విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. గడువు పెంపు, అకౌంట్‌లోకి డబ్బులు

ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆ రెండు పథకాలకు కొత్తగా దరఖాస్తు చేసుకునే రిజిస్ట్రేషన్ల గడువుని మార్చి 28వ తేదీ వరకు పొడిగించింది.

విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. గడువు పెంపు, అకౌంట్‌లోకి డబ్బులు

Ap Government Good News For Students

Ap Government Good News For Students : ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన పథకాలకు కొత్తగా దరఖాస్తు చేసుకునే రిజిస్ట్రేషన్ల గడువుని మార్చి 28వ తేదీ వరకు పొడిగించింది ప్రభుత్వం. ఈ రెండు పథకాలకు ముందుగా నిర్ణయించిన గడువు మార్చి 25తో ముగిసింది. అయితే పలువురు విద్యార్థులు ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. వారి నుంచి విజ్ఞప్తులు రావడంతో ప్రభుత్వం గడువుని పెంచింది. వసతి దీవెన, విద్యా దీవెన పథకాలను ఎక్కువ మందికి చేర్చాలన్న లక్ష్యంతో దరఖాస్తు చేసుకోవడానికి గడువును పొడిగించినట్టు ప్రభుత్వం చెప్పింది. వసతి దీవెన కింద విద్యార్థులకు కోర్సును బట్టి రూ.10 నుంచి 20వేల వరకు హాస్టల్ ఫీజు.. విద్యా దీవెన పథకం కింద ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తారు.

ఏప్రిల్ 9న విద్యా దీవెన, 27న వసతి దీవెన డబ్బులు:
కాగా, మహిళల ఖాతాల్లోకి త్వరలోనే డబ్బులు జమ చేయనుంది ప్రభుత్వం. పిల్లలను కాలేజీలకు పంపే తల్లుల ఖాతాల్లో జగనన్న విద్యా దీవెన డబ్బులు జమకానున్నాయి. ఏప్రిల్ 9న జగనన్న విద్యా దీవెన పథకం, ఏప్రిల్ 27న వసతి దీవెన పథకం కింద ఈ ఏడాదికి సంబంధించి డబ్బులను విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేయాలని సీఎం జగన్ సూచించారు. ఈ రెండు పథకాల ద్వారా దాదాపు 10 లక్షల మందికిపైగా విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. గతేడాదితో పోలిస్తే డిగ్రీ అడ్మిషన్లు 2.2లక్షల నుంచి 2.7లక్షలకు పెరిగాయని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. అటు విద్యాశాఖలో ఈ ఏడాది భర్తీ చేయనున్న పోస్టుల క్యాలెండర్ ను ఉగాది రోజున విడుదల చేస్తామని మంత్రి చెప్పారు.

నేరుగా తల్లుల ఖాతాల్లోకి డబ్బులు:
నవరత్నాలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన పథకాలను తీసుకొచ్చి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించేందుకు ప్రభుత్వం ఈ పథకాలను తెచ్చింది. జగనన్న విద్యాదీవెన పథకం కింద విద్యార్థులకు ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కాలేజీలకు కాకుండా నేరుగా అర్హత ఉన్న విద్యార్థుల తల్లుల అకౌంట్లలోకి ప్రభుత్వం జమ చేస్తుంది. తల్లుల ఖాతాల్లో నాలుగు త్రైమాసికాలకు డబ్బు వేస్తారు. తల్లిదండ్రులు మాత్రం కాలేజీకి వెళ్లి ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఇలా చెయ్యడం వల్ల తల్లిదండ్రులు కాలేజీలకు వెళ్లే వీలు ఉంటుందని, ఫీజులు నేరుగా చెల్లించడం వల్ల.. అక్కడ విద్యాబోధన, సౌకర్యాలు, ఇతర వసతుల గురించి తెలుసుకోవడం, పరిష్కారం కాని సమస్యలు ఉంటే అధికారులు దృష్టికి తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

వసతి దీవెన కింద వసతి, భోజన ఖర్చులకు ఆర్థికసాయం:
రాష్ట్రంలో అర్హులైన విద్యార్థులందరికీ అన్ని కోర్సులకు విద్యా దీవెన కింద ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తుంది. అలాగే వసతి దీవెన పథకం కింద వసతి, భోజన ఖర్చులకు ఆర్ధిక సాయం చేస్తుంది. విద్యా దీవెన కింద ఆయా కోర్సులకు చెల్లించాల్సిన ఫీజులను బట్టి ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది. వసతి దీవెన పథకం కింద ప్రతి విద్యా సంవత్సరానికి అయ్యే వసతి, భోజన ఖర్చుల కోసం రూ.20వేలు ఇస్తారు. పాలిటెక్నిక్ కోర్సు చేస్తున్న వారికి రూ.15వేలు, ఐటీఐ కోర్సు చేస్తున్న వారికి రూ.10వేలు ఇస్తారు. కాగా..డిస్టెన్స్ ఎడ్యుకేషన్, కరస్పాండెన్స్‌ కోర్సులు చదివే విద్యార్థులు, మేనేజ్‌మెంట్, ఎన్‌ఆర్‌ఐ కోటా విద్యార్థులకు ఈ స్కీమ్ వర్తించదు.