Irrigation Management : మొక్కజొన్నలో రైతులు అనుసరించాల్సిన నీటి యాజమాన్య పద్ధతులు !

సాధారణంగా మొక్కజొన్నలో నీటిని సాళ్ళపద్ధతిలో ఇస్తారు. దీని వల్ల చాలా నీరు వృధా అవుతుంది. దీన్ని అధిగమించటానికి నీటిని ప్రత్యామ్నాయ సాళ్ళ పద్ధతిలో ఇవ్వటం మంచిది. ఈ పద్ధతి వల్ల 50 శాతం నీటిని అదా చేసుకోవచ్చు.

Irrigation Management : మొక్కజొన్నలో రైతులు అనుసరించాల్సిన నీటి యాజమాన్య పద్ధతులు !

Water management practices to be followed by farmers in corn!

Irrigation Management : మొక్కజొన్నను ఖరీఫ్ లో వర్షాధార పంటగా సాగు చేస్తారు. ఖరీఫ్ సాగు చేసిన మొక్కజొన్న పంటకు చీడపీడల బెడద ఎక్కువగా ఉంటుంది. పంటనుండి ఆదాయం రావాలంటే మొక్కజొన్నను రబీలో సాగు చేయటం మంచిది. రబీ మొక్కజొన్నకే దిగుబడులు అధికంగా ఉంటాయి. మొక్కజొన్న పంట సాగుకు మొత్తం 450 నుండి 600 మి.మీ నీరు అవసరమవుతుంది.

తక్కువగా నీరు ఉన్నప్పుడు మొక్క అవసరమైన దశల్లో ఇవ్వడం వల్ల దిగుబడులు పెంచుకోవచ్చు. మొక్కకు తొలిదశలో అనగా 30 రోజుల్లోపు తక్కువ నీరు ఉంటే సరిపోతుంది. మొక్క పెరిగే కొద్దీ దాని నీటి అవసరత పెరుగుతుంది. అంటే పూతకు ముందు, పూత దశలో మరియు గింజ పాలు పోసుకునే దశలో నీరు బాగా అవసరం. పంట తొలిదశలో తేమ ఒత్తిడికి గురైతే పంట పూతకు వచ్చే కాలం పెరుగుతుంది.

అదే పూత దశలో మొక్క తేమ ఒత్తిడికి గురైనట్లైయితే దిగుబడులపై అధిక ప్రభావం చూపిస్తుంది. గింజ పాలు పోసుకునే దశలో తేమ ఒత్తిడికి గురైతే 30 శాతం దిగుబడులు తగ్గుతాయి. 40 రోజుల్లో ఉన్న లేత పంటకు అధిక నీరు హానికరం. ఇది కూడా ఖరీఫ్ లో తక్కువ దిగుబడులకు ఒక కారణంగా చెప్పవచ్చు.

సాధారణంగా పంటకాలంలో 6 సార్లు నీటి తడులు అవసరం అవుతాయి. నీరు ఎక్కువగా ఉన్నప్పుడు ఆరు తడులు ఇవ్వొచ్చు. అంటే విత్తిన వెంటనే ఒకటి, మొక్క మోకాలి ఎత్తు పెరిగిన తరువాత ఒకటి, పూత దశలో ఒకటి, 60 రోజుల దశలో ఒకటి, గిజలు పాలుపోసుకునే దశలో ఒకటి, గింజలు గట్టిపడే దశలో ఒకసారి నీరందించాలి. తగిన నీటి యాజమాన్య పద్ధతులు పాటించటం మంచిది.

సాధారణంగా మొక్కజొన్నలో నీటిని సాళ్ళపద్ధతిలో ఇస్తారు. దీని వల్ల చాలా నీరు వృధా అవుతుంది. దీన్ని అధిగమించటానికి నీటిని ప్రత్యామ్నాయ సాళ్ళ పద్ధతిలో ఇవ్వటం మంచిది. ఈ పద్ధతి వల్ల 50 శాతం నీటిని అదా చేసుకోవచ్చు. నీటిని ప్రత్యామ్నాయ సాళ్ళలో ఇవ్వడం వల్ల అంతర ప్రవణం, ప్రవాహ వేగం వంటి నీటి నష్టాలు తగ్గుతాయి. ఈ పద్ధతిలో నీటిని ఇవ్వడం వల్ల సాళ్ళలో సగభాగం నీటితో తడుస్తుంది. మిగిలిన భాగం పొడిగా ఉంటుంది. పొడిభాగంలో ఉన్న వేరు వ్యవస్ధ తేమ ఒత్తిడికి గురై ఎబిసిసిక్ ఆమ్లం అనే హార్మోనును విడుదల చేయడం వల్ల పత్రాల పైన ఉన్న స్టోమాటా మూసుకొని బాష్పోత్సేకము ద్వారా జరిగే నీటి నష్టాన్ని తగ్గిస్తుంది.

మొక్కజొన్నలో బిందు సేధ్యం ;

బిందు సేధ్య పద్ధతిలో తక్కువ నీటిని ఉపయోగించుకుని ఎక్కువ దిగుబడులు వస్తాయి. ఇందులో నీటి ఆవిరి, అంతర శ్రవణం వంటి నీటి నష్టాన్ని తగ్గించుకుని నీటిని సమర్ధవంతంగా వినియోగించుకోవచ్చు. బిందు సేద్య పద్ధతిలో ఎలాంటి ఆకారంలో ఉన్న పొలానికైనా సులభంగా నీటిని అందించవచ్చు. దీని వల్ల పొలం ఏకరూపంగా తడిచి మొక్కలు నీటి ఒత్తిడికి గురికాకుండా ఉంటాయి. దీనికి సబ్సీడీ ఉన్నందువల్ల పెట్టుబడి తగ్గి ఎకరాకు 10వేలు ఖర్చు చేస్తే సరిపోతుంది. అలాగే ఎరువులను నీటితో కలిపి ఇవ్వటానికి కూడా సులభంగా ఉంటుంది.