానించారు. అటు తమకు మార్గదర్శనం చేసిన నిపుణులు కన్నయ్యనాయుడిని ఇంజినీర్లు, అధికారులు సన్మానించారు.

Also Read : ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీకొన్న ఘటన కేసులో సంచలన విషయాలు..!

ఎట్టకేలకు 5 రోజులు కష్టపడి దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజీ గేట్లకు మరమ్మతులు పూర్తి చేశారు అధికారులు. కన్నయ్యనాయుడి ఆధ్వర్యంలో ఈ పనులు జరిగాయి. ఇవాళ సాయంత్రం 4 గంటల సమయంలో రిపేర్ పనులు పూర్తయ్యాయి. ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ గేట్లకు మరమ్మతులు పూర్తి చేస్తామని, రేపటి నుంచి రాకపోకలు సాగించవచ్చని కన్నయ్యనాయుడు అన్నారు. అదే విధంగా సాయంత్రం 4 గంటల సమయానికి పనులు పూర్తి చేశారు.

ఐరన్ ఓర్ 15 టన్నుల బరువు ఉంటుంది. అనేక పరికరాలు తీసుకొచ్చి అతి తక్కువ సమయంలోనే దెబ్బతిన్న గేట్లకు మరమ్మతులు పూర్తి చేసి కన్నయ్యనాయుడు విజయవాడ ప్రజల మన్ననలు పొందారని చెప్పాలి. అయితే, బోట్లు ఇంకా అలాగే ఉన్నాయి. లిఫ్ట్ చేసి గేట్లను బయటకు తీసుకురావాల్సి ఉంటుంది. గేట్లను తీసేందుకు కొంత సమయం పడుతుందని, వాటిని బయటకు తీసే సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని కన్నయ్యనాయుడు తెలిపారు.

”బోట్లు వచ్చి తగలడం వల్ల 67, 69, 70 గేట్ల కౌంటర్ వెయిట్లు దెబ్బతిన్నాయి. గేట్లు బాగానే ఉన్నాయి. డ్యామేజ్ అయిన కౌంటర్ వెయిట్లు తొలగించి కొత్త వాటిని పెట్టారు. 2002లోనే గేట్లన్నీ మార్చారు. గేట్లన్నీ చెక్ చేపించాం. బాగానే ఉన్నాయి. 11 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు రాలేదు. బోట్లు రాకుంటే ఎలాంటి ఇబ్బందులు వచ్చేది కాదు” అని గేట్ల నిపుణులు కన్నయ్యనాయుడు అన్నారు.