Cattle : పశువుల్లో వడదెబ్బ, నివారణ చర్యలు

వడబెబ్బకు గురైన పశువులను వెంటనే నీడ ప్రాంతంలోకి మార్చి వీలైతే ఫ్యాన్లు లేదా కూలర్ల సాయంతో చల్లని గాలిని అందించాలి. బాగా ఎండగా ఉన్న సమయాల్లో పశువులను చల్లని నీటితో కడగాలి.

Cattle : పశువుల్లో వడదెబ్బ, నివారణ చర్యలు

Cattle

Cattle : వాతావరణంలో ఉష్ణోగ్రతలు అధికమైతే పశువుల శ్వాస, గుండె నాడి మూత్రపిండాల విధులు తగ్గిపోతాయి. దీంతో పశువుల ఆరోగ్యం విషమంగా మారిపోతుంది. కొన్ని సందర్భాల్లో అవి కోమాలోకి వెళ్ళే ప్రమాదం కూడా ఉంటుంది. శ్వాస సరిగా అందక పోవటం వల్ల ఇలా జరుగుతుంది. వేసవి కాలంలో అధిక వేడి కారణంగా పశువులు వడదెబ్బకు లోనవుతాయి. ఈ సమయంలో గాలిలో తేమ అధికంగా ఉండటం, వాతవరణంలో ఉష్ణోగ్రతలు పెరగటం, పశువుల పాకలో సామర్ధ్యంకంటే ఎక్కువగా పశువులు ఉండటం, నీటి లభ్యత తక్కువగా ఉండటం, వడగాలులు, పశువులు ఒత్తిడికి లోనుకావటం వంటి వాటి వల్ల పశువులు వడదెబ్బకు లోనవుతాయి.

పశువుల్లో శరీర ఉష్ణోగ్రత 103 డిగ్రీల సెల్సీయస్ మించుతుంది. చర్మం మృదుత్వం తగ్గిపోయి గట్టిపడుతుంది. నోటితో గాలి పీల్చుకోవడం నోటి వెంట చొంగకారటం వంటివి జరుగుతాయి. ఆవుల్లో పాలదిగుబడి, పునరుత్పత్తి, చూలు కట్టే శాతం తగ్గిపోతుంది. కొన్ని సందర్భాల్లో గర్భస్రావం అయ్యే అవకాశం ఉంటుంది. ఎద్దుల్లో అయితే వంధత్వం వస్తుంది. తీవ్రత ఎక్కువైనప్పుడు పక్షవాతం లక్షణాలు సంభవించి కోమాలోకి వెళ్ళిపోతాయి.

వడబెబ్బకు గురైన పశువులను వెంటనే నీడ ప్రాంతంలోకి మార్చి వీలైతే ఫ్యాన్లు లేదా కూలర్ల సాయంతో చల్లని గాలిని అందించాలి. బాగా ఎండగా ఉన్న సమయాల్లో పశువులను చల్లని నీటితో కడగాలి. చల్లని నీరు అందుబాటులో ఉంచి నొప్పులను తగ్గించటానికి నొప్పి నివారిణి మందును వాడాలి. రక్తంలోకి డైక్టోస్రో సెలైన్, లవణ ద్రావణాలను ఎక్కించాలి. నీటి శాతం అధికంగా ఉండే మేత ను అందించాలి. దాణా, ఉడికించిన ధాన్యాలు పెట్టే సందర్భంలో కాస్త వంటసోడా కలపాలి. దీని వల్ల పశువుల్లో ఎండవేడి కారణంగా వచ్చే అజీర్తి సమస్యను నివారించుకోవచ్చు. పశువుల పాకల చుట్టూ గోనె సంచులు కట్టి వాటికి నీటి తడులు అందించి పాక చల్లగా ఉండేలా చూడాలి.