Varla Ramaiah : చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో ఆమెని కూడా అదే జైలుకి పంపిస్తాం, చిప్పకూడు తినిపిస్తాం- వర్ల రామయ్య
మీ అందరి చిట్టా కూడా మా దగ్గరుంది. అధికారంలోకి రాగానే మీకు కూడా రాజమండ్రి జైలులో చిప్పకూడు తినిపిస్తాం. Varla Ramaiah - Chandrababu Arrest

Varla Ramaiah (Photo : Google)
Varla Ramaiah – Chandrababu Arrest : చంద్రబాబు అరెస్ట్ తో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని, ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబుని రాజకీయంగా దెబ్బకొట్టేందుకు ఇది సీఎం జగన్ పన్నిన కుట్ర అని టీడీపీ నాయకులు విరుచుకుపడుతున్నారు.
అయితే, టీడీపీ చేస్తున్న ఆరోపణలను వైసీపీ నేతలు ఖండించారు. చంద్రబాబు నేరం చేశారని, అందుకే అరెస్ట్ అయ్యారని, ఇందులో కక్ష సాధింపు లేదని వైసీపీ నేతలు అంటున్నారు. చంద్రబాబు అనేక స్కామ్ లు చేశారని, ఆయన పాపం పండిందని ఎదురుదాడికి దిగారు.
కాగా, చంద్రబాబుకి జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు ఇవ్వగానే.. వైసీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. మరీ ముఖ్యంగా మంత్రి రోజా ఓ రేంజ్ లో సెలబ్రేషన్స్ చేసుకున్నారు. స్వీట్లు పంచారు, టపాసులు కాల్చారు. డ్యాన్సులు కూడా చేశారు. దీంతో మంత్రి రోజా తీరు హాట్ టాపిక్ గా మారింది.
తాజాగా మంత్రి రోజాపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య పరోక్షంగా నిప్పులు చెరిగారు. రోజా పేరు ఎత్తకుండానే సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబును అరెస్ట్ చేస్తే ఓ మహిళా మంత్రి స్వీట్లు పంచి, బాణాసంచా కాల్చుతూ రోడ్డుపై నృత్యం చేశారు. ఆ మహిళా మంత్రి చరిత్ర బయటికి తీశాం. చెన్నైలో ఎన్ని ఆస్తులు కొన్నారో దస్తావేజులతో సహా సేకరించాం. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో ఆమెను జైలుపాలు చేస్తాం” అని సంచలన వ్యాఖ్యలు చేశారు వర్ల రామయ్య.
అంతేకాదు మాజీమంత్రి పేర్ని నాని, మంత్రులు గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబుల చిట్టా కూడా తమ దగ్గరుందని, అధికారంలోకి రాగానే వారికి కూడా రాజమండ్రి జైలులో చిప్పకూడు తినిపిస్తాం అని వర్ల రామయ్య అన్నారు.
Also Read..Rajinikanth : చంద్రబాబు అరెస్ట్ పై రజనీకాంత్ రియాక్షన్, కీలక వ్యాఖ్యలు చేసిన సూపర్ స్టార్
దర్యాఫ్తు సంస్థల అధికారులు, పోలీసు అధికారులపైనా వర్ల రామయ్య నిప్పులు చెరిగారు. అధికారులు తీరు దారుణంగా ఉందన్నారు. తాము అధికారులం అన్న సంగతే వారు మర్చిపోయారని, ముఖ్యమంత్రి జగన్ ఏజెంట్లలా పని చేస్తున్నారని విరుచుకుపడ్డారు వర్ల రామయ్య. ”ఏం సాధించారని సిట్ అధికారులు? సిట్ కార్యాలయంలో స్వీట్లు పంచుకుంటారు? కొందరు పోలీసు అధికారులు ప్రభుత్వ ఉద్యోగుల్లా, జగన్ కు తాబేదారులా? అర్థం కావడం లేదు. సత్తెనపల్లిలో టీడీపీ కార్యకర్త మెడపై డీఎస్పీ మోకాలితో తొక్కిపెట్టడం హేయమైన చర్య. డీజీపీ వెంటనే డీఎస్పీని సస్పెండ్ చేసి, క్రిమినల్ చర్యలు తీసుకోవాలి” అని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.