నాలుగు రంగాలు మినహా మొత్తం పబ్లిక్ సెక్టార్ ను ప్రైవేటీకరణ చేస్తాం

నాలుగు రంగాలు మినహా మొత్తం పబ్లిక్ సెక్టార్ ను ప్రైవేటీకరణ చేస్తాం

MP GVL Narasimha Rao interview : నాలుగు రంగాలు మినహా మొత్తం పబ్లిక్ సెక్టార్ ను ప్రైవేటీకరణ చేస్తామని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. నాలుగు రంగాలు మినహా మిగిలిన పబ్లిక్ సెక్టార్స్ ను ప్రైవేటుపరం చేసి లాభసాటిగా నడపాలనేది ఆర్థిక సంస్కరణ అని అన్నారు. లాభసాటిగా ఉండే ప్రభుత్వ రంగాలను కూడా ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచన ఉందన్నారు. ఆదివారం (ఫిబ్రవరి 7, 2021) జీవీఎల్ నరసింహారావుతో 10 టీవీ ప్రత్యేక ఇంటర్వూ నిర్వహించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ పై ప్రత్యేక దృష్టి పెట్టలేదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఒక్కదాన్నే ప్రైవేటుపరం చేయాలని కేంద్రం ఆలోచన చేయడం లేదని చెప్పారు. నాలుగు సెక్టార్స్ మినహా మిగిలిన అన్ని ప్రభుత్వ రంగం సంస్థలను ప్రవేట్ పరం చేయాలని ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. అటామిక్ ఎనర్జీ, పెట్రోలియం, ఫైనాన్షియల్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, పవర్ సెక్టార్ రంగాలు తప్పించి మిగిలిని వాటిలో కేంద్రం బిజినెస్ చేయదని చెప్పారు. అయితే ఈ ప్రక్రియ నుంచి ఆర్ఐఎన్ ఎల్ ను తప్పించే ప్రయత్నం చేస్తామని చెప్పారు.

2014 కు ముందు కేవలం నాలుగైదు రాష్ట్రాల్లో అధికారినికి పరిమితమైన బీజేపీ ఈరోజు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిందని చెప్పారు. తెలంగాణలో 2014 ఎన్నికల్లో వెనుకబడినప్పటికీ లోక్ సభ ఎన్నికల్లో పుంజుకుని నాలుగు స్థానాలను కైవసం చేసుకున్నామని తెలిపారు. దుబ్బాకలో బీజేపీకి అద్భుతమైన ఫలితం వచ్చిందన్నారు. హైదరాబాద్ కార్పొరేషన్ లో మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో అధికారం చేపడతామని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు కూడా ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు.

తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక పరిస్ధితి ఉందన్నారు. కేంద్రంపై ఆరోపణలు చేసి.. తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చాలనే ఆలోచనతో తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అక్కడ పని చేస్తున్నాయని తెలిపారు. ఏపీలో వైసీపీ.. టీడీపీ ధోరణిని అవలంభిస్తోందన్నారు. వచ్చే ఐదు సంవత్సరాల్లో ఏపీకి 2లక్షల 34 వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రానున్నాయని తెలిపారు. మిగతా దక్షిణాది రాష్ట్రాలకు రాని నిధులు ఏపీకి వస్తున్నాయని చెప్పారు. ఈ బడ్జెట్ లో ఏపీకి 14 ప్రాజెక్టులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఏపీకి నాలుగు పారిశ్రామిక నగరాలను కేటాయించినట్లు చెప్పారు.
కేంద్రం నుంచి ఏ నిధులైనా ఏపీ, తెలంగాణ ముందుంటున్నాయని తెలిపారు.

తిరుపతి ఉప ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాజకీయ విమర్శలు చేస్తున్నారని చెప్పారు. కనుమరుగవుతుందని టీడీపీ భయపడుతుందన్నారు. బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగితే టీడీపీ ఖాళీ అవుతుందని చెప్పారు. తమ ఉనికి కోల్పోతుందని భయపడుతుందని తెలిపారు. టీడీపీ విశ్వసనీయత పార్టీగా లేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో రాజకీయం జరిగిందన్నారు. జనసేనతో కలిసి ప్రత్యామ్నాయంగా ఎదగాలని బీజేపీ పని చేస్తుందన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి పోటీ చేస్తారని తెలిపారు.