సిరిసిల్ల కలెక్టర్‌గా వెళ్లాలంటేనే ఐఏఎస్‌ల వెనకడుగు? అక్కడ పోస్టింగ్‌ అంటేనే జంకే పరిస్థితి ఎందుకంటే?

వాస్తవానికి లీవ్‌లో ఉన్న కలెక్టర్ హరిత ఈ నెల 24న రీజాయిన్ అవ్వాల్సి ఉంది. కానీ మరోసారి సెలవు పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకోవడంతో మరో 20 రోజులు ఎక్స్‌టెండ్‌ అయింది.

సిరిసిల్ల కలెక్టర్‌గా వెళ్లాలంటేనే ఐఏఎస్‌ల వెనకడుగు? అక్కడ పోస్టింగ్‌ అంటేనే జంకే పరిస్థితి ఎందుకంటే?

Updated On : December 12, 2025 / 9:23 PM IST

Sirisilla Collector: సిరిసిల్ల కలెక్టర్. ఈ పదం వినగానే టక్కున గుర్తుకొచ్చేది కాంట్రవర్సీ ఐఏఎస్‌ సందీప్ కుమార్‌ ఝా. ఆయన ఉన్నన్ని రోజుల్లో ఏదో ఒక రచ్చతో నిత్యం వార్తల్లో నిలిచారు. కట్‌ చేస్తే ఆయన ట్రాన్స్‌ఫర్ అయిపోయారు. ఆ తర్వాత సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌గా వెళ్లాలంటేనే ఐఏఎస్ అధికారులు వెనకడుగువేస్తున్నారట. ఇక్కడ విపరీతమైన రాజకీయ ఒత్తిళ్లు, కోర్టు నోటీసులు అంటూ చిక్కులు ఫేస్ చేయాల్సి వస్తుందని జంకుతున్నారట.

ప్రాధాన్యం లేని పోస్ట్ అయినా ఫర్వాలేదు కానీ.. సిరిసిల్ల కలెక్టర్‌గా మాత్రం పనిచేయలేమని గుసగుసలు పెట్టుకుంటున్నారట ఐఏఎస్‌ అధికారులు. జిల్లా కేంద్రంగా ఉన్న సిరిసిల్ల నియోజకవర్గానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇంచార్జ్‌గా కేకే మహేందర్‌రెడ్డి ఉండగా..పక్కనే ఉన్న వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ ప్రభుత్వ విప్‌గా కొనసాగుతున్నారు. దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అటు కేకే మహేందర్‌రెడ్డి, ఇటు ఆది శ్రీనివాస్‌ తమ మాట నెగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారట. ఈ క్రమంలో గత కలెక్టర్‌ ఆ ఇద్దరి నేతల మధ్య నలిగిపోయారన్న టాక్ ఉంది. (Sirisilla Collector)

గతంలో సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన సందీప్‌ కుమార్ ఝా..కాంట్రవర్సీ ఆఫీసర్‌గా వార్తల్లో ఎక్కడానికి లోకల్ పాలిటిక్సే కారణమట. ముందుగా కేకే మహేందర్‌రెడ్డి చెప్పినట్లుగా పనిచేసి సందీప్‌కుమార్‌ ఝా బీఆర్ఎస్‌కు టార్గెట్‌ అయ్యారట. లాస్ట్‌కు కేటీఆర్ ఫోటోతో పెట్టుకున్న టీ స్టాల్‌ను తీయించి విమర్శల పాలయ్యారు సందీప్‌కుమార్‌ ఝా. దీంతో ఓ దశలో కేటీఆర్‌..ఆయన కలెక్టర్‌ కాదు, కాంగ్రెస్ కార్యకర్త అని..కాంగ్రెస్ కండువా వేసుకుని కుర్చీలో కూర్చోండని విమర్శించారు.

Also Read: జంపింగ్‌ల మీద జంపింగ్‌లు.. వైసీపీలోకి జంప్‌.. తర్వాత టీడీపీలోనే ఉంటామంటూ స్టేట్‌మెంట్.. ఎందుకిలా?

ఆ తర్వాత అధికార పార్టీ విప్ ఆది శ్రీనివాస్‌కు ప్రోటోకాల్ పాటించకుండా..చివరకు కేకే మహేందర్‌, ఆది శ్రీనివాస్‌ ఎవరి మాట లెక్క చేయకుండా పనిచేసుకుంటూ వెళ్లిపోయారట. దీంతో ఆయనను సిరిసిల్ల నుంచి ట్రాన్స్‌ఫర్ చేశారన్న ప్రచారం ఉంది. అందుకే ఇప్పుడు సిరిసిల్ల కలెక్టర్‌గా ఎవరు వెళ్లాలన్నా..ఇద్దరు అధికార పార్టీ నేతలు..ప్రధాన ప్రతిపక్ష పార్టీ కీలక నేత మధ్య నలిగిపోవాల్సి వస్తుందని టెన్షన్ పడుతున్నారట. పైగా కోర్టు నోటీసులు..భూ పరిహారాలు అంటూ తలనొప్పులు ఉంటాయని సిరిసిల్ల కలెక్టర్‌గా పోస్టింగ్‌ అంటేనే వెనకడుగు వేస్తున్నారట.

విధుల్లో చేరిన హరిత నెల రోజుల్లోపే దీర్ఘకాలిక సెలవులు
సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌గా విధుల్లో చేరిన హరిత నెల రోజుల్లోపే దీర్ఘకాలిక సెలవుల్లో వెళ్లారు. జిల్లా తొలి మహిళా కలెక్టర్‌గా హరిత సెప్టెంబర్‌ 29న బాధ్యతలు స్వీకరించగా..అక్టోబరు 22న లాంగ్‌లీవ్‌పై వెళ్లారు. జిల్లా అదనపు కలెక్టర్‌గా విధుల్లో చేరిన గరీమా అగర్వాల్‌ ఇంచార్జ్‌ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే కలెక్టర్‌గా వచ్చి చార్జ్‌ తీసుకున్న నెల రోజుల వ్యవధిలోనే హరిత లీవ్‌లో వెళ్లడంపై రకరకాల చర్చ జరుగుతోంది. పేరుకు ఛైల్డ్‌కేర్‌ లీవ్‌పై వెళ్లినా..అసలు విషయం మాత్రం వేరే ఉందని అధికారికవర్గాలు అంటున్నాయి.

ఛార్జ్‌ తీసుకున్న రోజుల వ్యవధిలోనే హైకోర్టు నుంచి పిలుపు రావడంతో బాగా ఆమె ఇబ్బందికరంగా ఫీల్ అయ్యారట. అటు అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు, ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి ప్రెజర్‌తో ఏంచేయాలో తెలియక లీవ్‌లో వెళ్లిపోయారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా స్పెషల్ సెక్రటరీ క్యాడర్‌లో ఉన్న తనను తిరిగి జిల్లా కలెక్టర్‌గా పంపించడంపై కూడా ఐఏఎస్‌ హరిత అసంతృప్తిగా ఉండటం కూడా ఓ కారణమంటున్నారు.

వాస్తవానికి లీవ్‌లో ఉన్న కలెక్టర్ హరిత ఈ నెల 24న రీజాయిన్ అవ్వాల్సి ఉంది. కానీ మరోసారి సెలవు పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకోవడంతో మరో 20 రోజులు ఎక్స్‌టెండ్‌ అయింది. డిసెంబర్‌ 12 వరకు ఇంచార్జ్‌ కలెక్టర్‌గా విధుల్లో ఉంటారు గరిమా అగర్వాల్‌. పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ఐఏఎస్‌ల బదిలీలు జరిగే అవకాశాలు లేకపోవడంతో సిరిసిల్ల కలెక్టర్ సెలవుల తర్వాత విధుల్లోకి వస్తారా.? లేక మరోసారి లీవ్ పొడిగింపు కోరతారా అనేది ఉత్కంఠ రేపుతోంది. ఒకవేళ హరిత సిరిసిల్ల కలెక్టర్‌గా కొనసాగడానికి ఆసక్తి చూపకపోతే..ప్రస్తుతం సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్‌ కలెక్టర్‌గా ఉన్న గరిమా అగర్వాల్‌కే పూర్తిస్థాయి బాధ్యతలు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.