కరోనా ఎఫెక్ట్, చిత్తూరు జిల్లాలో టీచర్లకు 15 రోజులు సెలవులు

  • Published By: naveen ,Published On : November 4, 2020 / 03:38 PM IST
కరోనా ఎఫెక్ట్, చిత్తూరు జిల్లాలో టీచర్లకు 15 రోజులు సెలవులు

holidays for government school teachers: చిత్తూరు జిల్లాలో ప్రభుత్వ స్కూళ్లలో కరోనా కలకలం రేగింది. ఇలా స్కూళ్లు ప్రారంభం అయ్యాయో లేదో అప్పుడే కరోనా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. టీచర్లు, విద్యార్థులు కొవిడ్ బారిన పడుతున్నారు. ఇప్పటివరకు 120మంది టీచర్లు, 30మంది విద్యార్థులకు కరోనా సోకింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో విద్యాశాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. టీచర్లకు 15 రోజులపాటు సెలవు మంజూరు చేశారు. స్కూల్స్ లో భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకున్నామని డీఈవో నర్సింహారెడ్డి తెలిపారు.

కరోనా లాక్ డౌన్ కారణంగా ఏపీలో చాలా రోజులు మూతబడిన ప్రభుత్వ స్కూళ్లు రెండు రోజుల క్రితమే(నవంబర్ 2,2020) పున:ప్రారంభమయ్యాయి. విద్యార్థులు, టీచర్లు స్కూళ్లకు హాజరవుతున్నారు. తల్లిదండ్రుల అంగీకార పత్రంతో విద్యార్థులు వస్తున్నారు. స్కూళ్లలో కరోనా జాగ్రత్తలు పాటిస్తూ తరగతులు నిర్వహిస్తున్నారు. అయినా కొన్ని జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా టెన్షన్ పెడుతోంది. ఒకటి రెండు జిల్లాల్లో టీచర్లు, విద్యార్థులకు వైరస్ నిర్థారణ అయ్యింది. వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఈ పరిణామం అటు టీచర్లను, ఇటు విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేసింది.

ప్రకాశం జిల్లాలో నాలుగు జిల్లా పరిషత్ హైస్కూళ్లలో కరోనా కలకలం రేగింది. నలుగురు ఉపాధ్యాయులు, ముగ్గురు విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. జరుగుమల్లి మండలం పచ్చవలో ఇద్దరు విద్యార్థులు, ఓ ఉపాధ్యాయుడు కరోనా బారిన పడగా.. త్రిపురాంతకం హైస్కూల్‌లో ఒక ఉపాధ్యాయుడికి, పీసీపల్లి హైస్కూల్‌లో ఓ విద్యార్థి, ఉపాధ్యాయుడికి కరోనా సోకింది. హనుమంతునిపాడు మండలం పెద్దగొల్లపల్లి హైస్కూల్‌లో ఓ ఉపాధ్యాయుడికి కరోనా పాజిటివ్‌ తేలింది. కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

ఇటు తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం గంగలకుర్రు హైస్కూల్లో మధ్యాహ్న భోజన నిర్వాహకురాలకి కరోనా పాజిటివ్ తేలినట్లు తెలుస్తోంది. ఆమె విద్యార్థులందరికీ భోజనం వడ్డించడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు ముందస్తు జాగ్రత్తగా టెస్టులు చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు స్కూళ్లు తెరిచిన తొలిరోజే 57 మంది టీచర్లు, ఆరుగురు విద్యార్థులకు పాజిటివ్ తేలింది. దీంతో కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని స్కూళ్లకు పంపించడానికి వెనకడుగు వేస్తున్నారు.

కరోనా ప్రభావంతో గత ఏడున్నర నెలలుగా మూతపడిన పాఠశాలలు నవంబర్ 2న రీఓపెన్ అయ్యాయి. తొలుత 9, 10 తరగతులతో పాటు ఇంటర్‌ క్లాసులు స్టార్ట్‌ అయ్యాయి. నవంబర్‌ 23 నుంచి 6,7,8 క్లాసులు.. డిసెంబర్‌ 14 నుంచి 1 నుంచి 5 తరగతులు… నవంబర్‌ 16 నుంచి ఇంటర్‌ ఫస్టియర్‌ తరగతులు ప్రారంభమవుతాయి. కొవిడ్‌ నిబంధనలకు లోబడి తరగతులు నిర్వహించాలని అధికారులను ఆదేశించింది ప్రభుత్వం. ఒక్కో తరగతి గదిలో 16మంది వరకే అనుమతి ఇవ్వాలన్న ప్రభుత్వ ఆదేశాలతో పాఠశాలల్లో గదులు సిద్ధం చేశారు విద్యాశాఖ అధికారులు. బెంచీకి ఒకరు మాత్రమే కూర్చునేలా ఏర్పాట్లు చేశారు.

పదో తరగతి విద్యార్థులు పాఠశాలకు రోజూ రావాలి. 9వ తరగతి విద్యార్థులు రోజు విడిచి రోజు హాజరుకావాల్సి ఉంటుంది. పాఠశాలలో మధ్యాహ్నం భోజనం విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ఉపాధ్యాయులను అధికారులు హెచ్చరించారు. దాంతోపాటు ప్రతి ఒక్క విద్యార్థి మాస్కు ధరించాలని సూచించారు. ఇక భౌతికదూరం పాటించడంతోపాటు శానిటైజర్‌, థర్మల్‌ స్కానర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అటు అన్ని కళాశాలలోనూ కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు ఆదేశించారు. విద్యార్థులు, సిబ్బంది తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. కాలేజీలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు థర్మల్‌ స్కానింగ్‌ చేశాకే తరగతి గదుల్లోకి విద్యార్థులను అనుమతించాలి. ఆరడుగుల దూరంలో విద్యార్థులను కూర్చోబెట్టాలి. కాలేజీలోని గదులను పూర్తిగా శానిటైజేషన్‌ చేయాలి. గ్రూపులుగా విద్యార్థులు ఉండకుండా చర్యలు తీసుకోవడంతోపాటు మొదటి నుంచి చివరి వరకు వారిని మార్చకుండా ఒకే తరగతి గదిలో ఉంచాలని సూచించారు.

ఏపీలో కరోనా వైరస్ కేసులు మళ్లీ భారీగా పెరిగాయి. సోమవారం(నవంబర్ 2,2020) భారీగా తగ్గిన కేసులు.. మంగళవారం(నవంబర్ 3,2020) మాత్రం ఒక్కసారిగా పెరిగిపోయాయి. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు భారీగా నిర్వహించడమే ఇందుకు కారణం అని అధికారులు తెలిపారు. సోమవారం 64 వేల కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా, మంగళవారం ఆ సంఖ్య 84 వేలకు పెరిగింది. దీంతో కేసులు భారీగా పెరిగాయి. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 84వేల 534 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 2వేల 849 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసులు 8లక్షల 30వేల 731కు చేరాయి.