100 Years ‘Artos’ drink : పక్కా లోకల్..ఆయ్..ఇది గోదారోళ్ల డ్రింకండీ..ఒక్క గుక్క తాగితే సూపర్ అంటారండీ బాబూ

100 Years ‘Artos’ drink : పక్కా లోకల్..ఆయ్..ఇది గోదారోళ్ల డ్రింకండీ..ఒక్క గుక్క తాగితే సూపర్ అంటారండీ బాబూ

100 Years Artos Drink

AP Special Artos Drink : లోకల్ గా ఉండేది జనాలకు ఎప్పుడూ చులకనే. అందుకే అందని ద్రాక్ష తియ్యన అంటారు. లోకల్ రుచులు..లోకల్ టాలెంట్ లను గురించాల్సిన అవసరం చాలా ఉంది. విదేశీ సరుకు గ్రేటు..స్వదేశీ సరుకు నాటు అనుకునే ఆలోచన పోవాలి. అప్పుడే మేకిన్ ఇండియా కల సార్థకమయ్యేది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు విదేశాల్లో సైతం చెప్పుకుంటారు గోదావరి జిల్లా రుచులు. మర్యాదలు చేయటంలోనే కాదు మంచి మంచి రుచులు..కొత్త కొత్త రుచుల్ని తయారు చేయటంలో గోదావరి జిల్లాల ప్రజల ప్రత్యేకతే వేరు.

డ్రింక్ అంటే థమ్స్ అప్, పెప్సీ లే గుర్తుకొస్తాయి. కానీ గోదావరి జిల్లాలో తయారయ్యే పక్కా లోకల్ సాఫ్ట్ డ్రింక్ ఒక్క గుక్క తాగితే మరో బాటిల్ ప్లీజ్ అనకమానరు. అదే ‘ఆర్టోస్’. ఇది పక్కా లోకల్ శీతలపానీయం..‘ఆర్థోస్ సాఫ్ట్‌ డ్రింకు ఒక్కసారి తాగితే చాలు.. జిహ్వ ‘వహ్వా’ అంటుందంటే అతిశయోక్తి లేదు. ఆ రుచి మళ్లీ మళ్లీ కావాలని తప్పకుండా అంటారు. దాని టేస్ట్ అలా ఉంటందండీ బాబూ ఆయ్..అంటారు. ‘రామచంద్రపురం రాజుగారి డ్రింకు’గా పేరొందిన ఈ శీతల పానీయం ‘ఆర్టోస్’ గురించి తెలియనివారే ఈ ప్రాంతంలో ఉండరంటే అతిశయోక్తి కానేకాదు. కార్పొరేట్‌ కూల్‌డ్రింక్‌ కంపెనీలు ఎన్ని వచ్చినా.. ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రం ‘ఆర్టోస్‌’ 100 ఏళ్లకు పైగా తన రుచిలో గానీ..ప్రత్యేకతలో గానీ ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఈ ఉగాది సందర్భంగా తన సామ్రాజ్యాన్ని మరింత విస్తరించుకోవాలనుకుంటోంది ‘ఆర్తోస్’ సంస్థ.. మరిన్ని రుచులతో సరికొత్త డ్రింకులు తయారు చేసేందుకు శ్రీకారం చుట్టింది.

ఏండీ.. ‘ఆర్టోస్’ ఇంకో బాటిల్ ఇవ్వండే..అనే స్థాయిలో ప్రాచుర్యం పొందింది ఆర్టోస్‌ సాఫ్ట్‌ డ్రింక్‌. దేశంలో ఎక్కడ ఏ డ్రింకులు తాగినా.. గోదావరి జిల్లాలకొచ్చేసరికి మాత్రం ఆర్టోస్‌ తాగందే వెళ్లరంటే వెళ్లరు ఎవ్వరూను. ఒక్కసారి టేస్టు చూస్తే మళ్లీ మళ్లీ కావాలనేలా ఉంటుంది అచ్చం ద్రాక్ష పండ్ల మాదిరిగానే ఉండే దాని రుచి.

గోలీసోడా నుంచి ఆర్టోస్‌ చరిత్ర..మూడు తరాల కృషి
ఆర్టోస్‌ పరిశ్రమ ఈ స్థాయికి రావటానికి మూడు తరాల కృషి ఉంది. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం సిటీకి చెందిన అడ్డూరి రామచంద్రరాజు ‘ఆర్థోస్’కు శ్రీకారం చుట్టారు. కాకినాడ కలెక్టర్‌ కార్యాలయంలో వృథాగా పడి ఉన్న గోలిషోడా మెషీన్‌ను 1912లో కొన్నారు. దాన్ని పట్టుకొచ్చి విశాఖపట్నం పోర్టు ద్వారా ఇంగ్లండ్‌ నుంచి మరిన్ని స్పేర్‌ పార్టులు తెప్పించి..రీ మోడల్ చేశారు. పలు మార్పులు చేర్పులు తరువాత ఆ మెషీన్‌తో రామచంద్రాపురం సిటీలో గోలీసోడా తయారీకి శ్రీకారం చుట్టారు ఆరోజుల్లోనే. గోలీసోడా అంటే పెద్దగా తెలియని ఆరోజుల్లో ఆ గోలిసోడా నుంచి వచ్చే గ్యాస్‌ను చూసి జనాలు భయపడేవారట. ఆ సోడాలో భూతం ఉందని..ఎవ్వరూ తగకండిరా బాబూ అనేవారట.

దీంతో సోడాల అమ్మకం అంతంత మాత్రంగానే ఉండేది. గోలీసోడాల్లో పోసే నీటిని రాజుగారు ఒక్కరే వెల్ల నుంచి తెచ్చుకుని సోడాలు తయారు చేసేవారట. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో రామచంద్రాపురానికి సేద తీరేందుకు వచ్చిన బ్రిటిష్‌ మిలిటరీ సైనికులు ఈ గోలీసోడాను ఇచ్చేవారట రాజుగారు. బ్రిటీష్ సైనికులు ఆ గోలీసోడా టేస్ట్ కు భలే ఫిదా అయిపోయారు. దీంతో ప్రాచుర్యం పొందింది.అదేమని విదేశీలు బాగుందంటేనే గానీ దాని గురించి స్థానికులకు తెలీయలేదు. అర్థం కాలేదు.

1919లో రామచంద్రరాజు తమ్ముడు జగన్నాథరాజు చదువు పూర్తి చేసుకున్న తరువాత ఆ గోలీసోడాకు మరింత వన్నె తెచ్చారు.మద్రాసులో ప్రాచుర్యం పొందిన స్పెన్సెన్స్‌ డ్రింక్‌ తాగిన జగన్నాథరాజు..అటువంటి సాఫ్ట్‌ డ్రింక్‌ తయారు చేయాలని అనుకున్నారు. దానిని తయారు చేసే విధానాన్ని..రా మెటీరియల్ గురించి తెలుసుకున్నారు. అనంతరం లండన్, జర్మనీల నుంచి ముడిసరుకు తెప్పించి 1919లోనే ఏఆర్‌ రాజు డ్రింక్స్‌ పేరుతో సాఫ్ట్‌ డ్రింక్‌ తయారీ ప్రారంభించారు. డ్రింకుకు తయారు చేసే వాటిలో ఒక్క నీరు తప్ప మిగిలిన ముడి సరకులన్నీ విదేశాల నుంచే దిగుమతి చేసుకునే వారు. ఈ డ్రింకులను అప్పట్లో తోపుడు బండ్లు, ఎడ్ల బండ్ల ద్వారా రాజమహేంద్రవరం (రాజమండ్రి) వరకూ అర్ధణా నుంచి మూడు పైసలకు అమ్మేవారు. 1930లో సెమీ ఆటోమెటిక్‌ మెషీన్‌ అమర్చి పెద్ద ఎత్తున డ్రింకులను మార్కెట్‌లోకి తీసుకువచ్చారు.

ఆ తరువాత కొన్నాళ్లకు అంటే డ్రింక్ తయారు చేయటానికి 1955లో ఇంగ్లండ్‌ నుంచి పూర్తి స్థాయి ఆటోమెటిక్‌ మెషీన్‌ రప్పించారు. ఆ డ్రింక్స్‌కు ‘ఆర్టోస్‌’గా పేరు మార్చారు. అలా ‘ఆర్థోస్’ అనేక ఒడుదొడుకులను ఎదుర్కొంటూ అదే సంవత్సరం పేటెంట్ హక్కులు కూడా సంపాదించారు. తరువాత ఆయన కుమారులు పద్మనాభరాజు, సత్యనారాయణరాజులు ఆర్టోస్‌ డ్రింక్‌ను మరింత మెరుగుపరిచారు. విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు ప్రచారాల ద్వారా.

1912 నుంచి ఇప్పటి వరకూ సుమారు ఆరుసార్లు డ్రింక్‌ పలు రకాలుగా మారుతు వచ్చింది. దీంతో సిబ్బందిని పెంచుకుంటూ 1955లో 30 మంది సిబ్బంది ఉంటే దాని సంఖ్య 150కి పెరిగింది. అప్పటి నుంచీ తూర్పుగోదావరి జిల్లాతో పాటు పక్కనే ఉన్న మరో గోదావరి జిల్లా అయిన పశ్చిమ గోదావరి జిల్లాకు,ఉత్తరాంధ్రాలోని విశాఖపట్నం జిల్లాకు కూడా ఈ ఆర్టోస్‌ డ్రింక్‌ను పంపిణీ చేశారు. ఈ కంపెనీకి మూడు జిల్లాల్లోనూ 100 మందికి పైగా డీలర్లు ఉన్నారు.

100 ఏళ్ల తరువాత రెండో యూనిట్‌
ఆర్టోస్‌ ఫ్యాక్టరీ వందేళ్లు పూర్తి చేసుకున్న తరువాత మూడో తరం వారైన ఆర్టోస్‌ బ్రదర్స్‌ అడ్డూరి జగన్నాథవర్మ, వీరభద్రరాజు, రవీంద్రలు పరిశ్రమలో అత్యాధునిక సాంకేతిక పద్ధతులతో రెండో యూనిట్‌ను మంగళవారం ప్రారంభించారు. ప్రముఖ వైద్యుడు డాక్టర్‌ చెలికాని స్టాలిన్, మంత్రి వేణు తనయుడు నరేన్, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గాధంశెట్టి శ్రీదేవి చేతుల మీదుగా దీనిని ప్రారంభించారు. ఇక నుంచి 1.25, 250, 200 మిల్లీలీటర్ల ప్లాస్టిక్‌ బాటిళ్లతో ఇప్పటి వరకూ అందిస్తున్న ద్రాక్షతో పాటు మ్యాంగో, లెమన్, ఆరెంజ్‌ ఫ్లేవర్లలో కూడా డ్రింకులు తయారు చేయనున్నారు. అలాగే సోడాలు కూడా తయారు చేస్తున్నారు.