Pests In Blck Gram : మినుము పంట సాగులో తెగుళ్లు, సస్యరక్షణ చర్యలు!

వర్షపు నీటితోనే మినుము పంట పండించవచ్చు. తక్కువ పెట్టుబడి, తక్కువ శ్రమ ఎక్కువ ఆదాయం పొందవచ్చు. మినుము పంటకు చౌడుభూములు పనికిరావు.

Pests In Blck Gram : మినుము పంట సాగులో తెగుళ్లు, సస్యరక్షణ చర్యలు!

black gram cultivation

Pests In Blck Gram : వరి తర్వాత ఎక్కువగా పండించే పంటల్లో మినుము ముందు వరుసలో ఉంటుంది. మినుము పంట సాగుకు మాగాణి, మెట్ట భూములు అనుకూలం. వరి మాగాణుల్లో నవంబర్, డిసెంబర్‌ నేలల్లో మినుము పంటను వేసుకోవచ్చు. మినుము పంటకు ఎక్కువ నీళ్లు అవసరం ఉండదు. వర్షపు నీటితోనే మినుము పంట పండించవచ్చు. తక్కువ పెట్టుబడి, తక్కువ శ్రమ ఎక్కువ ఆదాయం పొందవచ్చు. మినుము పంటకు చౌడుభూములు పనికిరావు. తేమను నిలుపుకోగల భూములు, మురుగు నీరుపోయే వసతి గల భూములు మినుము పంటకు అనుకూలం. మినుము పంటకు వేసవి దుక్కి చేసి తొలకరి వర్షాలు పడగానే గొర్రు తోలి భుమిని మెత్తగా తయారు చేయాలి.

తొలకరిలో ఎకరానికి 6, 5.8 కిలోలు, రబీ మెట్టలో ఎకరానికి 6,5.8 కిలోలు , రబీ మాగాణిలో ఎకరానికి 16 కిలోలు, వేసవి ఆరుతడిలో ఎకరానికి 10-12 కిలోలు ,వేసవి మాగాణిలో ఎకరానికి 16-18 కిలోలు విత్తనాలను విత్తుకోవాలి.

మినుములో తెగుళ్ల నివారణ ;

పల్లాకు తెగులు: ఇది జెమిని వైరస్‌ జాతి వల్ల వచ్చే తెగులు. ఈ తెగులు సోకిన మొక్కల ఆకులు, కాయల మీద పసుపుపచ్చ మచ్చలు ఏర్పడతాయి. తొలిదశలో ఈ వైరస్‌ తెగులు ఆశించినట్టయితే పైరు గిడసబారిపోయి , పూతపూయక ఎండిపోతుంది. ఈ వైరస్‌ తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. దీని నివారణకు పొలంలో పల్లాకు తెగులు సోకిన మొక్కలను పీకి నాశనం చేయాలి. మోనోక్రోటోపాస్‌ 1.6 మి.లీ లీటరు నీటిలో కలిపి ఎకరాకు 200 లీటర్ల నీటిని పిచికారీ చేయాలి.

మరకా మచ్చల పురుగు: ఈ పురుగు మొగ్గ, పూత, పిందె దశల్లో ఆశించి ఎక్కువ నష్టం కలుగజేస్తుంది. పూత దశలో పూలను గూడుగా చేసి లోపలి పదార్థాలను తింటుంది. కాయలు తయారయ్యేటప్పుడు కాయలను దగ్గరగా చేర్చి గూడుగా కాయలకు రంధ్రం చేసి లోపలి గింజలను తినడం వల్ల పంటకు ఎక్కువ నష్టం వాటిల్లుతుంది. దీని నివారణకు క్లోరిఫైరిపాస్‌ 2.5 మి.లీ లీటరు నీటిలో కలిపి ఎకరాకు 200 లీటర్లు పిచికారీ చేయాలి.

ఎండు తెగులు: ఈ తెగులు ఆశించిన మొక్కలు వడిలి, ఎండిపోతాయి. పంటకు అధిక నష్టం కలుగుతుంది. ఈ తెగులు భూమిలో ఉన్న శిలీంధ్రం ద్వారా వ్యాపిస్తుంది. పైరుపై మందులను వాడి నివారించడం లాభసాటి కాదు. తెగులను తట్టుకునే రకాలు వేసుకోవాలి. పొలంలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.