పాచిపని చేసే భార్య..రిక్షా తొక్కేభర్త..నెరవేరిన సొంతింటి కల ‘ఉత్తమ ఇల్లుగా జాతీయ అవార్డు’

పాచిపని చేసే భార్య..రిక్షా తొక్కేభర్త..నెరవేరిన సొంతింటి కల ‘ఉత్తమ ఇల్లుగా జాతీయ అవార్డు’

AP poor woman Own house dream come true .. Best house .. National Award : నాలుగిళ్లల్లో పాచి పనులు చేస్తూ..చిత్తుకాగితాలు ఏరుకునే ఓ మహిళ..రిక్షా తొక్కే భర్త. ఆ దంపతులు కలిసి కట్టుకున్న సొంత ఇల్లు. వాళ్లు కట్టుకున్న ఇంటి గురించి తెలిస్తే ప్రతీ ఒక్కరూ సొంత ఇంటి కల నెరవేర్చుకోవచ్చుననే ధైర్యం వస్తుంది. స్పూర్తినిస్తుంది. ఆ శ్రమ జీవుల కట్టుకున్న ఓ అపురూపమైన పొదరిల్లులాంటి కలల లోగిలికి ‘‘కేంద్రం ఉత్తమ ఇల్లుగా ఎంపిక చేసింది. ‘జాతీయ అవార్డు’ను ప్రకటించింది.

పెద్దల నుంచి వచ్చిన ఆస్తితో కట్టుకున్న లేదా కొనుకున్న ఇల్లు కంటే మనకు మనమే రూపాయి రూపాయి కూడబెట్టుకున్న డబ్బులతో కట్టుకున్న ఇల్లు చాలా ఆనందాన్నిస్తుంది. అటువంటి ఆనందాన్ని మనసారా తమ కలల లోగిలి కలలను సాకారం చేసుకున్న ఏపీలోకి కృష్ణాజిల్లాలోని శ్రమజీవులు.

ఆకట్టుకునే ఇంటి నిర్మాణం
అందంగా.. పొందికగా.. నిర్మించుకున్న ఈ డాబాను చూస్తే ఇదేదో చాలా ధనవంతులు కట్టుకున్న ఇల్లులా అనిపిస్తుంది. ఈ ఇంటి నిర్మాణం బైటనుంచి చూడటానికే కాదు ఇంటి లోపలికి వెళ్లి చూస్తే..కళ్లు చెదిరిపోతాయి. ఎంతో ముందస్తు ప్రణాళికతో కట్టుకున్న ఇల్లులా అనిపిస్తుంది. మార్బుల్‌ ఫ్లోరింగ్‌, ఆహ్లాదాన్ని కలిగించే పెయింటింగ్‌, ఆల్‌టెక్‌ గోడలు.. పక్కా సీలింగ్‌తో అట్టహాసంగా..ఆర్భాటంగా కనిపించి కనువిందు చేస్తుంది.

ఇంత అందంగా పొందికగా కనిపించే ఈ ఇల్లు శ్రీమంతులది మాత్రం కాదు. ఓ రిక్షా కార్మికుడు..నాలుగిళ్లలో పాచి పనులు చేస్తూ.. చిత్తు కాగితాలు ఏరుకుని అమ్ముకునే అతడి భార్య ముంగి శాంతి కట్టుకున్న కలల లోగిలి. ఇది ఏపీలోని కృష్ణా జిల్లా నందిగామ ఉందీ ఇల్లు.

సొంతింటి కలను సాకారం చేసుకున్న పాచి పనులు చేసుకునే శాంతి
పాచిపనులు చేసుకునే ఎవరైనా తమ జీవితంలో సొంతిల్లు కట్టుకోవాలనే కల నెరవేరుతుందా? అసలది సాధ్యమేనా అనుకుంటారు. కానీ కష్టపడి..సంకల్పించుకుంటే సాధ్యం అవుతుందని ఈ పేద కార్మికులు నిరూపించి చూపించారు. సొంత ఇల్లు కట్టుకోవాలనేది పని మనిషిగా పనిచేసే శాంతి కల. శాంతి భర్త రిక్షా తొక్కుతుంటాడు. వీరిద్దరికి ఇద్దరు పిల్లలు. నాలుగిళ్లలో పనిచేస్తున్న ఆమె..తను పనిచేసే ప్రతి ఇంటిని పరిశీలించేది. తనకు నచ్చిన ప్లాన్ ను చూసి ఇటువంటి ఇల్లు కట్టుకోవాలని అనుకునేది. కలలు కనేది.

ఆ కలను నెరవేర్చుకోడానికి..తన భర్తతో కలిసి కష్టపడింది. పక్కాగా భార్య భర్తలిద్దరు ప్లాన్ వేసుకున్నారు. డబ్బు కూడబెట్టి ఇల్లు కట్టుకోవాలని సంకల్పించుకున్నారు.
శాంతికి పెళ్లైన కొత్తలో దంపతులిద్దరూ కలిసి నందిగామ చెరువు బజారులో రెండు సెంట్ల స్థలాన్ని కొనుక్కున్నారు.

తరువాత ఇద్దరూ తమ కష్టాన్ని తాము నమ్ముకున్నారు. ఇద్దరూ కష్టపడిన డబ్బుల్ని ఖర్చులకు పోగా పొదుపు చేసుకున్నారు. శాంతి ప్రభుత్వం మహిళ సాధికారత కోసం ఇచ్చే డ్వాక్రా గ్రూపులో కొనసాగుతున్న క్రమంలో దానికి తోడు 2017లో రూ.40వేలు డ్వాక్రా రుణం తీసుకుని తాము కొనుక్కున్న స్థలంలో ఇంటి పని మొదలు పెట్టారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ‘హౌసింగ్‌ ఫర్‌ ఆల్‌’ పథకానికి దరఖాస్తు చేసుకుంది శాంతి. ఈ పథకం కింద శాంతికి రూ.2.50 లక్షల ఆర్థిక సహకారం అందింది.

పొదుపుచేసుకున్న డబ్బుతో నెరవేరిన సొంతింటి కల
ఇల్లు కట్టుకునేందుకు పొదుపు చేసిన డబ్బులతో కొంత భాగాన్ని చిట్టీలు వేసి కొంత సమకూర్చుకుంది. అనంతరం ఇంటిపట్టా తాకట్టు పెట్టి మరికొంత డబ్బు తెచ్చుకుంది. ఆ తరువాత కొంత డబ్బు అప్పు తీసుకుంది. వారిమీద నమ్మకంతో లక్షల రూపాయలు అప్పు పుట్టింది. అలా ఇంటి నిర్మాణంలోనూ శాంతి దంపతులు ఎక్కడా రాజీ పడకుండా తమకు ఇష్టమైన ప్లాన్ తో ఇష్టమైన మోడల్ తో రాజీపడకుండా నిర్మాణం కొనసాగించారు.

శాంతి పెద్దగా చదువుకోలేదు. ఇంటి నిర్మాణానికి సంబంధించిన అవగాహన కూడా లేదు. కానీ లోక జ్ఞానం మాత్రం మెండుగా ఉంది. తాను పనిచేసే ఇళ్లను పరిశీలించేది. తన ఇల్లు ఎలా ఉండాలో ముందే ప్లాన్ వేసుకంది. దానికి అనుగుణంగా ప్లాన్ వేసిన మేస్త్రీకి తన ఇల్లు ఎలా ఉండాలో చెబుతూనే వాస్తును కూడా ఫాలో అవుతూ ప్లాన్ వేయించుకుంది. అలా ఇంటి నిర్మాణంలో కూడా అన్నింటా తానే అయినట్లుగా తాపీ మేస్త్రీలకు సూచనలు ఇస్తూ..ఇంటి నిర్మాణంలో ఎక్కడా రాజీ పడలేది శాంతి. అలా కష్టంతో నిర్మించుకున్న ఇంటికి ఓ రూపు వచ్చింది. దాన్ని చూసిన శాంతి దంపతుల సంతోషానికి హద్దులు లేవు.

ఉత్తమ ఇల్లు.. జాతీయ అవార్డు
శాంతి ముచ్చటపడి నిర్మించుకున్న ఇల్లు జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ‘ఇన్నోవేషన్‌ కన్‌స్ట్రక్షన్‌ టెక్నాలజీ’ అవార్డుకు ఎంపికైంది. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పట్టణ పథకంలో భాగంగా కేంద్ర గృహ నిర్మాణ శాఖ ఉత్తమ ఇంటి నిర్మాణం విభాగంలో భాగంగా శాంతిని ఈ అవార్డుకు ఎంపిక చేసింది. నూతన సంవత్సరం రోజున ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆమె అవార్డు స్వీకరించనుంది. శాంతితో పాటు విశాఖపట్నానికి చెందిన సత్రబోయిన దుర్గ, ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన మందలపు అనంతలక్ష్మి ‘ఇన్నోవేషన్‌ కన్‌స్ట్రక్షన్‌ టెక్నాలజీ’ అవార్డుకు ఎంపికయ్యారు.

తన సొంత ఇంటి కలను నెరవేర్చుకున్న శాంతి మాట్లాడుతూ..మేము చాలా పేదోళ్లం. రెక్కాడితేనే గానీ డొక్కాడని పేదలం. కష్టపడి కూడబెట్టుకున్న సొమ్ముతో ఎప్పుడో కొనుక్కున్న రెండు సెంట్ల స్థలంలో శక్తికి మించి అప్పులు చేసి మంచి ఇల్లు కట్టుకున్నాం. మేం కట్టుకున్న మా కలల ఇంటికి జాతీయ అవార్డు వచ్చిందంటే నమ్మలేకుండా ఉన్నామని ఎంతోసంబరంగా చెప్పింది. అంతా కలలాఉందని నమ్మలేకపోతున్నానని ఉబ్బి తబ్బిబ్బు అవుతు చెప్పారు శాంతి దంపతులు.

మా వచ్చిన ఈ అవార్డు గురించి తెలిసి ఎవరెవరో ఫోన్లు చేసి అడుగుతున్నారు. మాకు ఇవేమీ తెలీవు. అప్పుల నుంచి బయటపడటానికి ఎవరైనా తోడ్పాటునందిస్తే వారికి రుణపడి ఉంటామనీ..తాము మాత్రం తమ కష్టాన్నే నమ్ముకున్నామని అంతులేని ఆత్మవిశ్వాసంతో చెబుతోంది శాంతి. ‘‘ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలి’’అని పెద్దలు చెప్పిన సామెత. కానీ ఈ నాటి మహిళల్ని చూస్తే ఇల్లు కట్టాలి అంటే ఇల్లాలి ప్లాన్ ఉండాలి అనాలేమో..శాంతిలాంటి మహిళామణుల్ని చూస్తే..